Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, నాగార్జున కాలనీ, చక్రిపురం, చర్లపల్లి, బీఎన్‌రెడ్డి నగర్ ప్రాంతాల్లో అక్రమషెడ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఎలాంటి అనుమలూ లేకుండా అధికారపార్టీ నాయకుల అండతో ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఈ విషయమై ప్రశ్నించినా, ఫిర్యాదు చేసినా కొందరు అధికార పార్టీ నాయకులు అధికారులనే బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమ నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఎనో ఆదేశాలు జారీ చేసినా అమలులో కానరావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పేద ప్రజల ఇండ్లు కట్టుకుంటే రకరకాల ఆంక్షలు విధించి, ఇబ్బందులకు గురి చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు, అక్రమ షెడ్ల నిర్మాణాలపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. నాగార్జున కాలనీ సమీపంలోని కనకదుర్గ దేవాలయంవద్ద అక్రమంగా మెకానిక్ షెడ్‌ను ఏర్పాటు చేస్తున్నా... టౌన్ ప్లానింగ్ అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మాజీ కార్పొరేటర్ అధికారులను, వారి ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమ షెడ్ల నిర్మాణానికి అడ్డు లేకుండా పోతోంది. ఈసీ నగర్, బీఎన్ రెడ్డి నగర్, చెర్లపల్లి, కుషాయిగూడ, నాగార్జున కాలనీ, చక్రిపురం ప్రాంతాల్లో జోరుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేద ప్రజలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఏమీ చేయలేక పోతున్నాం
కొందరు రాజకీయ నాయకుల అండతో అక్రమ షెడ్ల నిర్మాణం కొనసాగుతోందని, వీటిని తొలగించలేక పోతున్నామని టౌన్‌ప్లానింగ్ అధికారులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణ దారులను ఏమైనా అంటే కొందరు రాజకీయపార్టీల తమకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇలాంటి పద్ధతి మారాలని వారు కోరుకుంటున్నారు.