Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడో రోజూ ప్రశాంతంగా కొనసాగింది. ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకా వేయాలనే లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని కేంద్రాల్లో ఎక్కువగా.. మరికొన్ని కేంద్రాల్లో తక్కువ సంఖ్య నమోదైంది. గడిచిన రెండు రోజులతో పోలిస్తే నేడు ఎక్కువగా టీకా వేసుకోవడానికి ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. మూడు జిల్లాల్లోని 170 కేంద్రాల్లో 7,689 మంది హెల్త్ సిబ్బందికి టీకా వేశారు. మొదటి రోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 కేంద్రాల్లో 984 మందికి టీకా వేయగా.. రెండో రోజు 77 సెంటర్లలో 2,314 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మొదటి, రెండో రోజులతో పోలిస్తే వ్యాక్సినేషన్‌లో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. దీనికితోడు టార్గెట్‌తోపాటు సెంర్ల సంఖ్యను కూడా పెంచారు. కార్యక్రమం ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా.. హెల్త్ వర్కర్లు టీకా వేసుకోవడానికి అంతగా ధైర్యం చేయడం లేదని వైద్యులు చెబుతున్నారు. కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా టీకా సమయానికి ఏదో సాకుతో దూరంగా ఉంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఆయా ఆస్సత్రుల సూపరింటెండెంట్లు, ప్రొఫెసర్లు టీకా తీసుకోవాలని సూచిస్తున్నా.. క్షేత్ర స్థాయి సిబ్బంది మాత్రం ముందుకు రావడం లేదు.
గ్రేటర్‌లోని ప్రధాన ఆస్పత్రుల్లో టీకా ఇలా..
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 98 మందికి టీకా వేశారు. మొదటి, రెండో రోజుతో పోలిస్తే పెరిగింది. అప్జల్‌గంజ్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 271 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక్కడ మొదటి నుంచి ఎక్కువగానే నమోదవుతోంది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 54 మందికి టీకా వేశారు. ఇక్కడ కొంచెం అటూ ఇటుగా ఉంటుందే తప్పా పెరగడం లేదు.
భయపడాల్సిన అవసరం లేదు
కరోనా టీకా విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఉండవు. కొవిన్ యాప్‌లో రిజిస్ట్రర్ చేసుకున్న ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.
- డాక్టర్ బొంగు రమేశ్, తెలంగాణ రాష్ట్ర మెడికల్ జేఏసీ చైర్మెన్
ముందుకు రావడం లేదు
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. హెల్త్ సిబ్బంది కూడా భయపడుతున్నారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు అని అవగాహన కల్పిస్తున్నా.. ఆసక్తి చూపించడం లేదు.
- డాక్టర్ నాగేందర్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్