Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ జాతీయ రహాదారి విస్తరణ పనుల్లో కదలిక ఏ మాత్రం కనిపించడం లేదు. రహదారి పనులను సకాలంలో పూర్తి చేయాలని గత నెలలో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి రహాదారి విస్తరణ అధికారులకు, రెవెన్యూ యంత్రాంగానికి, మేడ్చల్ మున్సిపల్ శాఖకు, ట్రాఫిక్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్ జాతీయ రహాదారి కాశ్మీరీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఏకైక జాతీయ రహాదారి. దీనిని ఎన్‌హెచ్ 7గా పేరుతో పిలుస్తారు. తాజాగా ఈ రహాదారిని ఎన్‌హెచ్ 44 అంటున్నారు. మేడ్చల్ జాతీయ రహదారి పనులు చాలా కాలం కిందటే ప్రారంభిచాల్సి ఉన్నా నేటికి ప్రారంభం కాలేదు. మేడ్చల్ జాతీయ రహాదారి పనులు చేపట్టాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహాదారి, హైదరాబాద్ నుంచి ముంబై, హైదరాబాద్ నుంచి కరీంనగర్ జాతీయ రహాదారి పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయని చెప్పవచ్చు. అయినప్పటికీ మేడ్చల్ జాతీయ రహాదారి విస్తరణ పనులు చాలా కాలంగా ప్రారంభానికి నోచుకోలేదు. ఇలాంటి తరుణంలో గత నెలలో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, జాతీయ రహాదారి విస్తరణ అధికారులతో మేడ్చల్‌లో సమావేశం ఏర్పాటు చేసి మేడ్చల్ చెక్‌పోస్టు ప్రాంతాన్ని యాక్సిడెంట్ ఫ్రీ జోన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. అలాగేే మేడ్చల్ జాతీయ రహాదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ మున్సిపల్ శాఖ తూతూ మంత్రంగా సబ్ వేల పై ఉన్న చిన్నపాటి దుకాణాలను తొలగించారు తప్ప రహాదారి విస్తరణ పనులు ప్రారంభానికి నోచుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఒక నెలలో మేడ్చల్ జాతీయ రహాదారి విస్తరణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తానని గతంలో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ జాతీయ రహాదారి విస్తరణ పనుల అధికారులు, మేడ్చల్ ఇన్‌చార్జి ఆర్డీఓ ఎన్.సుదర్శన్, మేడ్చల్ తహసీల్దార్ ఎం.సురెందర్, మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ బి.సత్యనారాయణ రెడ్డి, ట్రాఫిక్ అధికారులు ఇంత వరకు ఒక సమావేశం ఏర్పాటు చేసి, విస్తరణ పనులను ఎలా ముందుకు తీసుకెళ్దామన్న ప్రణాళికలు సైతం రూపొందించలేదంటే రహదారి నిర్మాణం పట్ల అధికారులకున్న నిబద్ధత ఎంటో ఆర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జాతీయ రహాదారి విస్తరణ పనులు మరింత ఆలస్యమౌతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ జాతీయ రహాదారికి ఆనుకుని సుమారు 123.5 మీటర్లకు దూరంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హెచ్‌ఎండీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేడ్చల్ రహాదారి విస్తరణ పనులు పూర్తయ్యేలా చర్యలు వేగంగా చేపట్టాలని మేడ్చల్ ప్రజలు కోరుతున్నారు.
నిర్మాణాలు తొలగించారు సరే వ్యర్థాలను తొలగించరా?
మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ మున్సిపల్ అధికారులు మున్సిపల్ పరిధిలో జాతీయ రహాదారికి ఆనుకుని ఉన్న కొన్ని అనుమతిలేని కట్టడాలను కూల్చివేశారు. కానీ నిర్మాణ వ్యర్థాలను తొలగించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కావున మేడ్చల్ మున్సిపల్ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.