Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపావళి ముందు వచ్చే పండగ దండారీ పండగ. ఇది గోండులు అత్యంత ఆనందంతో జరుపుకునే పండగ. ఈ పండగరోజున గోండులు ఒక ఊరు నుంచి మరో ఊరికి గుంపులు గుంపులుగా వెళ్తారు. అసలు ఈ పండగ ప్రత్యేకతే అతిథి మర్యాదలు చెయ్యటం, అతిథులతో కలిసి నాట్యం చెయ్యటం. ఇది దీపావళికి ముందు ఏదో ఒక రోజు జరుపుకునే పండుగ కాదు. ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో చేస్తూ కొన్ని రోజులపాటు ఈ పండగ చేసుకుంటారు. ఒక గ్రామంలో పండుగ చేస్తున్నారంటే చుట్టుపక్కల గ్రామాల వారిని ఆ గ్రామస్తులు ఆహ్వానిస్తారు. దీన్నే దండారీ పిలవడం అంటారు.
పండుగకు ముందు ఇళ్ళను అలంకరించు కుంటారు. ఒక్కోసారి అతిథులకు విడిదిగా చిన్న చిన్న ఇళ్ళను ఊరి మధ్య నిర్మిస్తారు. దీపావళికి ముందు ఏ రోజున పండగ చెయ్యాలో గ్రామంలోని పెద్దలందరూ కలిసి నిర్ణయిస్తారు. అలా నిర్ణయించిన తరువాత చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కబురంపే కార్యక్ర మం ప్రారంభమవుతుంది. ఇక పండగ రోజు వచ్చేటప్పటికి ఒక్కసారిగా కొత్తవాతావరణం సంతరించుకుంటుంది.
గోండులకు భట్రాజుల వంటివారు ప్రధానులు. వారు కాలికోం, పేప్రి, కింగ్రి వంటి వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడతారు. గోండుదేవతల పుట్టుపూర్వోత్తరా లను తెలియచేసే కథలు చెబుతారు. ఈ పని చేసినం దుకు వారికి మాన్యాల రూపంలో కాని ధన ధాన్యాల రూపంలో కానీ ప్రతి ఫలం ఉంటుంది. రెండు రోజుల పాటు నిరాఘాటంగా వారు కథాగానం చెయ్యగలరు. దండారీ పండగ రోజు వీళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.
దండారీల రాక
వేరే గ్రామం నుంచి వచ్చే దండారీలు (దండారీ పండగ నాడు అతిథు లుగా వచ్చే ఇతర గ్రామాల గోండులు) ఊరు వెలు పలే ఆగుతారు. వారిని తీసుకు రావడానికి వాయిద్యాలతో గ్రామస్తులు
బయలుదేరి వెళతారు. ఊళ్ళో డప్పులు, డోళ్ళ మోతలతో సందడిగా ఉంటే. పిల్లలు, కుర్రకారు ఆనందంతో వచ్చే అతిథు లను చూడటానికి ఉత్సాహంగా ఎదురు చూస్తుం టారు. దండారీలు ఊళ్ళోకి అడుగుపెట్టేటప్పుడు స్వాగతం పలుకుతు న్నట్లు గ్రామస్తులు డప్పులు వాయిస్తారు. దానికి సమాధానంగా అతిథులు కూడా తమ కూడా తెచ్చుకున్న డప్పులను వేరే లయలో వాయిస్తారు. దండారీ గ్రామం మధ్యలోకి రాగానే ఇరువైపుల వారు డప్పుల జోరు పెంచుతారు. ఈ లోపు వారి చుట్టూ గుసాడీలు చేరి డ్యాన్స్ చెయ్యడం ప్రారంభిస్తారు. వాయిద్యాల మోత తారా స్థాయికి చేరిన తరువాత గుసాడీలు ఒక్కసారి పొలికేక పెట్టి డ్యాన్స్ ఆపుతారు. ఇప్పటివరకు జరిగిన తంతంతా దండారీని ఆహ్వానించడం అన్నమాట! ఇక పలకరింపులు పలకరింపులు మొదలవుతాయి. ఒకరినొకరు రాం రాం అని పలుకరించుకుం టారు. పరామర్శలు పూర్తయిన తరువాత వచ్చిన అతిథులను తీసుకు వెళ్ళి గ్రామస్తులు కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగిన తరువాత మూడుసార్లు కౌగిలించుకుని చేయిపట్టుకుని విడిదికి తీసుకువెళ్తారు. అక్కడ చారు కానీ మిగతా పానీయాలు కానీ ఇస్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత దండారీ నృత్యం ప్రారంభమవుతుంది. దండారీ నాట్యం లో చాలా భాగాలు ఉంటాయి. అందులో గుసాడీ, గుమేలా, పార, ధిమ్సా, భజన్, ఖేల్ ముఖ్యమైనవి. వీటన్నింటిలోనూ గుసాడీలు పాల్గొంటారు. కొన్ని గంటలపాటు గెమేలా పాటలు పాడ్తారు. భజనలు చేస్తారు. చాలా వరకు భజనలన్నీ మరాఠీలోనే ఉంటాయి. కొన్ని భజనలు మాత్రం గోండు భాషలో ఉంటాయి.
ఉన్నంతలో మంచి భోజనాలను వడ్డిస్తారు అతిథు లకు. పండగ చేసే ఊరు ఆర్థిక పరిస్థితిపై విందు స్థాయి ఆధారపడి ఉంటుందిగితర గ్రామాల వారికి ఆతిథ్యం ఇచ్చి వారి అవసరాలు తీర్చా లంటే మాటలు కాదు. అది చాలా ఖర్చు తో కూడుకున్న పని. అందుకే ఈ మధ్య చాలా గ్రామాల్లో ఖర్చును భరించలేక దండారి పండగ చేసుకోవటమే మానేశారు.
నృత్యాలు
పండగ రోజు చేసే ధింసా నృత్యం గోండులకు ఓ ప్రత్యేకతను సంతరింపజేసింది. ఈ నృత్యంలో స్త్రీలు ఒకళ్ళనొకళ్ళు గొలుసులా పట్టుకొని నృత్యం చేస్తారు. రేల పాటలతో కొన్ని గంటలు గడిచిపోతాయి. అలాగే గోండు యువకులు దండారీ నృత్యం చేస్తారు. ఇది ఒక విధంగా కోలాటం వంటిదే. రెండు పొట్టిగా కాస్త లావుగా ఉండే కొల్లాలు (కర్ర పుల్లలు) పట్టుకుని పాటలకనుగుణంగా చేసే నృత్యం ఇది. 'వెట్టె' ్పుపర్ర' అనే రెండు సంగీత వాయిద్యాల నుంచి వచ్చే సంగీతానికి అనుగుణంగా ఈ డాన్స్ చేస్తారు.
రెండవ రోజు ఉదయానే ఆకిపేన్ పూజ జరుగుతుంది సూర్యచంద్రుల గుర్తుతో ఉన్న కొత్త జెండాను వాయిద్యాల మోత మధ్య ఆవిష్కరిస్తారు. ఆ తరు వాత ఒకరి తరువాత ఒకరు ఆకిపేన్‌కి (జండా)కు మొక్కుతారు. ఆ తరువాత గుసాడి టోపీలకు, వాయిద్యాలకు పూజ జరుగుతుంది. పూజ తరువాత ముందు గుసాడీలకు భోజనం పెడ తారు. అలా ముందుగా వారికే భోజనం పెట్టడం ఒక ఆచారం. ఆ తరువాత అతిథులు, మిగతా వారు భోంచేస్తారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత గ్రామస్తుల నుంచి దండారీలు వీడ్కోలు తీసుకుంటారు.