Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం గడిచేకొద్దీ మానవ జీవితంలో రకరకాల మార్పులు చోటుచేసుకొంటూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఉండి పాతకాలపు విషయాలను తెలుసుకుంటున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి కారణం మారిన పరిస్థితులే. ఒక సమాజం మున్ముందుకు పోవాలంటే దాని గతకాలపు సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే సాధ్యం. అందుకే రెండుమూడు వందల క్రితం మన తెలుగు నేలపై ఉన్న జనజీవనాన్ని పాఠకుల ముందుంచే ప్రయత్నం చేస్తున్నది 'జాతర'.
వందల ఏండ్ల క్రితం మన గ్రామాలన్నీ ప్రాకారం కలిగి ఉండేవి. ప్రాకారంలోపలే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ స్వయం సమృద్ధంగా గ్రామీణులు నివసించేవారు. వ్యవసాయం ముఖ్య వృత్తి. కర్రనాగలితో ఎడ్ల సహాయంతో పొలం దున్నుకుంటూ, బావినుంచి కాని, ఏటినుంచికాని నీటిని తెచ్చి వ్యవసాయం చేసేవారు. వైశ్యులు దుకాణంలో నిత్యావసర సరుకు అమ్ముతూ అవసరం ఉన్నవారికి అప్పులు అధిక వడ్డీలకు ఇస్తూ ఉండేవారు. ఊరు మధ్య గ్రామచావడికొచ్చేటప్పటికి ( ఆంధ్రప్రాంతంలో) గ్రామమునసబు కచ్చేరిలో పనిచేసే గుమస్తా, తాటియాకుల చాపమీద కూర్చొని పక్షి ఈకలతో పద్దులూ, గ్రామ లేఖలు రాస్తూ, రైతులు అప్పుల కోసం రాసి ఇచ్చిన పత్రాలు పరీక్షిస్తూ పెద్ద చెట్టుకింద అరుగుమీద కూర్చొని ఉన్న గ్రామ మేజిస్ట్రేటుకు, తగాదాలు తీర్చడానికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఊరికరణం భూముల మీద పన్నులు నిర్ణయించి, వసూలు చేసేవాడు. కాని మునసబు ప్రజల మధ్య వచ్చే తగాదాలన్నిటినీ పరిష్కరించేవాడు. జమిందారులు రైతుల వద్ద నుంచి పంటలో భాగం స్వీకరిస్తూ... పండుగ రోజుల్లోను, ఇతర శుభ సమయాల్లోనూ వారికి కానుకలు ఇస్తుండేవాడు.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్ర దేశంలో అధికారం చేపట్టిన దగ్గరి నుంచి బ్రాహ్మణులు బ్రిటిష్ ఉద్యోగస్తులకు దుబాసీలుగా వ్యవహరించడం ప్రారంభించారు. అంటే ఇంగ్లీషు నేర్చుకున్న బ్రాహ్మణులు బ్రిటటిష్ వాళ్లు స్థానిక తెలుగువారితో మాట్లాడేటప్పుడు తెలుగు అనువాదకులుగా ఉండేవారన్నమాట. అట్లాగే భూమి శిస్తులూ, ఇతర పన్నులు, ఉప్పు పన్ను వంటివాటికి వేలంపాటదారులుగా ఉండేవారు. పన్నుల వసూలులోనూ కీలక పాత్ర పోషించేవారు. వేదమత ప్రవక్తలుగా, ఆచార్యులుగా ఉంటూ వచ్చిన బ్రాహ్మణులు కంపెనీ రాకతో ప్రభుత్వోద్యోగులుగా మారారు. వాళ్లు గ్రామ మధ్యభాగంలో నివసించేవారు. వారి వెనుక కోమట్లు నివసించేవారు. ఊరి పరిసరాల్లో శూద్రులు నివసించేవారు. బంగారు, వెండి పనులు చేసే కంసాలులు, ఇతర సామాన్లు చేసే కమ్మరులు, కర్రపనులు చేసే వడ్రంగులు, కుండలు చేసే కుమ్మరులు, ఇండ్లు కట్టే మేస్త్రీలు, నేతపనిచేసే పద్మసాలీలు, బట్టలు ఉతికే చాకళ్లు, క్షురకర్మ చేసే మంగళ్లు, చెప్పులు కుట్టే మాదిగలు, చాపలు, బుట్టలు అల్లే మేదర్లు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులను అవలంబిస్తూ ఉండేవారు. కొంతమంది తమ తమ పనిముట్లతో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వీధులమ్మట తిరుగుతూ ఇంటింటా పనులు చేసేవారు. కమ్మరివారు కొలిమి ఊదే మనిషిని వెంటబెట్టుకొని కొలిమితో సహా ఇంటింటికీ తిరిగి పనిచేసేవారు. వడ్రంగులు కూడా అట్లాగే ఇండ్ల వెంట తిరుగుతూ పనిచేసేవారు. కర్ర మగ్గాలు వీధుల్లో భూమిలో పాతి అద్భుతమైన వస్త్రాలను నేసి విదేశాలకు సైతం ఎగుమతిచేశారు. స్థానిక అవసరాలకు సరిపడే దుస్తులను నేసేవారు. బట్టలకు రంగుల అద్దకాలు వేసేవారు. బట్టలపై రంగులు, అలంకరణలు చిత్రించి ఉతికినా మాయని రంగులతో అద్దేవారు.
విదేశీ వస్తువుల నిరాకరణ
ఇక సామాన్య ప్రజలు నిరాడంబరమైన స్వచ్ఛమైన జీవనం గడిపేవారు. ఇప్పటిలా కాగితాలు, పెన్నులు, పెన్సిళ్లు వారికి తెలియవు. వారు తాటాకులపై గంటాలు, పక్షి ఈకల కొనలతో రాసేవారు. ఇక్కడి హస్తకళావస్తువులు, చేనేత వస్త్రాలను విదేశీయులు ఎంతో ఇష్టంతో కొనేవారు. కానీ విదేశాల నుంచి దిగుమతైన వస్తువులను స్థానికులు కొనడానికి ఇష్టపడేవారు కాదు. ఈ సంగతిని ఈస్టిండియా కంపెనీ ఐదవ నివేదిక ఇట్లా పేర్కొంటున్నది.... ''ఎంత భాగ్యవంతుడైనా సామాన్య ప్రజల్లాగానే ఇంగ్లీష్ దేశపు గుడ్డలన్నా, ఇతర దేశ వస్తువులన్నా కొనడానికి ఇష్టపడేవారు కారు. ఒక వేళ తండ్రులు ఇంగ్లీషు వస్తువులను కొని ఉంటే కొడుకులు వాటిని పారవేసేవారు. ఎక్కువ ధరల భయం వల్ల కాక, విదేశీవస్తువులు ఏవీ కూడా మనదేశపు వస్తువులతో నాణ్యతలోకాని, చక్కదనంలో కాని ఎక్కువైనవి కాకపోవడమే కాకుండా మన సరకు కంటే చాలా హీనమైనవని, ధృడమైనవనీ నమ్మడమే విదేశీ వస్తు నిరాకరణకు ముఖ్య కారణం''
హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఉండే బ్రిటిష్ రెసిడెంట్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''నిజాం ఎప్పుడూ ఇంగ్లీషు వస్తువులమీదకాని, యూరోపియన్ వస్తువుల మీద కాని మోజు చూపించేవాడు కాదు. ఆయనకు కానుకలుగా పంపిన శాలు వలు, ఉన్ని వస్త్రాలు, గుర్రాలు, ఒంటెలను, ఏనుగులను కప్పడానికి వినియోగించేవాడు. ఇంగ్లీషు అధికారులు ఎంత విలువైన కానుకలు తెచ్చి ఇచ్చినా వాటినన్నిటినీ పర్షియా, చైనా, ఫ్రాన్సు వంటి విదేశాలు పంపించిన అమూల్యమైన కళాసంపదలలాగా ఇంగ్లీషువారు పంపిన కళాసంపదను కూడా ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరచడానికి పంపేవాడు.
సొంత ఊరే ప్రపంచం
గ్రామ ప్రజలకు వారి ఊరే దేశం అనే భావన ఉండేది. దేశంలో వచ్చి పోయే ప్రభుత్వాలతో పనిలేకుండా నిత్యావసరాలన్నీ గ్రామంలోనే సమకూర్చుకొని స్వయం పోషకంగా ప్రజలు జీవించేవారు. దొంగల బారి నుంచి తప్పించుకోడానికి ప్రతీ గ్రామం చుట్టూ ఎత్తయిన పెద్ద ప్రహరీ గోడలు నిర్మించుకొనేవారు. అయిదారు ఇండ్లు ఉన్న చిన్న ఊరు కూడా ఎనిమిది అడుగుల ఎత్తయిన రాతిగోడతో ఆవరించి ఉండేదని ఫ్రాన్సిస్ బుఖానన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. రాయలసీమ గ్రామాల గురించి 1802లో మన్రో ఈస్టిండియా కంపెనీకి రాసిన లేఖలో కూడా ఎంత చిన్న పల్లె అయినా మట్టిగోడ కాని, రాతిగోడ కాని పెట్టుకొని ఉండటం మామూలు విషయం అని రాశాడు. ఆయనే నాటి ప్రజా జీవితం గురించి ఇంకా ఇట్లా పేర్కొన్నాడు... ''నేను కనిపెట్టినదాన్నిబట్టి చూస్తే ఆంధ్రదేశ ప్రజలు హిందువులంతా కూడా వారి సామాన్య జీవన విధానాన్ని అనుసరించడం తప్ప కొత్త పద్ధతులను అనుసరించే అభిలాష కలిగినవారు కారు. వారికేమైనా సభ్యత ఉందా అని అడిగితే, దానికి సమాధానం అనుభవాన్ని ఆధారం చేసుకొని చేసే వ్యవసాయం, అనన్య ప్రతిభావంతమైన హస్తకళా నైపుణ్యం; భాగ్యవంతులకు కాని, సామాన్య ప్రజల అవసరాలకుగాని, కావాల్సిన వస్తువులను తయారు చేయడంలో ప్రావీణ్యం; ప్రతి గ్రామంలో చదువను, రాయను, గణిత శాస్త్ర బోధన పిల్లలకు అలవరచడం, గృహస్థ జీవితంలో ఆతిథ్యం, ఔదార్యం, పరోపకార బుద్ధి, ఆడవారిమీద భక్తి, గౌరవాలతో సున్నితంగా, మర్యాదగా చూడటం నాగరికతా లక్షణాలుగా పరిగణిస్తే ఈ రకమైన సభ్యత ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఒక అంశంగా లెక్క పెడితే ఇంగ్లాండు ఈ రకమైన సభ్యతని దిగుమతి చేసుకోవడంతో ఎంతో లాభసాటి వ్యాపారం సాగించిందని నా అభిప్రాయం'' అంటూ 1813లో ఒక కమిటీ ముందు ఇచ్చిన సాక్ష్యంలో పేర్కొన్నాడు మన్రో.
- రమణ