Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం ఒడుదుడుకులమయం. వెలుగులు, చీకట్లు దాగుడుమూతలు ఆడుతుంటాయి. మనిషన్నాక ఇవి మామూలే. వెలుగులను చూసి మురిసిపోవద్దు. చీకట్లను చవిచూసి చింతచెందొద్దు. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదని మనస్తాపం చెందడం కన్నా మనలో ఎంత చిత్తశుద్ధి ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి . లక్ష్యం సరైనదైతే విజయం తప్పనిసరిగా వరిస్తుందని అంటున్నారు మనోవికాస నిపుణులు.
జీవితంలో చీకట్లు అలుముకున్నాయని ఆందోళన చెందడంలో అర్థం లేదు. అలుపెరుగని కృషితో సమస్యలను అధిగమించేవారే నిజమైన హీరోలు. లక్ష్యం లేకుంటే విజయం అసాధ్యమే. సుఖమయ జీవితాన్ని పొందాలంటే అందుకు అనుగుణంగా ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించు కోవాలి. బద్ధకిస్తే విలువైన సమయం వృథాగా గడిచిపోతుంది. 'బద్ధకస్తుడి మనసు భూతాల నిలయం' అనే సామెత ముమ్మాటికి నిజం. నిన్నటిని మరచిపోండి. రేపటి గురించి ఆలోచిం చండి. ఇప్పటి వరకు వ్యర్థంగా గడిచిపోయిన కాలాన్ని మరచిపోండి. ఇకనైనా కార్యాచరణలోకి అడుగు పెట్టండి. మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక లక్ష్యాన్ని, జీవితానికి ఒక ఉద్దేశాన్ని నిర్దేశించుకోండి. రోజూ ఒక మంచి పనిచేయండి. కానీ.. ఏ పనీ చేయకుండా ఖాళీగా మాత్రం కూర్చోవద్దు.
అసంతృప్తి జీవులుగా మిగిలిపోతారు జాగ్రత్త!
మనిషన్నాక ఇంటా బయటా ఏదో సమస్యలు, అవరోధాలు ఉంటూనే ఉంటాయి. పరిస్థితులు ఒకరి అదుపాజ్ఞలను బట్టిరావు. తాము ఉండే చోట గల వాస్తవ పరిస్థితిని గమనించి తదనుగుణంగా వ్యవ హరించ గలిగినప్పుడే ఎవరైనా ఏదైనా సాధించగలు గుతారు. పరిస్థితులు బాగాలేవని తిట్టుకుంటూ కూర్చుంటే చివరకు నిష్క్రియా ప్రియులుగా, అసంతృప్తి జీవులుగా మిగిలిపోతారు.
తపన ఉంటేనే...
జీవితంలో ఏదోఒకటి సాధించాలనే తపన ప్రతిఒక్కరిలోనూ ఉండాలి. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనే సంక్లల్పం అవసరం. ఇతరులమీద ఆధారపడకుండా సొంత ప్రణాళికల తో జీవన విధానాన్ని కొనసాగించాలి. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను నిర్వహించుకుని.. ఒక మంచి కెరీర్ ని నిర్మించుకోవడానికి అన్ని కష్టాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాలి. ముందుగానే అన్ని విషయాల గురించి ఆలోచించు కుని, సమయానుకూలంగా ముందడుగు వేస్తూ.. విజయాలవైపు ముందుకు సాగిపోవాలి. కెరీర్ గురించి ఆలోచించకుండా సామాన్య జీవితాన్ని గడపడం సరికాదు. ఏ సమయంలో ఎటువంటి అడుగు వేయాలి..ఎటువంటి ప్రణాళికలు మన జీవితానికి తోడ్పడుతాయి..? అనే విషయాల గురించి అవగాహన పెంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తీరని నష్టాన్ని కొనితెచ్చు కోవద్దు. ఇతరుల చెప్పిన విధంగా నడుచుకోకుండా మీకు మీరుగానే ఉండండి. మీరు నిర్దేశించుకున్న బాటలోనే ముందుకు నడవడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న ఇష్టాలు, కోరికల గురించి ఈ జగత్తులోనే మరెవ్వరికీ తెలియదు. వాటికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణకు, కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీరు కోరుకున్న జీవితాన్ని, కెరీర్ ను మలుచుకోగలుగుతారు.
ప్లానింగ్ తప్పనిసరి
మీకు ఏం చేస్తే నచ్చుతుందో.. ఎలాంటి ఉద్యోగం, వృత్తి చేపడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో.. ఏ పని అయితే ఎక్కువ శ్రమ అనిపించదో.. ముందుగా అటువంటి విషయాల గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి! మీకు నచ్చిందో ఏదో కూడా మీరు తెలుసుకోలేకపోతే.. ముందుగా మీకు ఎక్కువగా నచ్చే విషయాల గురించి ఒక పట్టికను రాసి పెట్టుకోండి. వాటిగురించే నిత్యం ఆలోచించడం మొదలుపెట్టండి.అందులో మరీ ముఖ్యమైనవి ఏదో ఏకాగ్రతతో గమనించండి. అప్పుడే మీరు మీలో ఉన్న నైపుణ్యత, సామర్థ్యతను తెలుసుకోగలరు. దానిద్వారా మీకు నచ్చే ఉద్యోగంగానీ, పనిగానీ, భవిష్యత్ ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం గానీ జరుగుతుంది. మీరు ఏం చేయాలనుకుంటు న్నారోననే విషయం మీకు అవగాహన వచ్చి నప్పుడు.. దానినే మనసులో పదిలం పరుచుకోవాలి. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు పదిలం చేసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ దానికి అనుగుణంగా నిర్ణ యాలు తీసుకోవాలి. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుం టారో దాని గురించే ఆలోచించుకోవాలి. అలా కాకుండా తరచూ నిర్ణయాలను మార్చుకుంటూ పోతే.. సమయం వృథా అవడమే కాకుండా కెరీర్ పరంగా అవకతవకలు ఎదురవుతాయి.
మీరు ఎలాంటి వృత్తిని కోరుకుంటున్నారో దాని గమ్యాన్నే చేరుకోవాలనే ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. దానికి మాత్రమే కట్టుబడి ఉండే విధంగా ప్రయత్నించాలి. ఒకవేళ మీరు ఎంచుకున్న నిర్ణయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటి గురించి మీ బంధుమిత్రులు, సన్నిహితులతో కలిసి చర్చించండి.దీంతో చాలా మంచిది. అప్పుడు అందులో ఉన్న లోపాలు, కష్టాలు, నష్టాల గురించి తెలుసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తే విజయం మీ సొంతమవుతుంది.
- హిమ్మతి