Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లోనూ ముందుండా లన్న లక్ష్యంతో విజ్ఞానవంతమైన, ఆరోగ్య వంతమైన సమాజం కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆవిర్భవించిందే మల్లు విజ్ఞాన వెంకటనర్సింహారెడ్డి కేంద్రం(ఎంవీఎన్). జిల్లా కేంద్రంలో 2011 డిసెంబర్ 5న ఏర్పాటైన అనతికాలంలోనే అశేషమైన ప్రజాదరణ పొంది విద్యార్థులు,నిరుద్యోగులు, యువతీయువకులకు, వృద్ధులు, ప్రతి ఒక్కరికీ అన్ని అవసరాలను తీరుస్తూ అపారమైన మన్ననలు పొందుతుంది. ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ, కరాటే కోచింగ్, గ్రంథాలయం, కుట్టుమిషన్ శిక్షణ, పీజీ ఎకనామిక్స్ ఎంట్రెన్స్‌కు శిక్షణ, ఉచిత వైద్యశిబిరం వంటి కార్యక్రమాలు చేపడుతుంది.
పీజీ ఎకనామిక్స్‌లో ఎంవీఎన్ హ్యాట్రిక్
పీజీ ఎకనామిక్స్ ఎంట్రెన్స్ పరీక్షల్లో ఎంవీఎన్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులు 2016,17,18 సంవత్సరాల్లో ప్రథమ ర్యాంకు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ట్రస్టు ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు ఉమ్మడి రాష్ట్రాల్లో ఓయూ, ఎంజీయూ, పాలమూరు, కేయూ, శాతవాహన యూనివర్శిటీల్లో ప్రథమ ర్యాంకులు సాధించడంతో పాటు శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రవేశం లభించింది. 2018లో నిర్వహించిన పరీక్ష ఆన్‌లైన్‌లో కావడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులేర్ప డకుండా పోటీలో వెనుకబడకూడదని నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్‌సైట్‌ను నిర్వహకులు రూపొందించారు దీని ద్వారా అభ్యర్థులకు ప్రత్యేకంగా 8 నమూనా పరీక్షలు నిర్వహించారు.
భవిష్యత్‌కు బాట వేస్తున్న ఎంవీఎన్ ...
ఈ ట్రస్టుద్వారా వివిధ రంగాల్లో విద్యార్థులకు ఉచిత శిక్షణనిస్తూ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతు న్నారు. 2011లో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని, 2012లో కరాటే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికీ 1600 మందికి కరాటే, 8500 మందికి కంప్యూటర్‌లో శిక్షణనిచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇటీవల జాతీయ స్థాయి కరాటే స్కూల్ గేమ్స్‌లో ఇద్దరు ఎంవీఎన్ విద్యార్థులు మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌లో ఆడగా తృతీయస్థానంలో నిలిచారు. జపాన్ కరాటే అసోసియేషన్‌ను ప్రారంభించారు. త్వరలో జిమ్నస్టిక్, కరాటే అసోసియేషన్‌ను ప్రారంభిం చనున్నారు.
విజ్ఞానాన్ని పెంచేందుకు గ్రంథాలయం
2012 జులై 4న ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో మొదటగా వార్తాపత్రికలను చదవడంతో ప్రారంభించి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం రీడింగ్ హాల్ ఏర్పాటు చేశారు. అనంతరం దాన్ని గ్రంథాలయంగా మార్చారు. 2016లో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు 45 రోజుల పాటు 418 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా 18 మంది ఉద్యోగాలు సంపాదించారు. 18 మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ప్రథమ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది
ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రెన్స్ పరీక్షకు శిక్షణ తీసుకున్నా. ఓయూ, ఎంజీయూ, పాలమూరు యూనివర్శిటీల్లో ప్రథమ ర్యాంకు సాధించా. ప్రత్యేకంగా నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం వైబ్‌సైట్‌ను రూపొందించి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అత్యుత్తమ బోధన, సలహాలు, సూచనలతోనే విజయం సాధించా.
-బుగ్గా నరేందర్, ఎంవీఎన్ విద్యార్థి
టీజీటీ మ్యాథ్స్ ఉద్యోగం పొందా
ఎంవీఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో చదువుకుని టీజీటీ మ్యాథ్స్ ఉద్యోగం పొందా. గ్రంథాలయంలో అన్ని రకాల వార్తాపత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉండడమే నా విజయానికి కారణం. కంప్యూటర్ శిక్షణ పొందలేని పేద విద్యార్థులకు ఎంవీఎన్ ఎంతో సహాయపడుతుంది.
అంబటి సత్యనారాయణ, ఎంవీఎన్ విద్యార్థి
- నవతెలంగాణ-క్లాక్‌టవర్(నల్లగొండడెస్క్)
పెద్దగోని అనిల్‌గౌడ్