Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు
- మంత్రి ఈటల రాజేందర్
- వైద్య వృత్తి పవిత్రమైంది : మంత్రి గంగుల కమలాకర్
- ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ ఎడవల్లి విజయేంద్రరెడ్డి బాధ్యతలు స్వీకరణ
- వైద్యుల సంక్షేమంపై దృష్టి సారిస్తా..
నవతెలంగాణ-కరీంనగర్‌టౌన్
తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేలళా అండగా ఉంటుందని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని వీ-కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 3వ ఐఎంఏ సదస్సులో ముఖ్య అతిథిలుగా మంత్రి ఈటల రాజేందర్, బీసీ, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ సమాజంలో వైద్యుల పాత్ర ఎనలేనిదన్నారు. గతంలో మనుషులు డబ్బులు, ఆస్తుల కంటే మానవ సంబంధాలు విలువనిచ్చేవారన్నారు. నేడు సమజాంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో డబ్బులకు విలువనివ్వడం ద్వారా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు అన్నం ఎంత అవసరమో వైద్యం సేవలు అంతే అవసరమన్నారు. నిరుపేద ప్రజల వైద్య సేవలు కోసం ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ఫండ్ పథకాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. మరిన్ని మెరుగైన వైద్య సదుపాయాలు, సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. 99 పనులు విజయవంతమైనా.. ఒక్కటి విఫలమైతే దానిపైనే ఎక్స్‌పోజ్ చేస్తున్నారని.. అది వైద్యమైనా రాజకీయమైనా ఒకటేనన్నారు. ప్రజలకు వైద్యులపై విశ్వాసాన్ని పెంచుతామని, దాడుల జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతామన్నారు. అనేక రోగులకు మూలకారణం తాగునీరన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు అందించడానికి మిషన్‌భగీరథ పథకాన్ని తీసుకచ్చిందన్నారు. త్వరలోనే మంచినీటిని అందించనుందని చెప్పారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ ఎడవల్లి విజయేంద్రరెడ్డిని ఎన్నుకోవడం అభినందనీయం అన్నారు. ఆయనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతగా నిర్వహిస్తారని కితాబు ఇచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, సమాజంలో వైద్యులను దేవుళ్లుగా చూస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లాఅండ్ ఆర్డర్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. వైద్యులు తమ సేవలు పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో అందించాలని కోరారు. అనంతరం ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎడవల్లి విజయేంద్రరెడ్డి మాట్లాడారు. కరీంనగర్‌లో ఐఎంఏ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కొన్సి సంవత్సారాలకు ముందు వైద్యులను దేవుళ్లుగా భావించే వారని, నేడు వైద్యుల పట్ల విశ్వాసం. నమ్మకం చూపడం లేదన్నారు. నేటి పరిస్థితుల్లో వైద్యులు నిజాయితీతో సేవలు అందించి వారిలో నమ్మకం కల్గించాలన్నారు. వైద్య విద్యార్థులకు కోర్సులతో పాటు నైతిక, మానవ విలువల పట్ల తర్పీదు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్యుల ఐక్యత, సంక్షేమం, మెంబర్‌షిప్ సంఖ్యను పెంచుతానని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం మరింత రిసర్చ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సమజాంలో ఎలాంటి అర్హతలు లేనివారు బోర్డులు పెట్టుకోని వైద్యం చేయడంపై మెడికల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఉదయం సైంటిఫిక్ ప్రోగ్రాం కార్యక్రమంలో సీజనల్ ఫీవర్స్, లోబ్యాక్ పేయిన్, రీసెంట్ అడ్వాన్స్ లివర్‌సర్జరీ, అక్యూట్ రిస్పిరటరీ డిస్‌ట్రెస్ సిండ్రోమ్, హవ్‌టూఅవైడ్ లీగల్ సుట్స్ పలు అంశాలపై నిష్ణాతుల వైద్యులు కూలంకషంగా వివరించారు. సదుస్సులో చర్చించే ప్రతి అంశం వైద్యులకు ఎంతోగానో ఉపకరించాయని సదుస్సుకు వచ్చినవారు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, సంజరుకుమార్, పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు(ఎలెక్ట్) డాక్టర్ రాజన్‌శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.వి.అశోకన్, టీఎస్‌ఎంసీ చైర్మన్ డాక్టర్ ఈ.రవీందర్‌రెడ్డి, పూర్వ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రతాప్‌రెడ్డి, ఐఎంఏ ఉపాధ్యక్షుడు బి.ఎన్.రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వసంతరావు, ఎం.శివలింగం, టి.నర్సింగరెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా :డాక్టర్ ఎడవల్లి విజయేంద్రరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ ఎడవల్లి విజయేంద్రరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ 3వ రాష్ట్ర సదస్సులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, బీసీ, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి చేతులు మీదుగా బాధ్యతలు చేపట్టారు.