పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్
నవతెలంగాణ -కోల్‌సిటీ
కరోనాను కట్టడి చేసి లాక్ డౌన్‌ను విజయవంతం చేయడంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకమైందని పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన అంతర్గాం మండలంలోని గ్రామ రెవెన్యూ సహాయకులకు జిల్లా తహసీల్దార్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని అన్ని గ్రామాల రెవెన్యూ సహాయకులకు నెలకు సరిపడా సరుకులను తహసీల్దార్ బండి ప్రకాష్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో పాటు ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరుతూ ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ముజఫర్ రిజిస్టర్ ఏర్పాటు చేసి గ్రామాల్లోకి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళను స్వీయనిర్భంధం చేయడంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులు కీలక పాత్ర పోషించారనీ పేర్కొన్నారు. అదేవిధంగా అదనపు రేషన్ బియ్యం పంపణీ, గ్రామాల్లో సీఎస్‌పీలద్వారా చేపట్టిన ప్రభుత్వ నగదు సహాయం పంపిణీలో క్షేత్రస్థాయి ఉద్యోగులు సమర్థంగా సేవలందించారని ప్రశంసించారు. అనంతరం మండలంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పలువురు రైతులతో మాట్లాడారు. రైతులు కొనుగోళ్లకు సంబంధించి సమస్యలుంటే స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించడంతో పాటు మిల్లర్ల నుంచి ఇబ్బందులు లేకుండా రైతుల పక్షాన ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేం దుకు గ్రామాల్లో క్షేత్ర స్థాయి ఉద్యోగుల ద్వారా పకడ్బందీ చర్యలు తీసుకోవ డంతో పాటు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మైకుల ద్వారా ప్రచారం చేపట్టిన విషయమై తహసీల్దార్ బండి ప్రకాష్‌ను ప్రత్యేకంగా అభినందిం చారు. ఈ కార్యక్రమంలో అర్‌ఐలు అజీమ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
Authorization