నవతెలంగాణ-సిరిసిల్ల/వేములవాడ రూరల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబై నుండి వచ్చిన వ్యక్తులకు కరోనా కేసులు బయటపడడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కరోనా రాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించగా వారు కోలుకున్నారు. జిల్లాలో కేసులు లేవని అనుకుంటుండగానే ముంబై నుంచి వచ్చిన పలువురు వ్యక్తులకు కరోనా నిర్ధారణ కావడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. 3 రోజుల క్రితం మహారాష్ట్ర నుండి వచ్చిన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన ఒక వ్యక్తికి వేములవాడ మండలం నాగయ్యపల్లెకు చెందిన ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నాగయ్య పల్లెలోని వ్యక్తి భార్యకు, రుద్రవరం గ్రామానికి చెందిన వ్యక్తికీ కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు యాక్టివ్ కేసులున్నాయి.