Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక చేత్తో గంపని మరొక చేత్తో పిల్లాడిని పట్టుకొని పాలివ్వడానికి వస్తలేదు. ఎదురుగా కూర్చున్న రేపటి అమ్మలు కనీసం గంపను కూడా పట్టుకోవట్లేదు. పాలివ్వకపోతే పిల్లాడు ఏడ్చేలా ఉన్నాడు. వాడి బాధను చూడలేక నవీన్ గంపను పట్టుకున్నాడు.అది చూసి తల్లి చిరునవ్వుని చినుకులా విసిరింది
పేరుకే ఇది నేషనల్ హైవే. ఒక్క బస్సు రాదు, ఒక్క ఆటో రాదు. బస్ స్టాప్ దగ్గర నిలవడి దాదాపు గంట కావొస్తుంది అనుకోని కర్చీఫ్ తో కారుతున్న చెమటను తూడ్చుకున్నాడు నవీన్. టౌన్లో పనుంది. టైంకి వెళ్ళకపోతే అది మళ్ళీ వాయిదా పడే అవకాశముంది. ఎండ విపరీతంగా సావగోడుతోంది. నాలుక ఎండిపోతోంది. ఇంటి దగ్గర తిన్నదంతా ఊరు దాటకముందే అరిగిపోయేలా ఉంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక ఆటో రానే వచ్చింది. సీట్లో నలుగురు అమ్మాయిలు కూర్చున్నారు. డ్రైవర్ పక్కలో, వెనకాల కూడా జాగ లేదు ఒక మధ్యలో ఉండే చెక్కపై తప్ప. ఎండకు అక్కడే నిలబడే ఓపిక లేక ఏదో ఒక చోట అన్నట్లు కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఆలోచిస్తూ ఉన్నాడు నవీన్. ఆటో అన్నాసాగర్ స్టాప్ దగ్గర ఆగింది. వెంట్రుకలకు స్టీల్ గిన్నెలు అమ్మెటామె ఎక్కి నవీన్ పక్కనే చెక్కపై కూర్చున్నది. ఆమెకు గంపతోపాటు సంకన చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఎండలో ఊరంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్లుంది. మొకమంతా వాడిపోయినట్లుంది. ఆటోలో కూర్చున్నదే తప్ప పట్టుకోలేదు. ఒక చేత్తో తమ కుటుంబాన్ని నడిపే గిన్నెల గంప పట్టుకుంటే మరో చేత్తో పిల్లాడిని పట్టుకున్నది. ఎదురుగా కూర్చున్న అమ్మాయిలు పిల్లాడిని కూడా తీసుకోవట్లేదు. అందరూ డిగ్రీ చదువుతున్న వాళ్ళలానే ఉన్నారు. తల్లితోపాటు ఎండలో తిరిగినందుకు పిల్లాడికి ఆకలి కూడా తన్నుకొచ్చినట్లుంది. తల్లి కొంగును గుంజుతున్నాడు.కానీ ఆమెకు ఒక చేత్తో గంపని మరొక చేత్తో పిల్లాడిని పట్టుకొని పాలివ్వడానికి వస్తలేదు. ఎదురుగా కూర్చున్న రేపటి అమ్మలు కనీసం గంపను కూడా పట్టుకోవట్లేదు. పాలివ్వకపోతే పిల్లాడు ఏడ్చేలా ఉన్నాడు. వాడి బాధను చూడలేక నవీన్ గంపను పట్టుకున్నాడు.అది చూసి తల్లి చిరునవ్వుని చినుకులా విసిరింది కతజ్ఞతగా. పిల్లాడు కాళ్ళు ఎగిరిస్తూ పాలు తాగుతున్నాడు. 'పాల పండ్లు ఊడేదాంక పాలు తాగినవ్ రా చిన్నోడా' అనే తన తల్లి మాట గుర్తుకొచ్చింది నవీన్ కు. పిల్లాడు పాలు తాగంగనే ఉషారయ్యాడు. అది చూసి ఆమె సంతోషించింది. ఇంతలో భూత్పూర్ వచ్చింది. ఆటో దిగి ఎవరి దారిన వాళ్ళు నడిచారు.
నవీన్ ఒక సర్వే పని మీద టౌన్లోని ఓ కాలనీలో తిరుగుతున్నాడు. అతనికి తోడు సురేష్ అనే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అదే కాలనీలో ''చిక్కెంట్టుకలకు స్టీల్ గిన్నేలే...'' అనే కూత వినబడింది. తిరిగి చూస్తే ఆటోలో చూసినామెనే తలపై గంప, సంకన బట్టలో పిల్లాడు. తిరుగుతూ, అమ్ముతూ ఉంది. ఆమెను చూసి ఆటోలో జరిగిందంతా సురేష్ కు పూసగుచ్చినట్లు చెప్పాడు నవీన్.
ఇంట్లోంచి ''ఓ గిన్నెలమ్మ ఇటురా'' అని ఒకామె పిలిస్తే వెళ్ళి ఇంటి ముందు గంప దింపింది. ఇంటామె ఎక్కడెక్కడ పెట్టిన చిక్కెంటుకలన్నీ తెచ్చిస్తే వాటికి దగ్గ ఒక గిన్నె ఇవ్వబోతే ''ఇది వద్దు జర పెద్దది అగో గదివ్వమ్మా'' అంటూ మరో గిన్నెను చూపించింది ఇంటి ఓనర్.
''లేదమ్మా! గీ ఎంట్రుకలకు గీ గిన్నెనే వస్తది'' అని చెప్పి సంకన పిల్లాడిని సదురుకున్నది.
''నాకదే కావాలి. లేదంటే నా వెంట్రుకలు నాకివ్వు'' అన్నది మరోమాట లేదన్నట్లుగా.
ఎందుకురా నాయన ఈమెతోన లొల్లి అనుకోని ఆమె అడిగిన గిన్నెనే ఇచ్చింది.
అడిగిన గిన్నెనే ఇచ్చినందుకు సంతోషంగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి మల్ల బయటకు వచ్చింది. ఇదంతా దూరం నుంచి నవీన్, సురేష్ గమనిస్తూ ఉన్నారు. గిన్నేలామెకు ఎండకు దాహమేసినట్లుంది.
''కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా'' అనడిగింది.
ఇంటామె లోపలికెళ్ళి చెంబు నిండా నీళ్ళు తెచ్చింది.
కడుపునిండా తాగొచ్చని గిన్నెలామె కూడా ఆశపడి చెంబుని చేత్తో అందుకోబోయింది.
ఇంటామెకు కోపం తన్నుకొచ్చింది. ''ఏందమ్మా చెంబుని చేతికి తీస్కుంటున్నవ్? దోసిలి వట్టు పోస్త తాగు అంతేగాని చెంబుని ముట్టుకున్నీకె వస్తవా?'' అని గచ్చున కసురుకున్నది.
ఇప్పుడైతే తన దగ్గర గిన్నెలు కొనుక్కోని ఇంట్ల దాసుకోని నీళ్ళు అడిగితే దోసిలి వట్టు అనే మాట వినేసరికి గిన్నెలామెకు గుండె ఝల్లుమన్నది. దాహాన్ని చంపుకొని గంప తలపై పెట్టుకున్నది. నాలుక ఎండిపోతున్నా ఆమె నీళ్ళని దోసిలి వట్టి తాగలేదు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న నవీన్ తన బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ ను దగ్గరకెళ్ళి ఇచ్చిండు. నవీన్ ను చూసి గుర్తుపట్టి చెదిరిపోయిన మనసుని మల్లె మొగ్గలా పూయించింది. బాటిల్ నిండా ఉన్న నీళ్ళను ముందు కొడుకుకు తాపి ఆమె కూడా తాగింది.
''ఇంట్లో ఉండే ఆవిడకు ఈ ఎండలో కుటుంబ భారాన్ని మోస్తున్న మీకు చాలా తేడా ఉందక్క. మనం అమ్మిన గిన్నెలు, వస్తువులు భద్రంగా ఇంట్లో దాచుకుంటారే తప్ప మన ప్రాణాలు పోతున్నా మనల్ని వాళ్ళ ఇంట్లోకి రానివ్వడం కానీ వాళ్ళ గిన్నెల్లో, చెంబుల్లో నీళ్ళు ఇవ్వడం కానీ చేయరు. బాటిల్ నీ దగ్గరే పెట్టుకొని ఎక్కడైన బోరింగ్ లేదా నల్లా కనిపిస్తే నీళ్ళు పట్టుకొని తాగు అంతేకాని ఈ జంతువులతో అడుక్కొని నీ మనసుని గాయపర్చుకోకు.ఇదో ఈ బిస్కెట్లు బుడ్డోడికి తినిపించు'' అని ధైర్యం చెప్పి బ్యాగ్ లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చి ''మేరా భారత్ మహాన్'' అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళారు నవీన్, సురేష్. ఇంటి ఓనర్ నవీన్ మాటలు విని తలదించుకొని ఇంట్లోకి వెళ్ళింది.
- కెపి లక్ష్మీనరసింహ
పాలమూరు యువ కవుల వేదిక
మహబూబ్ నగర్
సెల్: 9010645470