Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది రంజాన్ మాసం సమయం సాయంత్రం 5.30 బడి పిల్లలందరూ చెంగుచెంగున తమ తమ ఇళ్లకు పరుగు తీస్తున్నారు. రాకేష్ కూడా వీరితో పాటు వడి వడిగా నడుస్తున్నాడు. అతని ఇల్లు చాలా దూరంగా ఉండటంతో ఇంటికి తొందరగా చేరాలని వేగంగా అడుగులు వేస్తున్నాడు. అతను వెళ్లే దారి చక్కని పంట పొలాలతో పచ్చని పైర్లతో కళకళాడుతూంటుంది. అంతటి రమ్యమైన ప్రకతిలో మమేకమై పాటలు పాడుకుంటూ సాగుతున్నాడు..
మార్గ మధ్యలో అతనికి ఎవరివో పాత చెప్పులు కనిపించాయి. వాటిని చూసిన అతనిలో ఒక తుంటరి ఆలోచన వచ్చింది. చుట్టూ చూసాడు ఎవ్వరూ లేరు. వెంటనే అక్కడ ఉన్న చిన్నచిన్న గులకరాళ్ళను తీసి ఆ చెప్పుల్లో దాచిపెట్టాడు. ఆ చెప్పులు తోడుక్కున్న ప్పుడు ఆ వ్యక్తి ఎలా బాధ పడతాడో చూడడానికి సరదా పడ్డాడు.
ఎవరో అతని భుజం మీద చెయ్యి వెయ్యడం ఉలిక్కిపడ్డాడు. లెక్కల మాస్టారు ప్రసాద్‌రావు గారు. ఆయన్ని చూసి రాకేష్ భయంతో పారిపోబోయాడు. మాష్టారు అతన్ని ఆపి, ''ఎందుకు రాకేష్ పారిపోతున్నావు? నీ వయసులో నేను కూడా ఇలాంటి తుంటరి పనులే చేసేవాడిని. కానీ ఇది అంత మజా ఇవ్వదురా... ఇంతకన్నా ఎక్కువ ఆనందం ఇచ్చే పని ఇంకొకటి ఉంది చెప్పనా'' ఒక ఫ్రెండ్‌లా అడిగారాయన.
ఆయన అలా అడగడంతో ఆచ్చేరువొంది ''ఏంటి సార్ అది'' అన్నట్టు మౌనంగానే కళ్ళతో ప్రశ్నించాడు.
అతన్ని అర్థ్ధం చేసుకున్న మాష్టారు తన పర్సులోంచి ఒక 500 రూపాయల నోటు తీసి రాకేష్ కిచ్చి ఆ గులకరాల్ల స్థానంలో ఉంచమన్నారు. ఆయన చెప్పినట్టే చేశాడు ఆ పిల్లవాడు. అంతలో అక్కడ ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో పక్కనే ఉన్న పొదల్లోకి దాక్కున్నారు ఇద్దరు.
అప్పుడే ప్రార్థనలు ముగించి వచ్చిన ఓ బక్కపలచని ముస్లిం వ్యక్తి తన చెప్పుల్లో ఉన్న డబ్బుని చూసి ఆనందాశ్చర్యాలకు లోనైయ్యాడు.
భక్తితో ఆకాశం వైపు చూస్తూ.. ''యే అల్లా ఈరోజు ఎంత శుభదినం. ఎవరో పుణ్యాత్ములు నా చెప్పుల్లో డబ్బులు పెట్టీ ఎంతో మేలు చేశారు అల్లా... నేను నా ముసలి తల్లికి మందులు కొనవచ్చు... రోజు పిల్లలు తినగా మిగిలిన మెతుకులు తిని బతికే నా భార్య ఈరోజు కడుపునిండా తింటుంది.. మిగతా వాళ్లకు మిగలదేమో అనే సంకోచంతో అరకొర తిని కడుపు నిండింది అని చెప్పి నీళ్ళు నింపుకునే నా చిట్టి చిన్నారుల బొజ్జలు ఈరోజు కడుపునిండా తిండి తింటారు. యే అల్లా నీకు శతకోటి వందనాలు తండ్రి. ఈ డబ్బులు పెట్టిన వాళ్ళను చల్లగా చూడు తండ్రి.... చల్లగా చూడు...'' వర్షిస్తున్న కళ్ళతో దేవుడికి కతజ్ఞతలు చెప్పుకున్నాడు.
అతడి ప్రార్థన విన్న రాకేష్ కళ్ళు నీళ్లతో మసకబారాయి. ఎప్పుడూ పేదరికం అంటే చూడని అతనికి లోకం, ఆకలి, పేదరికం అంటే అర్థ్ధమయ్యి అతని పెదవులు పశ్చాతాపంతో వణుకుతూ క్షమాపణలు కోరాయి.
తప్పు చేసిన వాడిలా తలవంచుకు నిల్చున్న రాకేష్‌ను దగ్గరకు తీసుకొని మాష్టారు అతనికి జీవిత పాఠం తెలిపారు. ''చూసావా రాకేష్... నువ్వు అతన్ని హింసించి హీరో అవ్వాలని అనుకున్నావు. కానీ అది అందరికీ కీడే చేస్తుంది. అదే నువ్వు అందరికీ మంచి చేసి కూడా హీరో అవ్వగలవు. అది నిన్ను మహాత్మునిలా గొప్ప వాడిని చేస్తుంది. హిట్లర్ ఎందరికో హీరో అయ్యాడు. కానీ మన మహత్ముడిలా ఎప్పటికీ కాలేడు. ప్రజల మదిలో చిరకాలం నిలిచే హీరో అవుతావా లేదా ప్రజలను హింసించి అలాంటి మనసే ఉన్న కొందరికి నాయకుడివి అయ్యి భయంతో బతుకుతావా నువ్వే ఆలోచించుకో''
ఆయన చెప్పా వలసింది చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. తన శిష్యుడు తను చూపిన దారిలోనే పయనిస్తూనే ఉంటాడు అనే విశ్వాసంతో.
ఒక సూరీడు మరో చోటుకు వెలుగును ఇచ్చేందుకు సమాయత్తమవుతూ ఉన్నాడు... ఒక సూర్యాస్తయములా...
- విద్యాపతి రేవాల్ల