Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక ఊళ్లో కోటేశ్వర్ అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు మగ పిల్లలు కలిగారు. వారు వట్టి తిండిబోతులు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనే ధ్యాస ఉండేది. బడి ఈడు వచ్చినంక పాఠశాలలో చేర్పించాడు. వయసు పెరిగిన కొద్దీ, వాళ్లకు ఏ మాత్రం చదువు అబ్బలేదు. పైగా బొంగుల బస్తాల లెక్క లావుగా తయారయ్యారు. చేసేది లేక తండ్రి వాళ్ల చేత ఏదైనా వ్యాపారం చేయడం నేర్పాలనుకున్నాడు.
ఒకరోజు భార్య చేత, ఇంట్లో 20 లడ్డూలు తయారు చేయించాడు. పది పది లడ్డూల చొప్పున సమానంగా రెండు డబ్బాలలో పెట్టి కొడుకులకు ఇచ్చాడు.
''రూపాయికి ఒకటి చొప్పున వీటిని అమ్మకు రండి''... ! అని చెప్పి, చిల్లర డబ్బులు ఉండాలని చెరొక రూపాయి కూడా ఇచ్చాడు. ఇద్దరూ కలిసి ఊర్లోకి బయలుదేరారు.
సాయంత్రం కల్ల ఖాళీ డబ్బాలతో ఇద్దరు కొడుకులు తిరిగి వచ్చారు. కోటేశ్వర్ ఆనందంగా వారికి ఎదురు వెళ్లి ''లడ్డూలు అన్నీ అమ్మేరా? డబ్బులు ఏవి?'' అని ఆత్రంగా అడిగాడు.
ఇవిగో అంటూ... చెరొక రూపాయి తండ్రి చేతిలో పెట్టారు ఖాళీ జేబులు చూపిస్తూ... కొడుకులు.
తండ్రి ఆశ్చర్యపడి... ''లడ్డూలు అన్నీ అమ్మారు కదా! అమ్మిన డబ్బులేవి?'' అని అడిగాడు.
''నా దగ్గరున్న రూపాయి తమ్ముడికి ఇచ్చి నేనొక లడ్డుకొని తిన్నాను. తర్వాత తమ్ముడు తన దగ్గర ఉన్న రూపాయి నాకిచ్చి లడ్డు కొని తిన్నాడు. ఇలా ఒకరికొకరం అమ్మడం, కొనడం, తినడం జరిగింది. ఇలా అమ్మగా కొనగా చివరకు చెరొక రూపాయి మిగిలింది అని చెప్పారు ఇద్దరూ.
దాంతో తండ్రి ఏమి చేయాలో తోచక తెగ బాధపడి పోయాడు. అమ్మకం అదిరింది బాబోరు అనుకుంటూ మనసులో.
- కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి,
9441561655