Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏయ్ రాజుగా ఏందిరా స్పీడు సిన్నంగబోనీ అంటాంది డ్రైవర్ పక్క సీట్లో గూసున్న దొరసాని.. శెల్లెలి పెండ్లి పనులు ఆలోచిస్తా జీబు తోలతాండు రాజు.. దోమలగూడ దాటతా ఉసేన్‌సాగర్ కట్టెక్కే దారిల గోడల మీద అంటిచ్చిన సినిమా పోస్టర్లు సూస్తాంది సరస్వతి. సరస్వతంటె దొర బిడ్డె. ఊళ్ళె అందరు గామెను సిన్న దొరసానంటరు.... ఐద్రావాద్‌ల డిగ్రీ సదువుతాంది.. బతకమ్మ, దసర పండగలకి బిడ్డని దోల్కరాపోరా అని బంపితే జీబు దీసుకోని అచ్చిండు రాజు.... దార్లె అగుపడతాన్న 'చరిత్రహీన్, బేనాం, దోస్త్, రోటి కప్డా మకాన్, హం షకాల్, అజనబి' గీ సిన్మాలెప్పుడు జూడాల్నా అని అనుకుంటాంది సరస్వతి..
కొన్ని గోడలపై ఏయో నినాదాలుసుత రాశున్నరు ఏదో పార్టీకి సంబంధించిన బహిరంగసభ జయప్రదం కోరుతూ రాసిన వాల్ రైటప్సవి.. గవ్వి సదువుతా సదువుతా రాజుగా.. ఇప్లవం అన్టేందిరా.. అంది.
ఏమో దొరసానీ సదువుకునేటోళ్ళు మీకే ఎరక అని రాజుగాడనంగనే ''నాకెర్కయ్యేదెర్కాయెగానె నువ్వుజెప్పే దేందోజెప్పురా... అంది... ఎదురుదిరుగుడు రానీయకుండా దొరలడ్దుకునేది.. అస్తె గినక దొరలడ్దుకోబోయినా ఆగనిది.. అనంగనే సప్పట్లు గొట్టుకుంట సూసినావురా ఎంత అర్థమయ్యెటట్టు జెప్పినవో గిందుకే నిన్ను జెప్పమన్నా'' అంది...
''ఔగానీ దొరలని మాకేబెట్టినవేందిరా... గడీకిబోంగనే బాపుకు జెప్తతిరు బిడ్డ'' అని అంటుండెటాల్కె... ''అమ్మొ ఒద్దు దొరసానీ కాల్మొక్తా బాంచెన్'' అన్నాడు రాజు వణుకుతున్న గొంతుతో...
సిటీ శివార్లు దాటుతా జీబు బోన్‌గిరి బొయ్యే దారెక్కుతుండంగ.. మట్టిరోడ్డుపై గుంటను తప్పియ్యబోయి ఎదురుంగొస్తాన్న సైక్లిస్ట్‌కు టక్కరిచ్చిండు రాజు.. జీబు ముంగల గిర్రకు గుద్దుకోంగనే నడిపేటోడు, ఎనక క్యారేజీమీద గూసున్నోడు అమాంతం కిందవడ్డరు... ఎనక గూసున్నోడి శేతిల అప్పటిదాంక పట్టుకున్న పాంప్లేట్లు ఆ కుదుపుకు శేతులకెల్లి ఊశిపోయి గాల్లోకెగిరినరు.. కిందబడ్డోళ్ళు మోశేతులు, మోకాళ్ళకు డోక్క పోవటంతో అమ్మో అయ్యో అనుకుంట రత్తం తుడుసుకుంటన్నరు.. పైకెగిరిన పాంప్లేట్లు శెట్టు మీదికెల్లి పూలు గురిసినట్టు జీబుపై కురుస్తున్నరు.. గవ్వన్నీ శిన్నదొరసాని నెత్తిన ఒళ్ళో పడుతున్నరు....
''అయ్యో ఆళ్లకేమన్న దెబ్బలు దగిల్నయేమో సూడురా'' అని రాజును పురమాయిస్తూనే మీద రాలుతన్న గా కరపత్రాలేంటియో అని సదుతాంది సరస్వతి.. ఇందానక అచ్చుకుంట గోడలపైన సదివిన రాతల తాలూకు కర పత్రాలయి.. బహిరంగసభ పెచారం కోసం అచ్చుగొట్టిపిచ్చినయి..
పొరపాటైంది తమ్మి... పొరపాటైంది తమ్మి అనుకుంటబోయి రాజు లేపబడ్తాంటె.. లేశి ఒకడు సైకిల్ పైకి లేపి హ్యాండిల్ సక్కదీసుకుంటాంటె.. ఇంకోడు ఎగిరిపడ్డ కరపత్రాలను ఒకొకటేరుకుంట జీబుకాడికొచ్చిండు.. జీబులో తన మీద పడిన వాటిని అతనికందిస్తూ ''దెబ్బలుగిన గట్టిగా తగిల్నయా.. ఆస్పత్రికి బోదమా అని సరస్వతి అంటాంటె..'' ఏరు.. గియ్యేం గావులేండి, పొరపాటెవుల్దన్న అయితది ఔ.. మీకేమన్న దెబ్బలుగిట్ల దగిల్నయా.. కొంచబోవాల్నా దవాకానకు'' అని అడగబట్టే తాల్కి సరస్వతి ఆశ్చర్యపోయింది.. నాకేమయ్యింది... అనంగనే అదే కరపత్రాలు అంత మీదికెల్లొచ్చి మీమీదపడ్దరు గదా.. అన్నడు అరుణ్.. సాల్తిరు పరాశ్కెం.. కాయితాల్ మీదబడితె దెబ్బల్ దగుల్తారు... అంటూ సరస్వతి నవ్వుతుంటే... గాలి గట్టిగ దోలినా పూలుగాయపడతాయని యాడ్నో సదివినలెండి అని గాపోరడనేతాల్కె ఆమె బుగ్గలెందుకో సిగ్గుతో ఎరుపెక్కాయి...
ఇంతల బెల్ మోగిచ్చుకుంట సెక్ జేసుకుంట దోస్తుగాడస్తె ఎనక క్యారేజీమీద ఎప్పటిలెక్క కూసుంట.. కరపత్రాలన్నిచ్చిన్లు.. ఒక్కటన్న ఉంచుకోరా.. అంటూ ఒక కాగితం ఆమెకందిచ్చిండు అరుణ్... బలే సక్కంగ మాట్లాడతాన్నవ్ మీ పేర్లేంది అని అడిగింది సరస్వతి గా ఒక్కని పేరే అడగలేక.. నాపేరు అరుణ్... ఈని పేరు సాగర్.. మేమిద్దరం హైద్రవాద్ల డిగ్రీ చేస్తన్నం.. గీనెల ముప్పరు తారీకు మా పార్టీ బయిరంగ సబుంది... గాపాంప్లేట్లే ఊళ్ళకు దిరిగి పెచారం జేసుకుంట పంచుతాన్నం.. అన్నాడు అరుణ్ ఇగబోనీరు రా అని అనుకుంట... జీబు గదులుతాంటె అనుకుంది సరస్వతి సదువుకునెటోళ్లకు ఏం పార్టీలని..
తన సేతులోని పాంప్లేట్ సూస్తాంది. గాపాంప్లేట్ ఒకేపు ఎర్రరంగులో ఉంది.. దాని మీదె అక్టోబర్ ముప్పరు తారీకు పంతొమ్మిదొందల డెబ్బరు నాలుగు కులవివక్ష నిర్మూలన సంఘం బహిరంగసభ అని ఉంది ఎనకేపు ఏమీరాయలే తెల్లకాయితం లెక్క ఉంది.. దొరసానీ పున్నెముంటది గీసంగతి సుత దొరకు తెలియనియ్యకుండ్రి... సంపి బొందబెడతడు అని రాజు ప్రాదేయపడుతుండటంతో ఈలోకంలోకొచ్చింది... మన బండికేమన్న అయ్యిందా సూసినావురా.. అని సరస్వతి అడుగుతుంటె.. ఏంగాలే దొరసానీ ఆళ్లకు సుత ఏంగాలే దేవుడి దయవల్ల ఇయ్యాళ లేశినేల మంచిదయ్యింది అన్నడు రాజు... జీబు పొలాల దారిగుండా ఊరి దిక్కు రయ్మంటోంది..
ఊళ్ళె బొడ్రాయి కాడ క్యాల్నీ జనాన్ని పోగేశి మీటింగ్ బెట్టిండు దొర... ఆలోసించుకోండ్రా.. మీరుగిన సర్నంటె దసరెళ్లినంక ఇండ్లు కూలగొట్టిచ్చి ప్యాక్టరీ పనులు షురూ జేస్తనంటాండు మాబామ్మార్ది.. బామ్మర్ది అయితేంది పరిహారం మంచిగియ్యలె అని జెప్పిన ఇంటికి పాతికవేలు ఇత్తమంటండు.. అంతకన్న ఇలవజేస్తారు మీయి కాలనీ ఇండ్లేనారు... అన్నడు దొర లంక చుట్ట ఎలిగిచ్చుకుంట.. ఎవుళూ ఏమీ మాట్లాడక పోతుండేటాలికి సరె మీ ఇష్టం ఇంగోపాలి ఆలోచించుకోరి '' అంటూ ఆడికెల్లి ఎళ్లిపోయిండు..
గడీల గారేత్రి అన్నాల్ దినేటప్పుడు.. ''బతుకమ్మ పూలకు నువ్వుబోతనంటవేంది బిడ్డ, గడీల గింతమంది పనోళ్ళు పాలేర్లున్నరు.. ఎంగిలి పూలకాన్నుంచి సద్దుల దాంక ఆళ్లె తెచ్చేస్తరు తిరు'' అంది సీతాబారు కూతురిని వారిస్తన్నట్టు...
గప్పుడె మిద్దెమీదికెళ్ళి మెట్లుదిగుకుంటస్తన్న దొర గామాటలిని.. ''అయితాయె తిరు ఆమె ఖాయిష్ ఎందుకు కాదనుడు. దోస్తులతో గలిసి పోతదేమో పోరు రానిరు. గీ ఒక్కేడే గదా సిన్న దొరసాని గీ గడీల గీ ఊళ్ళె ఉండేడిది కార్తీక మాసంల లగ్గమే అనుకుంటుంటిమి'' అన్నాడు కూతురిని దగ్గరకు తీసుకుంటూ.. తండ్రి తనమాటకే మద్దతివ్వటంతో మా మంచి బాపు అంటూ దొరనుదుట ముద్దుపెట్టి గట్టిగ అల్లకపోయింది సరస్వతి..
గారాత్రి మొగులు గుట్టంతబట్టింది గదిల నాయినమ్మ కమలాబాయితో కలిసి పండుకుంది సరస్వతి .. కానామె కండ్లు మలుగుతలేవు.. ఊళ్ళోల్లు మానాయనకాడ అప్పుదీస్కున్నట్టు గీ రేత్రికాడికెల్లి రేపటి రాత్రి కొంత శీకటి అప్పుదీస్కుంటె గాదా.. తొందరగ తెల్లారిపోను.. అని మనసులో అనుకుంటొంది .. మిత్తి ఎంతగట్టినా దొరకాడ జేశిన అప్పు ఎప్పటికి తీరనట్టు గదిలో చిమ్మ చీకటి, రాత్రి ఇంకా సగముంది.. సరస్వతి పట్టెమంచంపై అటుఇటు మెసులుతోంది.. రెప్ప పైకెత్తగానే ఆ చీకట్లో తనతెల్లని కన్ను ఆకాశంలో జాబిల్లిలెక్క ఎలిగింది.. బయట గ్రామ పంచాయతీ వీధిలైటు చక్కున మెరుస్తోంది.. సరస్వతి ఒత్తిగిల్లి పండుకున్నందున గామె ఒకకన్ను కిందికి ఒకకన్నుపైకి ఉంది..
ఇంతల వాన మొదలయ్యింది పదునైతే గా వందెకరాల వరిమళ్లు తొక్కియ్యాలె అని తనలో అనుకుంటొంది.. కమలాబారు.. సరస్వతి మాత్రం దేవుడ, దేవుడ.. దేవుడ తగ్గాలె తగ్గాలె దేవుడ.. దేవుడ.. దేవుడ అంటూ దండకం షురూ జేశింది. ఎందుకంటే గామె పొద్దుగాళ్ళ లేశి బత్కమ్మ పూలకు పోవాలనుకుంటాంది... అడ్విల తిరుక్కుంట తీరొక్క పూల కోసుకుంటననే గాదు గడీదాటి బయటకుబోతె నిన్నటి ఎర్ర పాంప్లేట్ల పోరడు మళ్ళ యాడన్న అవుపడతడేమో అని.. నిన్నటి సంది ఆడు ఎందుకో మళ్ల మళ్ల యాదికస్తాండామెకు...
జీబు ఎంతకీ స్టార్ట్ కాకపోతుండటంతో ఇసుక్కుంటుండు దొర.. బెంటాం కంపెనీ తయారుజేశిన 1940 మోడల్ జీప్ అది.. దాన్ని తన స్టేటస్ సింబల్‌గా తెప్పిచ్చుకుండు దొరతండ్రి.. ఆయన్ను నచ్చలైట్లు అత్యజేసుడు గప్పట్ల సంచలనమయ్యింది.. ఆయన బోయినప్పటి నుంచి గీజీబును తండ్రి గ్యాపకంగా వాడుతున్నడు గీదొర... తన గడీల ఇంగో నాలుగుకార్లు రొండు కొత్త మాడల్ జీబులున్నా గీమొదటి తరం జీబును ఇష్టపడతడు దొర.. ఊళ్ళె పనులకు పట్నం పనులకు దీన్నే వాడతడు.. రొటీన్ చెకప్స్ చేస్తూ నాలుగైదు గంటలు తన్నకలాడినా ఫాయిదా లేకపోవటంతో... ఇపుడేం జేతు అనుకుంట... తనకు తెలిసినోళ్ళకల్లా ఫోన్ జేసి అడగబట్టిండు రిపేర్ చేసేటోళ్ళ అడ్రస్ కోసం... అవసరమైతే ఐద్రావాద్‌కెళ్ళైనాసరే మెకానిక్‌ను పిలిపియ్యాలని ఆరా తియ్యంగ తియ్యంగ ఎవళో చ్చెప్పిండ్రు.. తనకెరకైన ఒక పిలాడున్నడని.. డీజిల్ మెకానిక్ కోర్స్ సదివినోడని వాడు బాగుజేసి తీరతడని జెప్పెసరికి ఊపిరిపీల్చుకున్నడు దొర... కర్సు ఎంత దీసుకున్నా ఫికర్ లేదు నా అడ్రస్ ఇచ్చి జల్దిపంపుమని అన్నడు..
తెల్లారి ఎవరో రెండు చేతుల్లో రెండు సంచులు బట్టుకొని గడీముంగటికచ్చి అడ్రస్ అడుగతుండటంతో లోనికి తీసుకొచ్చిండు పగటి కాపలోడు రాములు.. అర్రె.. అచ్చినవా రా నీకోసమే సూత్తన్నా.. సూడు సూడు జరజూసి బాగుజెరు.. చెడిపోయినప్పటి నుండి నాకేం దోస్తలేదు ఒకటే పిసపిసైతాంది.. అంటూ తన ఆరాటం వెళ్లగక్కుతుండు దొర.. అతన్ని దీసుకబోయి కొట్టంలోని జీబును సూపించగానే షాకయ్యిండు ఆవొచ్చినోడు.. గీజీబే గదా మొన్న మమ్మల్ని గుద్దింది.. అంటె ఆరోజు జూశిన సన్నజాజిపువ్వు గీఇంట్ల బూసిందేనా అని అనుకున్నడు..
హమ్మ ఎట్లైతేంది గీవంకన గాపిల్లను మళ్లసూడొచ్చు అని ఖుష్ అయితాండు.. మొన్న సూసింది మొదలు ఎందుకో పదేపదే గుర్తొత్తాంది అనుకున్నడు.. జీబు చూస్తున్నట్టు నటిస్తూ ఆరోజు ఆమె కూర్చున్న సీటును తదేకంగా చూస్తూ చేత్తో తడిమి తన్మయం చెందుతుంటే దొర జీబు గురించి ఏమేమో చెప్పుకుంటపోతాండు..
ఆ రోజు ఊళ్ళె ముత్తాలమ్మ జాతర కావటంతో రాజుతో సహా పనోళ్ళెవళూ పన్లోకి రాలేదు.. నువ్ సూత్తాండు ఇప్పుడేస్తననుకుంట లోపలికి బోయిండు దొర.. అరుణ్‌కు ఆరోజు దశ్యాలే కళ్ళల్లో మెదులుతున్నరు..
టీ తీసుకోండ్లి..అని తియ్యటి గొంతు వినపడటంతో వెనక్కు తిరిగిచూశాడు.. ఆ వెంటనే గా ఇద్దరూ ఒకలనొకలు చూసుకొని ఆశ్చర్యపోతాన్రు.. ఇతను అతనేనా అని ఆమె పోల్సుకుంట అక్కడే పెట్టిన అతని సంచివైపు చూసింది.. ఆసంచిలో గవే.. అక్టోబర్ ముప్పరు తారీకు పంతొమ్మిదొందల డెబ్బరు నాలుగు కులవివక్ష నిర్మూలన సంఘం బహిరంగసభ ఎర్ర కరపత్రాలు అవుపడీ అవుపడనట్టు అవుపడుతున్నారు.. ఆమె అతని కోసమే ఎదురు చూస్తున్నప్పటికీ ఆడపిల్ల స్వతాహాగ సిగ్గు.. గడీ కట్టుబాట్లు ఆమెను అక్కడ ఉండనీయలేదు.. ఆడు గామెళ్లినేపే సూస్తుండిపోయిండు.. ఆమె బోయిన కాసేపటికి దొర గడీలకెల్లి ఎల్లిండు.. ''టీతాగినవా.. ఏమయ్యిందో జర సూడు మేమట్లా ముత్యాలమ్మ గుడిదాంకపోయెస్తాం'' అంటూ భార్య, తల్లితో కలిసి కారులో పోయిండు దొర..
అరుణ్ జీబుకెల్లి సూత్తాంటె.. సరస్వతి మళ్ళొచ్చిందాడికి... ఇందాక తెచ్చిన టీగ్లాసు, నీళ్లచెంబు కొంచబోయేందుకు అన్ననెపంతో.. ఆమె వాటిని తీసుకుంటుండగా నువుపోలేదేం గుడికి అన్నాడు.. పోదమనే అనుకున్న ఇందాకటి దనక... కానీ అంటూ నేలమీద కాలిబొటనవేలు రాస్తోంది... అవ్ నువ్ మెకానిక్ వా డిగ్రీ సదువుతన్న అన్నవ్ అన్ని జూట మాటలేనా అని నిలదీస్తుండగా.. లే.. జూట మాటలెందుకైతరు సదువుతున్న గనీ అంతకు మునుపు ఐటీఐ చదివిన ఏం కొలువు రాకపోయెటాలికె ఖాళీగ ఉండుడెందుకని డిగ్రీలో చేరినా గిప్పుడు ఫైనలియర్ అన్నాడు అరుణ్.. మల్ల మీ బయిరంగ సభనెటు దోలితివి ఇటుబడ్డవ్ అంది సరస్వతి అనేపు కొంటెగ సూత్తా.... గదిగదే గిదిగిదే ఇంగొవ్వు అయ్యాల నీమీదబడ్ద కరపత్రాలు అంటూ సంచీలోంచి తీస్తూ ఆమెకు సూపిస్తుండగా పంచుతన్నవా లేక నామీద బడ్దయని ఎవుళకు పంచకుండ దాసుకున్నవా అంటూ అతని చేతిలోని కరపత్రం తీసుకుంది...
అదే సమాచారం అదే ఎర్రరంగు మళ్ళెందుకిచ్చినవ్ అన్నట్టు అతనివైపు చూసేసరికి తిప్పిసూడు అన్నడు అరుణ్... సుక్క ఆకాశంల ఉంటదనుకున్న గజ్జెల పాదాలతో ఇగో గిప్పుడే నా ముంగట సక్కంగ మెరిశి పోయిందీ ... అని అందమైన చేతి దస్తూరితో ప్రేమ వాక్యాలు రాశాడు.. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడ జూసినంక గీవాక్యాలు రాశిండన్నమాట అనుకుంటూ దాన్ని తీసుకొని లోపలికి పరుగెత్తింది సరస్వతి..
ఏంకత.. ఎంతవరకొచ్చింది అని ఆరా తీస్తూ వచ్చిండు దొర.. చూశానని ఏవేవో పనిముట్లు చెడిపోయాయని చెప్పాడు అరుణ్.. కానీ ఆ జీప్ ఎందుకు ఆగిపోయిందో అతనికి తెలుసు. ఆరోజు తమసైకిల్‌ను ఢకొీట్టినప్పుడు ఇంజన్లో ఎక్కడో ఎయిర్లాక్ అయి ఉంటుంది.. దాన్ని తీసుడు తేలికే కానీ చాలా పెద్దపని అన్నట్టు నమ్మించి ఇక్కడే రెండు మూడు రోజులుండాలనుకున్నడు..
అవునా.. అనుకున్న ఏదో పెద్ద రిపేరే అచ్చిందనుకున్నా అని అంటున్నడు దొర.. సరే తెద్దాం సామాను గానీ పొద్దుబోయింది గదా గిప్పుడు పట్నం బోయేటప్పటికే దుకాన్లు బందువెడ్తరు.. సరే తిరు రేపు కుల్ల జేసేటైంకు బోదం.. అన్నడు దొర.. గీరాత్రికి ఈడ్నే ఉండు అగో గాగది ఖాళీగనే ఉంది. అండ్ల ఉండు అన్నంగినక ఆడికే పంపుతం అనుకుంట లోపలికి బోయిండుదొర.. చెప్పిన గదిలోకి బోయిండు అరుణ్.. ఏంతోసట్లేదు.. ఆమె కనపడతదేమో అని చాలాసార్లు బయటకు తొంగిసూసిండు ఆమె జాడలేకపోయే సరికి.. కరపత్రం దీసి మళ్ళేవో ప్రేమ వాక్యాలు రాశాడు.. మళ్ళీ మరోసారి తను మళ్లీ మరెవో వలపు పదాలు రాయగలడు కానీ మళ్లీ ఆ బహిరంగ సభ కరపత్రంపైనే రాయగలడు ఎందుకంటే అతనివద్ద వేరే తెల్లకాగితాల్లేవు..
రాత్రి అన్నం తీకెళ్ళేందుకొచ్చిన చాకలి తులసితో అతనికి భోజనం పంపింది దొర భార్య.. అన్నం పళ్లెంతో తనే వస్తుందనీ అశపడ్డాడతను... ఆశకు హద్దుండాలని తనకు తానే సందాయించుకున్నాడు.. గడీల్లో స్త్రీ స్వేచ్చ గురించి ఆనికి ఎరికే.. గా వాడు భోజనం చేస్తున్నాడు తులసి బయట వరండాలో కూర్చోని జడల్లుకుంట ఏవో లొల్లాయి పాటలు పాడుతోంది... దొరసాని చెప్పినట్టు అతను భోజనం చెసేదాక ఉండి తిన్న కంచం తీసుకెల్తోంది..
ఆమె వస్తున్న వైపు చూస్తోంది సరస్వతి.. తను తిన్నాడా ఏమన్నాడు అని అడగాలని ఉంది. తనే తీసుకెళితే బావుండేది అనీ ఉంది ఆమెకు.. ఇంతలో దగ్గరగా వచ్చింది తులసి.. ఆమెవైపే చూస్తున్న సరస్వతికి ఆ పళ్లెం అడుగున ఆ బహిరంగసభ కరపత్రం ఉన్నట్టనిపించింది.. అతను ఇందాక ''గుండె దోసిలి పట్టిన నేలను నేనుగా వాన సినుకు మళ్ళెప్పుడస్తదో'' అన్న వాక్యాలు రాసి టేబులమీద పెడితే దాని మీదే తులసి అన్నం కంచం పెట్టటంతో అది తడికి అతుక్కుంది.. సరస్వతి మాత్రం తన కోసమే అతను ఏదో రాసి కంచం అడుగున అతికించాడనుకుంది... తులసిని ఆపి పాటలు భలేపాడుతున్నావే అంటూ మాటల్లోపెట్టి ఆ కరపత్రం ఆమె కంటపడకుండా తీసుకుంది.. ఆ కరపత్రంలో అతను వ్యక్తం చేసిన ప్రేమ భావాలకు ఆమె ఫిదా అవుతోంది..
మరుసటిరోజు గడీలోకొస్తూనే జీబుకాడున్న అరుణ్‌ను చూసి కంగారుపడ్డాడు రాజు.. గబగబా అతని దగ్గరికెళ్లి.. మొన్న ఢకొీట్టిన సంగతి దొరకు చెప్పొద్దని చెవిలో బతిమాలుతున్నాడు.. ఇంతకూ నువ్విక్కడున్నవేంది అని అడుగుతుండగా.. దొర అక్కడికొస్తూ.. రేరు రాజు.. గీ అబ్బారు మెకానిక్.. మీ ఇద్దరు కలిసి టవునుబోయి జీబు రిపేర్కు కావాల్సినయేందో కొనక్కరాపోరి... అంటుండగా... గియ్యాల బందంట దొరా దుక్నాలుండయి మీకెరికే గదా.. అనగానే.. ఈరోజు బంద్‌కు నక్సల్స్ పిలుపునిచ్చిన వార్త పొద్దున పేపర్లో సదివిన సంగతి అప్పుడు గుర్తొచ్చి నిజమేరా అన్నాడు దొర..
ఆ తెల్లరి ఆదివారం కావటంతో రాజుకు మరో రెండు రోజులు అక్కడే గడిపే అవకాశమొచ్చింది..
రోజూ సాయంత్రం బతుకమ్మలాటల్లో సరస్వతిని చూసే అవకాశాన్ని ఉపయోగించు కుంటున్నాడు..
మూడోరోజు బతుకమ్మ ఆట మొదల య్యింది.. శివాలయం కాడ అమ్మలక్కలు తెలంగాణ సంప్రదాయాన్ని చాటి చెపున్నరు... సుట్టు తిరుక్కుంట పాటపాడుతాంది సరస్వతి.. ఇంతల ఒక పాపొచ్చి అక్క నీకు గీ కాయిద మియ్యమని గా అన్న ఇచ్చిండు అనుకుంట ఎర్రకాయిదం శేతికిచ్చి తుర్రుమంది బుజ్జి.. అమ్మో ఎవుళన్న సూస్తన్నరా అనుకుంట కాయితం తిప్పిసూస్తె ''సూడు నీ ముంగటి గాపూలన్నీ ఎట్ల కుములుతన్నయో ఆటిల్లో ఏ ఒక్కటీ నీ అంత అందంగ లేదనీ'' అంటూ అద్భుతమైన ప్రేమ కవిత... అటు ఇటు ఎటు జూసినా అరుణ్ అగుపిస్తలేగానీ పరీచ్చగ జూసే సరికి గాడున్న అందరు ఆడోళ్ల శేతులల్ల గయ్యే బహిరంగ సభ కాయితాలుండెటాల్కె ఒరెక్కా గిదేం కత అనుకుంట పరేశాన య్యింది.. నాకు రాశినట్టె అందరికీ రాశిండా ఈడు అనుకుంట ఒకోక దగ్గరికిబోయి ఆళ్ల కాయితాలు తిప్పేసి మర్లేసి సూశింది.. అందరికీ బహిరంగసభే నాకు మాత్రమే ప్రేమ కవిత్వం అనుకొని మురిసిపోయింది...
అట్ల ఆడ ఉన్నన్నన్నాళ్లు సరస్వతికి కరపత్ర ప్రేమలేఖలు చేరవేసిండు అరుణ్.. నాలుగో దినం పొద్దుగాళ్ళ జీబు అటు ఇటు గెలికి భాగాలు విప్పి ఫిట్ చేసి రిపేర్ చేశాననిపించి ఎల్ల లేక, ఎల్లలేక ఎల్లిపోయాడు అరుణ్.. పోయ్యేముందు అక్కడొక ఎర్ర కాయిదముంచిపోయిండు ఆమె సూసెటట్టుగా..
''కాళ్ళున్నారు నా పాదాలెటు బోయారు.. నినిడిశి ఒక్కడుగేయలేనూ'' అని రాశుంది గండ్ల..
అతను రాసిన ప్రేమ వాక్య కరపత్రాలన్నీ దారానికి అంటించి తనగదిలో తోరణంలా కట్టుకుంది సరస్వతి... ఒక వైపు సభ సమాచారం మరోవైపు ప్రేమ వాక్యాలను చదువు తున్న ప్రతిసారీ ఆమెకు కొత్తగానే ఉంది.. ఇంకొన్ని రాసి పంపితే బావుండు అన్నీ కలిపి ఒక బహిరంగ సభ అనే పేరుతో సంకలనం వేయిద్దును అనుకుంది...
గారోజు నుండి పెతిరోజు పేపర్ల బెట్టి, వీక్లీల పెట్టి ఎదో రకంగా గదే కరపత్రంపై తన ప్రేమ వ్యక్తం చేస్తూ పంపేవాడు.. ఊళ్ళెకెల్లి ఎళ్ళిపోయిండుగద మళ్ళెట్ల బంపుతాండని ఆశ్చర్య పోయేది సరస్వతి.. వాటినిసదివి బద్రంగ దాసుకునేది సరస్వతి కానీ దేనికీ రిప్లరు ఇవ్వలే... ఆమె తన లేఖలను తీసుకు నుడే తనప్రేమను సమ్మతించటం అని అతను అర్థం చేసుకున్నడు..
గీఊళ్లెనే సుట్టాలకాడ ఉన్ననని గియ్యాల మాపటాళ్ళ మీగడీ కొట్టంలో జీబుకాడ ఎదురుసూస్తంటనని.. సద్దుల బతకమ్మ రేపనంగ ఆమెకు లేఖపంపిండు అరుణ్...
అట్లా పోవుడు ఇష్టంలేదు తనకు..అతని ప్రేమంటే ఇష్టమే, అతనంటే ఇష్టమే కానీ.. అతని వాక్యాలంటే, కవిత్వమంటే అతనిలోని విప్లవ గుణమంటే, అతను తొడిగే ఎర్ర సొక్కా అంటే, అతను పరిచయం చేసిన చేగువేరా పుస్తకాలంటే మరీమరీ ఇష్టం.. కానీ అతన్ని ఏకాంతంగా కలవటం ఏమాత్రం ఇష్టం లేదు.. అలాచేస్తే తన తండ్రి దొరతనమేం కాను, తనపై పాతికమందిగల తనకుటుంబం పెంచుకున్న ప్రేమేం కాను.. తన కుటుంబ గౌరవానికి మచ్చతెచ్చే పని తను చేయదలుచుకోలేదు.. ఆకర్షణకు కుటుంబ ప్రతిష్టను బలిపెట్టదు.. తను ఈ గడీ ఆడపడుచు.. అనుకుంటొంది.. కానీ ఆమె మనసు వివేకాన్నోడించింది... అది ప్రేమ బలమో బలహీనతో..
అబ్బ ఎంత సేపాయె ఎదురుసూడవట్టి అస్తవో రావో ఇగబోదాం అనుకుంటున్న... అన్నడు అరుణ్ సరస్వతి వైపు సూసుకుంట... ఆమె ఏమీ మాట్లాడలేదు సిగ్గు భయమూ ముంచుకొస్తున్నారు ఆమెలో.. అతనికి చాలా దూరంలో నిలుచుంది.. ముఖానికి చెమటలు పడుతున్నారు... ఇగో ఇటొచ్చి జీపెక్కు.. జీబుల గూసుంటె మహరాణిలెక్కుంటవు అన్నడు అరుణ్ ఆమె తలపైకెత్తలేదు... రమ్మంటూ చెయ్యి చాపితే సిగ్గుపడుతూనే రానన్నట్టు తల అడ్డంగ ఆడించింది.. ఆమె స్థితి అర్థం చేసుకున్నడు అరుణ్..
బహిరంగ సభ తేదీ దగ్గరపడుతోంది నేను మరో పది పదిహేను రోజుల వరకూ తను ఆ పనుల్లో బిజీగా ఉంటా .. నిన్ను ఒక్కసారి దగ్గరగా జూసి నాప్రేమ పట్ల నీ అభిప్రాయమేంటో కనుక్కొని వెళ్లిపోవాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడకు రమ్మన్నా.. గిది తప్పయితే క్షమించు అని అతనంటుండగా... ఆమె దగ్గరికొచ్చి తన చేత్తో అతని నోటిని మూసింది గట్ల మాట్లాడొద్దన్నట్టు... ఆ వెంటనే దూరం జరిగి వెళ్లిపోతుండగా.. థాంక్స్ అని అరుణ్ గొంతు వినపడటంతో.. వెనక్కు తిరిగి ఆగింది... ఒక్కసారి జీప్‌లో కూర్చో అనటంతో అరుణ్ డ్రైవర్ సీట్లో కూర్చొనేందుకు అటువైపెళ్లబోతుండగా... డ్రైవర్ సీట్లో కాదు.. అంది ఆవెంటనే ఇటువేపొచ్చి ఆ రోజు సరస్వతి కూర్చున్న సీట్లో కూర్చున్నాడు.. ఎర్రచొక్కాలో భలే అందంగా ఉన్నాడు మహారాజులా అని తనమనసులో అనుకుంది గజ్జెల చప్పుడుతో పరుగెడుతూ ...
గడీలోకి బోయినంక చాలాసేపు ఆమె మనసు కుదుట పడలేదు తను అరుణ్ తో మాట్లాడటం ఎవళన్న చూసిన్లా.. అరుణ్ ఎవళ్ల కంట్లపడకుంట గడీ దాటిండా శానసేపు తొక్కులాడింది... రాత్రి అన్నం దినేటప్పుడు తండ్రి ఇద్దరు కాకయ్యలు అవుపడకపోయేటాల్కె అడిగింది.. ఏమో అర్జంటు పనుండి ఐద్రావాద్ పోయిన్లని తల్లిజెప్పింది..
ఎంగిలిపూల నుండి బతుకమ్మలు రోజూ ఊళ్ళె శివాలయం కాడి బాయిల ఇడుస్తరు..
సద్దులనాడు మాత్రం ఏటికిబోయి బతకమ్మల ఏట్లె సాగదోల్తరు.. ఏటికి బోయేటప్పుడు తనగదిలోని గా కరపత్రతోరణాలను సూసి సదువుకుంది మళ్ళ పోయొచ్చినంక సదువుకుంది... దసర ఎల్లిన తెల్లారే పట్నం బోవాలని బయిరంగ సభ రోజు ఆడికిబోయి అరుణ్‌ను ఎట్లన్న గలిసితీరత అనుకుంది... తెల్లారి పొద్దుగల జూస్తే బొమ్మపడవల్లా బతుకమ్మలు ఏటినీళ్ల మీద తేలతన్నరు...
క్యాల్నీ జనాల్లో దిగులు కమ్ముకున్నట్టు దొర గడీపైన గా ఊరిపైనా మొగులు ముసిరింది.. ఏదో అడగటానికి ఎవరినో నిలదీయటానికి ఏదో న్యాయం పొందటానికని గడీకి నడిసొచ్చింది క్యాల్నీ...
సన్నజినుకు రాలబోతండగా నోరిప్పిండు క్యాల్నీ పెద్దదిక్కు అక్కులు... దొరా నీబాంచెన్ కాల్మొక్త.. బతుకమ్మ బోణం అంటె తంగేడు పూలేగానీ ఒక్క తంగేడు పూలతోనె బోణమైతాది దొర.. బీర కట్ల, గునుగు తీరొక్క పూలెన్నిగావాలె..ఊరంటె గూడా పేర్శిన బోణమే దొరా..అన్నికులపోండ్లు గావాల్సిందే.. అనుకుంట రెండు శేతులెత్తి దండంబెడ్తండగ వాన మోపయ్యింది... అందరి కళ్లల్లోనుంచీ కన్నీళ్లు ధారగ కారుతున్నయి.. గానీ వాన వాళ్ళ కన్నీళ్లను కనపడనీయటం లేదు...
గా రేత్రి సరస్వతితో మాట్లాడిన కొంతసేపటి తరువాత కొట్టంలోనుండి బయటకొస్తుండగా... ఎదో బలమైన చెయ్యి అతని భుజంపై పడేసరికి భయంతో వణికిపోయిండు అరుణ్.. ఎదురుంగ నిలవడ్డ దొరగొంతు ఉరుము ఉరిమినట్టు ఏంటోడివిరా నువ్వు.. అని గర్జించింది.. బతకమ్మ పండగ తెల్లారి గాఊరి ఏట్ల బతుకమ్మలు తేలినట్టుగా ఐద్రావాద్ ఉసేన్సాగర్ నీళ్ళల్లసుత ఎర్రసొక్కేసుకున్న గా పోరని శవమూ తేలింది...
- శ్రీనివాస్ సూఫీ,
9346611455