Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవిరాజుగా సింహం రెండవసారి ఎన్నికలలో గెలిచినా తక్కువ ఓట్లలో గెలుపొందడం అవమానంగా తోచింది. ఇంతకు మునుపు రాజుగానున్నప్పుడు తన పరిపాలనలో ఎవరికీ కష్టం కలగకుండా న్యాయంగా పరిపాలిస్తూ అన్ని జంతువులకూ తనపై మంచి అభిప్రాయం ఏర్పడిందని వేగుల ద్వారా తెలుసుకొని తప్తి చెందాడు. అంత చక్కగా పరిపాలించినా తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయన్న బాధ కలిగింది. మహా మంత్రి ఎలుగుబంటుతో తనలోని బాధను చెప్పాడు.
ఎలుగుబంటు అన్ని విధాలా విచారణ చేసిన తరువాత ''కష్టం తెలీకుండా సుఖంగా జీవిస్తున్న జంతువులు ఓటు వెయ్యడానికి రాలేదు. అవి ఓటు వెయ్యడానికి వచ్చి ఉంటే మీకే ఓటు వేసి మిమ్మల్ని అమోఘ విజయం సాధించేలా చేసి ఉంటాయి. వాటికి మీ మీదే అభిమానం''
''నా మీద అభిమానమున్నా, ఎందుకు ఓటు వేయడానికి రాలేదు''
''జంతు శాస్త్రాన్ని, జంతు ధర్మాన్ని, జంతు వైద్యాన్ని, అడవి స్వరూపాన్ని మొదలగు వాటిని అధ్యయనం చేసి మంచి పేరు తెచ్చుకొన్న జంతువులకు మీరు ఈ అడవిలో నది ఒడ్డున వున్న పండ్ల తోటలోప్రత్యేక వసతులతో వాటికి ఆశ్రయం కల్పించారు. తాము నేర్చుకొన్న పాండిత్యం వారిలో గర్వాన్ని పెంచింది. అడవి ఏమైతేనేం అన్న భావనతో సుఖంగా జీవించసాగాయి .అక్కడున్న జంతువులలో పూర్తిగా స్వార్థం చోటు చేసుకొంది''
''వారిలో మార్పు తెప్పించలేమా''
''మహారాజా ఓటు హక్కు వినియోగించని జంతువులను, అక్కడి నుండి బహిష్కరించి అడవిలో అందరి మధ్య జీవించేలా చేసామంటే తప్పకుండా మార్పు వస్తుంది. ఆ తరువాత జరుగబోవు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించని వారికి శిక్ష ఉంటుందని ప్రకటించండి'' అంది ఎలుగు బంటు
''ఎన్నికలు అడవి ప్రాణుల మంచి పాలకులను ఎన్నుకోవడం కోసం నిర్వహించబడినవి. అడవిలో మంచి పరిపాలన చేయగల రాజును ఎన్నుకోవాలన్న ఆలోచన కలగాలి .నేను మరలా ఎన్నికలలో నిలబడను, కానీ మరుసటి ఎన్నికలలో మంచి అడవి రాజు ఎన్నిక కావాలంటే అందరూ ఓటెయ్యాలి. అప్పుడే మంచి రాజును ఎన్నుకొనగలరు. మీరు చెప్పిన విధంగా ఓటు వేయని వారికి గుణపాఠం నేర్పేలా వెంటనే చర్య తీసుకొంటాను'' అన్నాడు.
సింహం పాలనాకాలం ముగిశాక జరిగిన ఎన్నికలలో అడవిలోని అన్ని జంతువులూ పాల్గొని ఓటు వేసి మంచి మృగరాజుని ఎన్నుకొన్నాయి.
- ఓట్ర ప్రకాష్‌రావు,
09787446026