Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యాపురి రాజ్యంలో విద్యాధరుడనే గురువుగారు తన శిష్యులకు విద్య నేర్పుతుండేవారు. ఆ రాజ్యంలోనే అత్యుత్తమ గురువు అతడు. అయితే ఆ గురువు గారు విద్యాబోధన చేస్తున్న సమయంలో ఒక రామచిలుక ప్రతిరోజూ వచ్చి చెట్టుమీద కూర్చొని గురువుగారు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేది. కొన్నాళ్ళకు ఇది గమనించిన విద్యాధరుడు ఒకరోజు చిలుకను ప్రత్యేకంగా పిలిచి, చేతిలోకి తీసుకుని ''ఓ చిట్టి చిలుకమ్మా! నువ్వూ విద్య నేర్చుకుంటావా?'' అని అడిగాడు. తల ఊపింది రామచిలుక. దానికీ ప్రత్యేకంగా పాఠాలను నేర్పాడు. అడవిలోని జంతువులకు, పక్షులకు అవసరమైన పాఠాలను నేర్పాడు.
మరి రామచిలుక ఊరుకుంటుందా? రోజూ అడవిలోకి వెళ్ళి, ఆ పాఠాలను తన మిత్రబందానికి నేర్పసాగింది. క్రమేపీ అనేక పక్షులు, జంతువులు రామచిలుక శిష్యులుగామారి విద్య నేర్చుకుంటున్నాయి. కొన్ని గురువును మించిన శిష్యునిలా రామచిలుక కంటే ఎక్కువ మేధావులు అవుతున్నాయి. ఏనుగు అన్నింటికంటే గొప్ప మేధావి అయింది.
ఈ విషయం అడవికి రాజైన సింహానికి తెలిసింది. చిలుకను పిలిపించి ఇలా అంది. ''ఓ రామచిలుకా! ఈ అడవికి నువ్వు చేస్తున్న సేవ ఎంతో గొప్పది. నాకు వద్ధాప్యం వచ్చింది. నేను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఇది. మరి అడవికి రాజుగా ఎవరిని చేయాలో నువ్వే నిర్ణయించు. విద్యావంతుల సలహా తీసుకొని ముందుకు పోదామని నీ సలహా అడిగాను.'' అని. తనకు దక్కిన అరుదైన గౌరవానికి సంతోషించిన చిలుక ''ధన్యవాదాలు మగరాజా! అడవి జీవులను అన్నింటినీ సమావేశపరచి ఎక్కువ జీవుల అభిప్రాయం ప్రకారం వన పాలకుని నియమిద్దాం'' అన్నది. అనుకున్న రోజున అడవి జీవులను సమావేశపరిచి విషయం చెప్పింది సింహం. అన్ని జీవులూ కలసి విద్యలో మంచి మేధావి అయిన ఏనుగును రాజుగా ఎన్నుకున్నాయి. విద్యకు ఉన్న విశిష్టత అది. విద్య మనల్ని ఎంత ఉన్నత స్థాయికైనా తీసుకువెళ్తుంది. విద్యావంతులు అంతటా గౌరవింపబడుతాడు.
- సరికొండ శ్రీనివాసరాజు,
8185890400