Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకరోజు సూరయ్య, చంద్రమ్మ అనే రైతు దంపతులు తమకున్న రెండెకరాల పొలంలో బాగా దుక్కిదున్ని పత్తి విత్తనాలు నాటుతున్నారు. అదే సమయంలో ఆకాశమార్గంలో శివపార్వతులు వెళ్తున్నారు. ఎంతో శ్రమించి భూమిలో విత్తనాలు నాటుతున్న దశ్యాన్ని గమనించారు.
''ఓ నాథా ఆ రైతు దంపతులను చూడండి...! ఆకాశంలో మబ్బులు లేవు. వర్షం వచ్చే అవకాశమూ లేదు. అయినప్పటికీ, తన పొలములో విత్తనాలు పెడుతున్నారు. వర్షం పడకుంటే అవి ఎట్లా మొలుస్తాయి?'' అని శివుడితో అన్నది.
''ఆ విషయము వారినే అడిగి తెలుసుకుందాం పద'' అని శివుడు పార్వతితో అంటూ... మారువేషంలో మానవరూపం ధరించి కిందకు దిగారు.
''ఏం పెద్ద మనిషి.... బాగున్నావా! పైకి చూస్తే ఎక్కడ కూడా ఆకాశంలో బారెడంత కూడా మబ్బు పట్టలేదు. అయినా మీరేమో విత్తనాలు చల్లుతున్నారు. వర్షం పడకుంటే అవి ఎట్లా మొలుస్తాయి? మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కదా! కాస్త నువ్వైనా చెప్పొద్దా పెద్దమ్మ ముసలాయనకు'' అని శివపార్వతులు అడిగారు.
''రాత్రి వరకు తప్పకుండా వర్షం పడుతుంది అన్న నమ్మకంతో నాటుతున్నం నాయనా... పైన దేవుడు ఉన్నాడు కదా! అ భరోసాతో ఈ పని చేస్తున్నాం. సీజన్ దాటితే పంట దిగుబడి తగ్గుతుంది'' అని బదులిచ్చారు ఆ దంపతులు.
ఎట్టి పరిస్థితులలో వర్షం వచ్చే అవకాశమే లేదు అని శివుడు గట్టిగా చాలెంజ్ చేసినట్టుగా అన్నాడు. కానీ, సూర్యయ్య దంపతులు ఏమాత్రం అధైర్యపడక విత్తనాలు నాటే పనిలో మునిగిపోయారు.
ఎలాగైనా ఆ రైతు దంపతులను ఓడించాలి అనుకుని శివుడు వానదేవుని పిలిచి ''ఈరోజు నువ్వు వర్షించ కూడదు'' అని చెప్పాడు.
''కప్పలు బెకబెక మని అరవకుండా చూడండి. అవి అరిస్తే మాత్రం నేను కురువకుండా ఉండలేను'' అన్నాడు వానదేవుడు.
శివుడు కప్పలను పిలిచి ''ఈ రాత్రికి ఎట్టి పరిస్థితులలో బెకబెకమని అరవకుండా ఉండాలి'' అని ఆదేశించాడు.
''మా చేతుల్లో ఏముంది మహాప్రభువు, మినుగురు పురుగులను ఎగర వద్దని చెప్పండి. అవి ఎగిరితే మేము బెకబెక మంటాము'' అన్నాయి కప్పలు.
అప్పుడు శివుడు మినుగురు పురుగులను ఎగరవద్దని అని చెప్పాడు. అవి సరేనన్నాయి.
ఏది ఏమైనప్పటికీ, రాత్రి వరకైనా పని పూర్తి చేయాలనే పట్టుదలతో సూరయ్య దంపతులు విత్తనాలు వేయడం జరిగింది. కొద్దిగా చీకటిపడే సరికి.... కనిపించేందుకు కట్టే పుల్లలకు మంట వెలిగించి పని పూర్తి చేశారు.
శివుడు ఎంత చేసినా, ఆ రాత్రి వర్షం కురిసింది. కోపం వచ్చిన శివుడు వాన దేవునితో సహా అందరిని పిలిచి అడిగాడు.
వాన దేవుడు కప్పలు బెకబెకమన్నాయన్నాడు. కప్పలు మిణుగురు పురుగులు ఎగిరాయి అని అన్నాయి. ''ఒట్టు, మేము ఎగుర లేదు స్వామి.. మీ మాట కాదనే ధైర్యం మాకు ఉంటుందా?'' అని చెప్పాయి మిణుగురు పురుగులు.
శివుడికి మొదట ఏమీ అర్థం కాలేదు. తన దివ్య దష్టితో ఏం జరిగిందో చూశాడు. రైతు చేతిలోని మండే కర్ర పుల్లలను చూసి కప్పలు అవి మిణుగురు పురుగులు అనుకొని బెకబెక మన్నాయి. అందుకే వర్షం పడింది అని గ్రహించాడు.
''నిరంతరం శ్రమ, పట్టుదల, కష్టపడే వ్యక్తికి ఎన్ని అవరోధాలు ఉన్నా, విజయము లభించక తప్పదు కదా!'' అనుకుని తాను ఓడినందుకు నవ్వుకున్నారు శివపార్వతులు.
- కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి,
9441561655