Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇదిగో పెద్దాయనా! కాస్త సర్దుకొని కూర్చో! ఏంటి... ఎముకల గూడుతో దర్శనమివ్వకపోతే బన్నీ వేసుకోవచ్చుగా?'' అన్నాడు అప్పుడే బస్సెక్కిన రాజకీయ నాయకుడు.
పెద్దాయన సర్దుకొని కూర్చొంటూ ''ఇది ఇద్దరి సీటేలే సారూ! కూర్చోండి''అన్నాడు తలకున్న కండువాను తీసి సీటు తుడుస్తూ.
''ఆ... మీదేవూరు? రామచంద్రా పురమేనా! ఆ సంచిలోవేంటి?'' కూర్చొంటూ అడిగాడు రాజకీయ నాయకుడు.
''రామచంద్రాపురమే సారూ! ఈ సంచిలో వున్నవి పొలానికి వేసుకునే పురుగు మందులు'' చెప్పాడు.
''మీ వూరు వెళ్ళటానికి ఎంసేపవుద్దేం?''
''బస్సు ఈ గతుకుల రోడ్డుమీద వెళ్ళాలి. గంట పట్టుద్ది. ఇంతకు మీరెవరు బాబూ?''
''నేనా... నేను రాజకీయ నాయకుణ్ణిలే! ఇవాళ మీ వూరి సెంటర్లో మా పార్టీ 'రోడ్ షో' వుంటేనూ, అందులో ప్రభుత్వపు పథకాలను, చేపట్టిన ప్రాజెక్టులను, ప్రజలకు అందజేసిన సంక్షేమ కార్యకలాపాలను గూర్చి ఉపన్యసించటానికి వెళుతున్నాను!''.
ఇంతకు నాలుగేళ్ళ మా సుపరిపాలన ఎలా వుందంటావ్? ప్రశ్నించాడు రాజకీయ నాయకుడు.
నవ్వి వూరుకున్నాడు ముసలాడు.
''ఏంటి మా సుపరిపాలన ఎలా వుందంటే నవ్వి వూరుకున్నావ్. పాలన గూర్చి చెప్పవా''
''సుపరిపాలనని మీరే చెప్పుకుంటున్నారుగా!'' అంటుండగా బస్సు కదిలింది. కండక్టరు టిక్కెట్లు కొడుతున్నాడు.
''నేను చెపుతుంది నిజమే కదా పెద్దాయనా! ఇంకా ఇప్పుడు విద్య, వైద్య రంగాలపై దష్ఠిని సారించి ఆధునిక టెక్నాలజీతో విద్యార్థులకు, ప్రజలకు ఎనలేని సేవలు అందించాలని అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశాం. పోనీ... మేము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా?'' అడిగాడు రాజకీయ నాయకుడు.
మళ్ళీ నవ్వాడు ముసలాడు.
''ఏమిటి నవ్వుతున్నావ్? ప్రభుత్వపు సంక్షేమ పథకాలు అందట్లేదాని అడుగుతున్నాను?''
''ఇంకా మా దాకా రాలేదు సారూ! వస్తాయేమోలే'' నిరుత్సాహంగా అన్నాడు ముసలాడు.
''నో...నో! ఈ పాటికే అవి మీకు అందుండాలి. ఏదీ నీ పేరు, అడ్రసు, వివరాలు చెప్పు త్వరగా వచ్చేలా చేస్తాను'' అని ఓ కాగితంలో ముసలాడి వివరాలు రాసుకొని ''చూడూ! మీలాంటి వాళ్ళకు ఎంతో చేస్తున్నాం. ప్రాజక్టులను కడుతున్నాం. రాష్ట్రానికి సంబంధించి వాణిజ్య నగర సముదాయాలకు, ప్రభుత్వపు కార్యాలయాల నిర్మాణానికి ఫారిన్ టెక్నాలజీ వుపయోగించి పది ప్రపంచ స్థాయి బిల్డింగులు కట్టడానికి శంకుస్థాపనలు చేశాం. కంప్యూటరు కంపెనీలను రప్పించేందుకు ఫారిన్ ఇంజినీర్ల చేత డ్రాయింగులు గీయించి వాటిని కట్టడానికి టెండర్లు కూడా కాల్ఫార్ చేశాం. ఇంకా ప్రపంచంలోని జనం మొత్తం మన రాష్ట్రం వేపు చూసేలా పర్యాటక కేంద్రాలను అభివద్ధి చేస్తున్నాం. అక్కడ ఫైవ్ స్టార్, సెవన్ స్టార్ల హౌటళ్ళను కడుతున్నాం. ఇదిగో ఇంకో సంవత్సరంలో దేశంలోనే అభివద్ది పథంలో సాగి రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా మన రాష్ట్రం వుంటుంది. అలాంటి గొప్ప పనులను చేస్తూ, గొప్ప పథకాలను ప్రవేశపెడుతున్న మన ముఖ్యమంత్రి గారిని ఎంతైనా శ్లాఘించాలి. నిజం... మన రాష్ట్ర ప్రజలే కాదు... దేశం... కాదు యావత్ ప్రపంచ ప్రజలు సైతం మన అభివధ్ధిని చూసి నోటి మీద వేలు వేసుకోవాలి. కాకపోతే ఈ ప్రతిపక్ష నాయకులే లేనిపోని మాటలతో ఎద్దేవా చేస్తూ అభివధ్ధికి అడుగడుగున అడ్డంకులు తెచ్చి పెడుతున్నారు. అయినా అనుకున్నవి పూర్తి చేసి చూపడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం. అర్థమైందా?'' అన్నాడు వెళుతున్న బస్సు కుదుపులకు మధ్య.
''మీరేదో రాష్ట్ర అభివధ్ధని ప్రపంచ స్థాయి బిల్డింగులు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక కేంద్రాలు, కంప్యూటరు కంపెనీలంటూ ఏవేవో చెపుతున్నారు. నాకైతే ఏమీ అర్థం కాలేదు సారూ!'' తలగోక్కొంటూ అన్నాడు ముసలాడు. కోపమొచ్చింది రాజకీయ నాయకుడికి.
''అర్థం కాలేదా!'' రాజకీయ నాయకుడు కోపంగా అంటుండగా బస్సు ఠక్కున ఆగిపోయింది.
కండక్టరు లేచి ''బస్సు గుంతలో ఇరుక్కొని ఆగిపోయింది. అందరూ దిగి నెట్టండి'' అంటూ తను దిగాడు. అతని వెంట అందరూ దిగి బస్సును ఒక్క వుదుటున గుంతలో నుంచి లేపినట్టుగా తోస్తూ బయటికి తీశారు. రాజకీయ నాయకుడు మాత్రం బస్సు లోపలే వుండిపోయాడు.
ముసలాడు బస్సు లోనికొచ్చి ''మీరు రాలేదేంటి సారూ?'' అడిగాడు రాజకీయ నాయకుడిని.
''ఆలోచిస్తూ కూర్చొన్నాను. త్వరగా ఈ రోడ్డును వేయించేందుకు ప్రయత్నిస్తాను. సరే! నేను చెప్పినవి ఏవీ నీకు నిజంగానే అర్థం కాలేదా! ఇదిగో... నేను చెప్పివన్నీ లిస్టు రాసి ఇస్తాను. నువ్వెళ్ళి ఆ లిస్టు ప్రకారం అన్నిటిని చూసి తెలుసుకో పెద్దాయనా! అభివధ్ధి ఎంటో, ఎందాక చేశామోనన్నది నీకూ తెలుసుద్ది'' అన్నాడు రాజకీయ నాయకుడు.
''అఖ్ఖరలేదు సారూ! నేను రైతును. మీరు చెపుతున్న వాటిని తెలుసుకోవడం వల్ల నాకేం లాభం లేదు. రైతన్నలకంటూ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే చెప్పండి. తెలుసుకొని ఆనందిస్తాను. అవును సారూ! రైతును అన్నదాతంటారు. ఆ రైతన్నవాడు కష్టపడి చెమటోడ్చి పొలం దున్ని పంటలు పండించి ఇంటికి తెస్తే అది అందరికి అన్నమౌతోంది. మరి అలాంటి రైతన్నకు ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఏదేని రైతులకు ఉపయోగపడే పథకాన్ని తీసుకొచ్చిందా? రైతులకు ఋణ మాఫీ చేస్తానని క్రితంలో హామీ యిచ్చింది. పది రూపాయలైనా మాఫీ చేయగలిగిందా? నేను మీతో అంటున్న ఈ మాటల్నే ప్రతి రైతూ అంటున్నాడు. పాలకపక్ష పెద్దల్ని అడుగుతున్నాడు కూడా! అందుకు ప్రభుత్వపు తరపు నుంచి ఏదైనా స్పందన వుందా చెప్పండి? చూడు సారూ! నాకు తెలిసిన మటుకు పల్లెటూళ్ళు పాడి పంటలతో బాగుంటేనే పట్టణాలు చల్లగా వుంటాయి. ఈ పిచ్చి పిచ్చి బిల్టింగులు కట్టి గొప్ప నగరంగా తీర్చి దిద్ది రాష్ట్రాన్ని అభివధ్ధి చేస్తున్నామంటే అది భూమిని ప్రభుత్వానికి ధారాదత్తం చేసిన మాలాంటి రైతులను అదఃపాతాళానికి తొక్కడమే అవుతుంది. ప్రభుత్వం చేస్తోందని మీరు చెపుతున్న ఆ పనుల ద్వారా మాకు ఎలాంటి లాభం చేకూరదు. మీరంటున్న అభివధ్ధి మా ఆకలి తీర్చదు. నిజం చెప్పాలంటే పట్టెడు మెతుకులకు ఈ భూమిని, వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే మాలాంటి రైతులు మీరు చెపుతున్న అభివధ్ధిని అస్సలు కోరుకోవట్లేదు. సారూ! ఏనాడు రైతన్న పంటను పండించి తనకు తిండికి కావలసిన గింజల్ని ఇంట్లో వుంచుకొని తతిమ్మా పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకొని వచ్చే పైసలను కళ్ళారా చూసుకొని భార్యపిల్లలతో సంతోషంగా వుంటాడో ఆ రోజే రైతన్నకు అభివధ్ధి. పోనీ ఈ వూరిని, జనాన్ని, ఈ మట్టి రోడ్డును చూశారుగా! మూడేళ్ళ నుంచి కంకర రోడ్డును వేయించమని ప్రభుత్వం తో పోరాడుతున్నాం. అది ఇంతవరకూ జరగలేదు. మీరైనా మీ పెద్ద నాయకు లకు చెప్పి మీ సిఫార్సుతో ఈ రోడ్డును వేయించండి. అదే మీరు మాకు చేసే అభివధ్ధి అనుకుంటాం. అంతేకాని రైత న్నకు అర్థంకాని, ఉపయోగం లేని పథకాలను చెప్పుకొంటూ మాటలతో మభ్యపెడుతూ ముందుకు సాగే యత్నం మాత్రం చేయకండి'' అని సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని వళ్ళించాడు ముసలాడు.
అది విన్న రాజకీయ నాయకుడికి ముచ్చెమటలు పోసినై. నోటి నుంచి మాట పెగిలి రాలేదు. అంతలో బస్సు రామచంద్రాపురంలో ఆగింది. అందరూ దిగి వెళ్ళి పోయారు ముసలాడితో పాటు.
రాజకీయ నాయకుడు మాత్రం అట్టాగే సీటుకు అతుక్కుపోయి ముసలాడి మాటలను నెమరు వేసుకొంటూ ''నిరక్షరాస్యులైన రైతుల్లో కూడా ఇప్పుడు చైతన్యంతో కూడికొన్న మార్పు వచ్చినట్టుందే! ఆయనంది నిజమే. మొదటిగా పెద్దలతో మాట్లాడి కనీసం ఈ రోడ్డును కంకర రోడ్డుగా మార్చటానికి ప్రయత్నిస్తాను'' అని అనుకొంటూ టిక్కెట్టు కొనుక్కొని ఆ బస్సులోనే టౌనుకు తిరుగు ప్రయాణమైయ్యాడు.
- బొందల నాగేశ్వరరావు,
9500020101