Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినత 9వ తరగతి చదువుతున్నది. తరగతిలో అందరికంటే చాలా పొట్టిగా, బక్కగా ఉంటుంది. కానీ చాలా మంచి స్వభావం కలది. చదువులో అంతంత మాత్రమే. ఆమె మంచి స్వభావాన్ని అర్థం చేసుకున్న కొందరు ఆమెకు ప్రాణ స్నేహితులైనారు. కొందరు ఆమె పొట్టి, బక్క రూపాన్ని ఎత్తి చూపుతూ, రకరకాలుగా వర్ణిస్తూ హేళన చేసేవారు. రాను రాను ఆ హేళనలు ఎక్కువైనాయి. సహనంతో అవన్నీ భరిస్తూ, ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయేది. ఇది తెలుగు ఉపాధ్యాయులు గమనించారు.
ఒకరోజు ఒక నీతి పద్యాన్ని వివరిస్తూ, అందులోని మర్రి విత్తనం గురించి ఇలా చెప్పారు. ''మర్రి విత్తనం మనం చూస్తున్న ఆవ గింజంత చిన్నగా ఉంటుంది. కానీ అందులో ఎంత శక్తి దాగి ఉందో తెలుసా? ఆ చిన్న విత్తనం నుంచి అతి పెద్ద మర్రిచెట్టు వచ్చి, కొన్ని వేల పక్షులకు ఆశ్రయమిస్తాయి. ఎంతో మందికి నీడను ఇస్తుంది. మరి మన మెదడు మర్రి విత్తనం కంటే చాలా పెద్ద కదా! ప్రతి ఒక్కరిలోనూ ఎన్నో శక్తియుక్తులు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించి, వాటికి పదును పెట్టినపుడు మనం ఊహించలేనంత గొప్ప మేధావులం అవుతాం. దానికి కావలసింది నిరంతర కషి, పట్టుదల'' అని.
ఇది శ్రద్ధగా విన్న వినతలో పట్టుదల పెరిగింది. మూర్ఖులను ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఏకాగ్రతతో పాఠాలు వింటూ ఇష్టపడి చదవడం ప్రారంభించింది. చాలా తెలివైన అమ్మాయి అయింది. ఆటలపై మరింత శ్రద్ధ పెంచి, చాలా ఆటలలో నంబర్ వన్ అయింది. వినతను హేళన చేసినవారు అందరూ ఓటమితో తల దించుకున్నారు. ఆమెకు స్నేహితులు అయ్యారు. ఆమె దగ్గరే చేరి, చదువులో తమకు అర్థం కానివి చెప్పించుకుంటున్నారు. ఆటలలో వినతకు అభిమానులు అయినారు.
- సరికొండ శ్రీనివాసరాజు,
8185890400