Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక రహదారి పక్కన ఓ పెద్ద చెట్టు ఉంది. అది పెద్దపెద్ద కొమ్మలతో భారీగా పెరిగి వచ్చేపోయే బాటసారులకు నీడనిచ్చేది. అక్కడ సేద తీరేవారు సైతం ఆ చెట్టు గురించి గొప్పగా చెప్పుకునేవారు. అది బాటసారుల పొగడ్తలతో తనను తాను గొప్పగా ఊహించుకునేది. అయితే తన పరిసరాల్లో ఎదుగుతున్న చిన్నచిన్న మొక్కలను ఎదగనిచ్చేది కాదు. కారణం అవి పెద్దవైతే... బాటసారులకు నీడనిస్తే తన గురించి గొప్పగా చెప్పుకోరనే భయం. దాంతో భూమి లోపలి నుంచి ఆహారంగా వచ్చే నీటిని చిన్ని మొక్కలకు అందకుండా తన వేళ్ళ సహాయంతో అడ్డుకునేది. దీంతో పాపం చిన్న మొక్కలు ఎదుగూ బొదుగూ లేకుండా నీటి కోసం అల్లాడుతుండేవి. ఎన్నో మార్లు మొక్కలన్నీ ఏకమై మనమంతా ఒకే జాతివారం.. మాక్కూడా నీరు పీల్చుకునే అదష్టం కలిగించమని వేడుకున్నా కనికరం చూపలేదు ఆ పెద్ద చెట్టు. ఒకరోజు కొందరు వ్యక్తులు ట్రాక్టర్ మీద వచ్చారు. వారి చేతుల్లో పెద్దపెద్ద రంపాలు, గొడ్డళ్లు ఉన్నాయి. వారంతా చెట్టు కింద కూర్చుని సాయంత్రాని కల్లా చెట్టును నరికి ముక్కలు చేసి ట్రాక్టర్‌లో వేసుకుని పట్నంలోని కర్రలమిల్లులో విక్రయించాలని నిర్ణయించారు. ఈ మాట విన్న భారీ వక్షానికి ఏడుపు ఆగలేదు. ఎవరితో బాధ పంచుకోవాలో అర్థం కాలేదు. వచ్చిన వారంతా చెట్టును రంపాలతో కోసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇంతలో చెట్టు పరిసరాల్లో భారంగా బతుకులీడుస్తున్న మొక్కలన్నీ కలసికట్టుగా వారినుద్దేశించి ఈ పెద్ద చెట్టు తన కోసం బతకటం లేదు. మిమ్మల్ని బతికించేందుకు... మంచి గాలి అందించేందుకు... వర్షాలు బాగా పడేందుకు... పర్యావరణ పరిరక్షణకు బతుకుతుంది. ఈ చెట్టును చంపితే మీ ఆరోగ్యాలు, మీ పిల్లలు ఆరోగ్యాలు ఏమవుతాయో తెలుసా! చెట్లను నరికితే భవిష్యత్తులో వర్షాలు పడవు.. వర్షాలు పడకపోతే పంటలు పండవు. ఆహారం దొరక్కపోతే మనిషి ఎలా బతుకుతాడు? అని ప్రశ్నించాయి. ప్రభుత్వాలు కూడా 'వృక్షో రక్షతి రక్షితః' అంటున్నాయి. వాటి అర్థం మీకు తెలుసా..! వృక్షాలను రక్షిస్తే అవి మిమ్మల్ని రక్షిస్తాయి. మీరు చంపేది చెట్టును కాదు.. మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. చెట్లను కాపాడకపోతే త్వరలో మీ మానవజాతే అంతరిస్తుందని హెచ్చరించాయి. వచ్చిన వారంతా గొడ్డళ్లు, రంపాలు కింద పడేసి చెట్లు నరికితే ఇన్ని అనర్థాలు ఉంటాయని ఎవరూ చెప్పలేదు.. మా వేలితో మా కన్ను పొడుచుకుంటామా.. దేవుడిచ్చిన ఈ జన్మను నాశనం చేసుకుంటామా.. మా కళ్లు తెరిపించి జ్ఞానోదయం కలిగించారు. భవిష్యత్తులో ఏ చెట్టునూ నరకమని చెప్పి వచ్చిన దారినే వెళ్లిపోయారు. పెద్ద చెట్టు పిల్ల మొక్కలను ఉద్దేశించి నేను మీకు నీరు దక్కకుండా చేసి చంపాలనుకున్నాను. మీరు మాత్రం వారి బారి నుంచి రక్షించి నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఈరోజు నుంచి మనమంతా ఒక్కటే. చక్కగా కలిసుందాం... భూమి లోపల నీటిని సమానంగా తీసుకుందాం... మీరు కూడా మహా వక్షాలుగా ఎదగాలి.. సకల ప్రాణులను రక్షించాలని దీవించింది.
- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర,
9492309100