Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణుపురంలో అందరివి పూరి గుడిసెలే. అనసూయమ్మ గారి ఇల్లు ఒక్కటే రాతి కట్టడం. ఇంటి ముందు పెద్ద అరుగు కట్టింది. అందరూ అక్కడ చేరి ముచ్చట్లు, లోకాభి రామాయణం మాట్లాడుకునే వారు. కొందరు అక్కడే వివాహ కార్యక్రమాలు కూడా చేసేవారు. ఊరికే అందరూ అరుగు వాడుతుండటం చూసి అనసూయమ్మకు ఆశ పుట్టింది. అరుగు వాడుకుంటే ఇక పైకం ఇవ్వాలని షరతు విధించింది. విధి లేక కొందరు పైకం చెల్లించి అరుగు వాడుకునే వారు. ఇది ఆ ఊరి మల్లయ్యకు నచ్చలేదు. అరుగుకు పైకం వసూలు చేయడం అతన్ని బాధకు గురి చేసింది. క్రమంగా ఆ అరుగు మీద ఎవరు కూర్చునే వారు కాదు. అదష్టవశాత్తు ఆ యేడు మల్లయ్య పొలంలో బంగారం పండింది. ఉన్న గుడిసె తీసి రాతితో చక్కటి ఇల్లు నిర్మించుకుని ఇంటి ముందు పెద్ద అరుగు కట్టాడు. ''ఎవరైనా, ఏ కార్యక్రమమైన ఈ అరుగును ఉపయోగించుకోవచ్చు. ఎటు వంటి పైకం అవసరం లేదు.'' అని చెప్పాడు. నిన్న,మొన్న తన అరుగు వాడుకున్న వారందరూ మల్లయ్య అరుగునే వాడేవారు. ఆ దారిన పోయే వాళ్ళు ఎవరూ కూడా అనసూయమ్మ అరుగు మీద కూర్చునే వారు కాదు. ప్రతి రోజు ఉరి జనంతో కళగా వుండే ఆ అరుగు బోసి పోయింది. అందరూ మల్లయ్యను పొగుడుతూ ఉంటే అనసూయమ్మ తెగ బాధపడిపోయేది. అది తెలుసుకుని అనసూయమ్మ భర్త కూర్మయ్య ''మనం బతికినన్ని రోజులు మన వెంట వచ్చేది మంచే. ఉట్టి అరుగుకే నువ్వు పైకం వసూలు చేశావు. మనం రోజూ చూసే వ్యక్తులకు నువ్వు అలా చేయడం బాగా లేదు. ఇప్పుడు నువ్వు ఈ అరుగుకు పైకం తీసేసిన ఎవరు ఉపయోగించరు. చూశావా అరుగు వాడకం లేకపోతే ఎలా బోసిపోయిందో, ఇప్పటికైనా అందరితో కలిసి ఉండు, ఈ అరుగుకు పూర్వ కళ తీసుకురా'' అని హితవు చెప్పాడు. కూర్మయ్య మాటలతో అనసూయమ్మలో మార్పు వచ్చింది. ఆ రోజు నుంచి అరుగు ఎవరైనా వాడుకోవచ్చు, నన్ను క్షమించండి అని వేడుకుంది. ఆమెలో వచ్చిన మార్పుకు ఊరంతా సంతోషించింది.
- కనుమ ఎల్లారెడ్డి,
93915 23027