Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోడకి మేకులు కొడుతున్నట్లు అతని మెడ మీద పదునైన మేకుని పెట్టి గట్టిగా ఓ దెబ్బ. అతని ప్రాణాలు తోడుతున్న భావన. బాధను ఎంత భరించాలనుకున్నా ఆగని ఆర్తనాదం.
అప్పుడు అతనికి భార్యాపిల్లలు గుర్తు వచ్చారో, ఆశయం గుర్తు వచ్చిందో తెలియదు. మనుషుల అంతరంగాల్లోకి వెళ్లటం అంత సులభం కాదు. అంతటితో ఆగలేదు. మరొకటి... ఇంకొకటి.. తలకిందకు వాలి పోయింది. రక్తం సెలయేరులా కారుతోంది. భోరున ఏడవాలనుంది. పళ్లు బిగబట్టడంతో దవడ కండరాలు తెగిపోయాయి. మేకులు దిగొడుతోంది మలబారు పోలీసులు.
అప్పుడు దూరంగా వున్న ఓ లారీ వస్తోంది. అది ఏ ప్రాంతమో తెలియదు. రోడ్డు భయంకరంగా వుంది. కొనతేలిన రాళ్లు. అన్నీ గుంతలు, లారీ వచ్చి ఆగింది. అతన్ని ఈడ్చుకుని వెళ్లి బారు నెట్‌కి కట్టారు. లారీ కదిలింది. అతను చివరి క్షణాల్లో ఏమనుకుం టున్నాడో తెలియదు. ఒంటినిండా రక్తపు ప్రవాహాలు. అంతకు ముందు జైల్లో పెట్టిన హింసలు. బట్టలన్నీ చీలికలు పీలికలై, ప్రాణం ఎప్పుడు పోయిందో తెలియదు. చివరకి అతని మర్మాంగాలను సైతం...
అతని పేరు కుటుంబరావు.
హనుమంతరావు ఉలిక్కిపడి లేచాడు. చుట్టూ చీకటి. కొద్ది క్షణాల తర్వాత తెలిసింది. తను కడలూరు జైల్లో వున్నానని. వేగంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు అతనికి వినిపిస్తోంది. మెల్లగా గది గోడకి వీపుని ఆన్చాడు. కుటుంబరావుని చిత్ర హింసలు పెట్టి చంపిన వార్త ఆలస్యంగా తెలిసింది.
అప్పుడు మిగిలిన ఖైదీలు సమావేశం అయ్యారు. కొందరి కళ్లల్లో భయం. ఇంకొందరిలో ఆవేశం, బాధ, రకరకాల భావాలు.
''మనుషుల్లో ఎందుకింత క్రూరత్వం'' అన్నాడు హనుమంతరావు.
''మనుషుల్లో కాదు. పోలీసుల్లో, అధికారుల్లో, పాలకుల్లో'' అన్నాడు లక్ష్మణరావు.
హనుమంతరావుకి భగత్‌సింగ్ గుర్తు వచ్చాడు. బ్రిటీష్ ప్రభుత్వం అతని బందాన్ని ఉరి తీసింది. క్షణాల్లో ముగ్గురి తలలు వేలాడాయి.
అన్నీ మరణాలే. ఎంత తేడా!
ఆ ముగ్గురూ దేశానికి స్వతంత్రం కావాలన్నారు.
కుటుంబరావు ఆ ఫలాలు అందరికీ సమంగా పంచాలన్నాడు.
నల్లవాడైనా, తెల్లవాడైనా అది నేరం అనుకున్నారు. 'ఉరి' కంటే క్రూరమైన పద్ధతిని నల్లవాడు ఆచరించాడు. మనుషుల్లో భయం రేకెత్తించాలి. భయం మాత్రమే మనుషుల్ని తిరుగు బాటు చేయకుండా ఆపుతుంది. ఎంతకాలం అనే ప్రశ్న అప్పుడు వారికి రాదు.
ఇద్దరూ వున్నప్పుడు లక్ష్మణరావు అడిగాడు.
''నిన్ను ఉద్యమంలోకి రమ్మని అడిగాను. నీకు ఇప్పుడు బాధగా వుందా?'' హనుమంతరావు అతని కళ్లల్లోకి చూసాడు.
''కుటుంబరావుకి జరిగినట్లు మనలో ఎవరికైనా జరగవచ్చు. ఇప్పటికే కొంతమంది కామ్రేడ్స్ భయపడ్డారు. వారు పార్టీలో వుంటారని నేను అనుకోవటం లేదు. అలా వుండటం అందరికీ సాధ్యం కాదు''.
''నాకు బాధగా వుంది అంటే ఏం అంటావురా. క్షమించమంటావా?''
''అనను. ఇప్పుడు నేను ఓ మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. మన స్నేహం వేరు. పోరాటం వేరు. నన్ను నువ్వు గౌరవించావు. నాతో కలిసి నడుస్తున్నావు. అందుకు సంతోషం. ఇన్ని హింసలు భరించలేను అని అనుకుంటే నువ్వు ఈ ఉద్యమంలో కొనసాగనవసరం లేదు. సరెండర్ అయిపోయి నీ బతుకుని నువ్వు బతకవచ్చు''.
హనుమంతరావు మాట్లాడలేదు. అతనికి గతం గుర్తొచ్చింది.
హనుమంతరావు, లక్ష్మణలది ఒకే ఊరు. ఇద్దరూ సమ వయస్కులు. కలిసి చదువుకున్నారు. ఇద్దరూ అప్పట్లోనే డిగ్రీ చేశారు. మొదట నుండి లక్ష్మణది ఉద్యమబాట. విద్యార్థి ఉద్యమాల్లో పని చేశాడు. ఆ సమావేశాలకు హనుమంతరావుని కూడా తీసుకు వెళ్లేవాడు. అయితే హనుమంతరావుకి క్రీడలు అంతే ఇష్టం. అందులోనూ చెడుగుడు ఆటగాడు. ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేవాడు. వారికి మంచి టీమ్ వుండేది.
లక్ష్మణ ఆటలు పెద్దగా ఆడేవాడుకాదు. కానీ హనుమకి కొన్ని పుస్తకాలు యిచ్చి వాటిని చదవమనేవాడు. అతనికీ పుస్తకాలు ఇష్టం. మొదట్లో డిటెక్టివ్ పుస్తకాల్ని చదివినా, తర్వాత లక్ష్మణ యిచ్చే పుస్తకాలు చదివాక వాటి మీద ఇష్టం తగ్గింది. రకరకాల సిద్ధాంత పుస్తకాలు చదివేవాడు. హనుమ, లక్ష్మణలు ఇద్దరూ వాటి గురించి చర్చించుకునేవారు. గుంటూరు హాస్టల్లో వున్నప్పుడు ఇద్దరిదీ ఒకే గది. లక్ష్మణని కలవటానికి అనేక మంది రకరకాల చోట్ల నుండి వచ్చేవారు. అలాంటి వారందరినీ హనుమకి పరిచయం చేసేవాడు. వారి చర్చల్లో పాల్గొనేవాడు గాని మాట్లాడేవాడు కాదు.
డిగ్రీ తర్వాత లక్ష్మణ పూర్తిగా ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. అలాగే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తాను మంచి కళాకారిణి. మహిళల సమస్యల మీద పనిచేస్తోంది. అలా వారు పార్టీకి అంకితం అయ్యారు. వారి పెళ్లి సింపుల్‌గా జరిగింది.
అప్పుడే లక్ష్మణ అడిగాడు ''హనుమా ఇప్పుడేం చేయాలనుకుంటున్నావురా'' అని.
''ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు. దానికి ముందు ఏదన్నా ఉద్యోగం చూసుకోవాలి''
''ఆలోచిస్తాను లక్ష్మణా'' అన్నాడు.
ఆ తర్వాత సుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే పెళ్లి కూడా జరిగిపోయింది. ఎలాంటి వొడిదుడుకులు లేకుండా సంసారం గడుస్తోంది. ఓ అబ్బాయి పుట్టాడు. తన పెళ్లికి రావటం లక్ష్మణకి కుదరలేదు. ఓ కాన్ఫరెన్స్‌కి బెంగాల్ వెళ్లాడు లక్ష్మణ. అతనికి కూడా అప్పటికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.
ఓ రోజు రాత్రి హనుమ ఇంటికి వచ్చాడు లక్ష్మణ. అప్పుడే మొదటిసారి లక్ష్మిని చూడటం.
''నీ దగ్గరకు రావాల్సిన అవసరం వచ్చిందిరా, నువ్వు పార్టీలోకి రావాలి. ముందు సభ్యత్వం కోసం నువ్వు దరఖాస్తు చెయ్యి'' అన్నాడు.
''ఇదేమన్నా ఉద్యోగమా. అప్లికేషన్లు పెట్టటానికి '' అన్నాడు హనుమ.
''మా సభ్యత్వ సంఖ్య ఎంత పరిమితం అయినా ఎవరికి బడితే వారికి సభ్యత్వం ఇవ్వరు. వడపోతలుంటాయి. ముందు ఉద్యమాల్లో పనిచేయాలి''.
''మరి ఉద్యోగం'' అన్నాడు హనుమ.
''అది వదిలిపెట్టాలి. ఇప్పటికే నీ పట్ల పార్టీకి ఓ అవగాహన వుంది. అందుకని పార్టీలో నిన్ను చేర్చుకోవటానికి ఎక్కువ కాలం పట్టదు. అయితే ఓ విషయం చెప్పాలి. పార్టీలో హౌల్ టైమర్స్ వుంటారు. వారికి అలవెన్సులు ఇవ్వటం కష్టంగా వుంది. కమ్యూనిస్టు పార్టీలో చేరటం అంటేనే నిరాడంబరంగా బతకటం. ఆదర్శంగా వుండటం. అంటే నీ ఖర్చులు నువ్వు చూసుకోవాలి. పార్టీ నుండి ఆర్థికంగా ఎలాంటి సహకారం అందదు. అన్నట్లు నీకు తెలుసు. అనేక మంది ఆస్తులు అమ్ముకుని పని చేస్తున్నారు''.
''నన్ను ఆలోచించుకోని'' అన్నాడు హనుమ.
''నేను ఇంకెంత కాలం బతుకుతానో తెలియదు. నువ్వు నా పెద్ద కొడుకువి. రేపు నాకు తలకొరివి పెడతాను అంటావో, నేను కమ్యూనిస్టుని, ఇవన్నీ ఛాదస్తాలు అంటావో నాకు తెలియదు. నాకు ఇంకా ఇద్దరు అబ్బాయిలున్నారు. నేనున్నా, చచ్చినా తర్వాతేం జరుగుతుందో నేను చూడను. ఎవరో ఒకరు నన్ను పారేస్తారు'' అన్నాడు హనుమ నాన్న.
లక్ష్మికి తన నిర్ణయం గురించి చెప్పాడు.
''ఇవన్నీ నాకు తెలియవు. మీతోనే నేను. మీరు తెస్తే వండుతాను. లేదంటే మీతో పస్తులుంటాను'' అంది.
హనుమ లక్ష్మణతో చెప్పాడు. నేను ఉద్యమంలోకి వస్తున్నాను అని. అప్పుడు గాఢంగా కౌగలించుకున్నాడు. హనుమ తండ్రి వారం రోజుల్లోనే ఆస్తులు పంచాడు. హనుమకి రెండు ఎకరాల భూమి వచ్చింది. తనను గుంటూరులో పని చేయమన్నారు. అక్కడికి కాపురం మార్చాడు.
అప్పుడే తెలంగాణా పోరాటం మొదలయింది. అది తీవ్రతరం అయినప్పుడు ఆంధ్ర ప్రాంతాలకు, బొంబాయి, మద్రాసు లాంటి ప్రాంతాలకు షెల్టర్ కోసం వెళ్లేవారు. ముందు కమ్యూనిస్టు సానుభూతిపరులను, కమ్యూనిస్టు పార్టీ సభ్యులను గుర్తించేవారు. అలా హనుమ కూడా కొంతకాలం రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అప్పుడు అలాంటి వారి ఇళ్ల మీద పోలీసులు దాడి చేసి వారి ఆచూకీ చెప్పమని భీభత్సం సష్టించే వారు. ఉద్యమంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడే తెలిసింది-లక్ష్మి మళ్లీ గర్భవతి అని.
ఒకానొక సందర్భంలో హనుమని అరెస్ట్ చేశారు. తర్వాత ఎప్పుడో లక్ష్మణ కూడా కడలూరు జైలుకి వచ్చాడు, పదుల కొద్దిమందిని కాల్చి వేస్తున్నారు. నిర్బంధం బాగా పెరిగి పోయింది. కొంతమంది జారిపోయారని వార్తలు అందుతుం డేవి. కుటుంబరావు మరణం మాత్రం ఓ టెర్రర్‌ని సష్టించింది.
లక్ష్మణ హనుమ కేసి చూస్తున్నాడు.
''నేను ఉద్యమంలోకి రాకముందు నువ్వు చెప్పిన మాటలు గుర్తున్నాయి లక్ష్మణా. మా నాన్న పెద్దవాడి మీద ఆశలు వదులుకున్నాను. వాడితో తల కొరివి పెట్టించుకోవాల నుకున్నాను. చివరికి వాడ్ని ఎక్కడో కాల్చి పారేస్తారు. వాడి చివరిచూపు కూడా మనకి దక్కదు'' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో నేను అప్పులు చేశాను. ఓ ఎకరం అమ్మేయాలి. ఈ జైలు నుండి ఎప్పుడు బయట పడతామో లేదో తెలియదు. ఒక వేళ నన్ను కాల్చేస్తే మనలో ఎవరో ఒకరు ఆ పని చేయండి. నేను కమ్యూనిస్టుగానే బతకాలనుకుంటున్నాను. అలాగే చనిపోవాలనుకుంటున్నాను'' అన్నాడు.
మరోసారి లక్ష్మణ, హనుమను హత్తుకున్నాడు.
2010.
అది మెడికల్ కాలేజ్ హాస్టల్ రూమ్. అందులో సరిత, హిమజ వుంటారు.
''మనిషి మనిషిగా బతకటం చాలా కష్టం అంటారు కదూ'' అంది సరిత.
''ఇప్పుడు మనుషులు ఎక్కడ వున్నారు'? అంది హిమజ.
ఇద్దరూ నవ్వుకున్నారు. పైనల్ యియర్‌లో వున్నారు. హిమజ వామపక్ష భావజాలం వున్న కుటుంబం నుండి వచ్చింది.
''1950 ప్రాంతం నుండి కమ్యూనిస్టుగా వున్న వారి గురించి నేను విన్నాను. మా తాతగారు కూడా కమ్యూనిస్టు పార్టీ చీలిపోగానే తాను ఆ రాజకీయాల నుండి బయటకి వచ్చారు. అంతకు ముందు ఆయన త్యాగాలు చేశారు. అప్పట్లో నూటికి తొంభైమంది ఆ పార్టీలో చేరటానికి అనేక త్యాగాలకు ముందుకు వచ్చినవారే. నిర్బంధాలకు తట్టుకున్న వారే. క్రమంగా అనేకమంది పక్కకు వెళ్లిపోయారు. వారికి అర్థం అయింది- కమ్యూనిస్టుగా వుండటం అంత సులభం కాదని. నాకు అనిపిస్తుంది అలాంటి త్యాగధనులు ఇప్పుడు వున్నారా అని. అది పాత తరంతోనే ముగిసిపోయిన అధ్యాయం. మా తాత తర్వాత కాలంలో సానుభూతి పరుడిగా మారాడు. పిల్లల మీద దష్టి పెట్టాడు. పార్టీలకు ఆర్థికంగా సహకరించాడు. కొంత మంది అక్కడక్కడ ఇంక బతికి వుండొచ్చు. నాకయితే అలాంటి వారిని ఒక్కర్నైనా చూడాలని వుంది'' అంది.
''మా ప్రాంతానికి చెందిన ఓ కమ్యూనిస్టు గురించి నేను విన్నాను. వారి ఆరోగ్యం అంత బాగుండదు. ఇప్పుడింకా బతికి వున్నారా అనేది తెలియదు'' అంది సరిత.
''అది నువ్వు తెలుసుకోగలవా... వీలయితే మనం వారిని కలుసుకుందాం. మనతో మాట్లాడే ఓపిక వారికి వుందేమో తెలుసుకో. కనీసం వారిని చూసి వద్దాం. మా తాతగారు చనిపోయారు. బహుశా వారు తాతకి తెలిసి వుంటారు. నా అంచనా ప్రకారం వారికి ఎనభై సంవత్సరాలు దాటి వుంటాయి''.
''నేను ఆ ప్రయత్నం చేస్తాను హిమా'' అంది సరిత.
ఆ నగరంలో అనేక సమావేశాలు జరుగుతుంటాయి. అందులో కుల సంఘాల వారుంటారు. మహిళలుంటారు. మతపరమైన వారుంటారు. సాహిత్య సభలుంటాయి. వీలు దొరికినప్పుడల్లా సరిత, హిమ హాజరవుతుంటారు. ఇద్దరూ మంచి పాఠకులు. అనేక రకాల పుస్తకాలు చదువుతుంటారు. రకరకాల పవనాలు వారిని తాకుతుంటాయి.
సరితది హిమతో పోలిస్తే మధ్య తరగతి కుటుంబం. వాళ్ల నాన్న తన కూతురుని డాక్టర్ చేయాలనుకున్నాడు. ఒకే అమ్మాయి. అందుకు అప్పులు చేస్తున్నాడు. అనేక కష్టాలు పడుతున్నాడు.
ఆ రోజు సభలోని ఉపన్యాసాలు వింటున్నారు. అగ్రకులాల వారిని కొంతమంది దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే కమ్యూనిస్టుల్ని కూడా. అదొక చెత్త సిద్ధాంతం. రష్యాలో ఫెయిలయింది. చైనాలో క్యాపిటలిజం వుంది. అసలు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా కమ్యూనిజం కాదు సోషలిజం కూడా లేదు. ఈ దేశంలో అయితే కమ్యూనిస్టులు దళితుల గురించి పట్టించుకోలేదు. అందుకే పతనమయ్యారు. ఇప్పుడు దళితులందరూ ఏకం కావాలి. మన రాజ్యం మనం సంపాదిం చుకోవాలి. ఇదీ సారాంశం.
సరితా, హిమ ఒకరి ముఖం ఇంకొకరు చూసుకున్నారు.
''సరితా నీ కులం ఏమిటి?''అంది హిమజ.
''నేను కులం లేని దాన్ని. అయినా ఇన్ని సంవత్సరాలు కలిసి వున్నాం. మొదటి సారి ఇలాంటి ప్రశ్న అడుగుతున్నావు''.
''ఒకప్పుడు కులం గురించి అడగటం అంటే అనాగరికం. ఫ్యూడల్ ఆలోచన. ఇప్పుడు అడగకపోవటం కూడా అంతే. నిన్ను నువ్వు తెలుసుకో. నీ వర్గం ఏమిటో తెలుసుకో అన్నది నిన్నటి మాట. నీ కులం ఏమిటో తెలుసుకో. నీ మతం ఏమిటో తెలుసుకో అన్నది నేటి నినాదం కదా'' అంది
''మనుషులు అన్నాక ఏదొక జంటకు పుడతారు. వారిది ఒకే కులం కావాలని లేదుగా. మా అమ్మానాన్నలది చెరోకులం. నాదే కులం? నాకు తెలియదు. ఇది ఈ రోజున కాదు. అప్పట్లోనే జరిగిన పరిణామం. అసలు సిసలు మైనార్టీలు ఇలాంటి వారే అనుకుంటాను''.
''అవునవును. కాకపోతే చిన్న మతాలవారు భిన్న కులాల వారు పెళ్లిళ్లు చేసుకున్నా తమ రూట్స్ మరిచిపోవటం లేదు. అది విశేషం కదా'' నవ్వుతూ అంది హిమజ.
''అసలు పెళ్లిళ్లు కాని వారు, పెళ్లిళ్లు వద్దనుకున్న వారివి కూడా సమస్యలే. నాకు ఇంకోటి అనిపిస్తోంది. ఏ సిద్ధాంతమైనా కొన్ని సమూహాలను తప్తి పరచగలదు. అందులోని చివరి వ్యక్తి వరకు న్యాయం చేయగలదా. అలాంటిది కనీసం ఆ సిద్ధాంతంలో వుందా? ఏ సంఘం అయినా చూడు- అక్కడ నాయకత్వం వుంటుంది. నియంతత్వం వుంటుంది. వారు వ్యతిరేకించే లక్షణాలన్నీ ఆ పునాదుల్లో వుంటాయి. అక్కడ కొంతమంది వ్యక్తులు, లేదా కొన్ని సమూహాలు మాత్రం లాభపడతాయి. ఇది కదా ప్రపంచపు అనుభవం. కమ్యూని స్టులు ఫెయిల్ అయ్యారు. నిజమే. ప్రత్యామ్నయంగా విజయవంతం అయిన వ్యవస్థ ఎక్కడున్నా వుందా? అది ఆదర్శంగా కనిపిస్తోందా?''
''అవును. ఎవరో ఒకరి కొమ్ముకాసే, ఎవరో ఒకరి నుండి ఆర్థిక సహాయాలు, అందులోనూ తాము వ్యతిరేకించే కులాలు, దోపిడిదారుల నుండి పొందే స్థితి వున్నంత కాలం ఇలాగే వుంటుంది. విభిన్న వర్గాల, వర్ణాల సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. ఇక్కడ శాశ్వతంగా నమ్మకాల పునాదుల మీద నిలబడే వారుండరు. కష్ణ పరమాత్ముడి మహారాజకీయం పసందుగా వుంటుంది. అలాంటి సిద్ధాంతకర్త గారి యదు వంశంలోనే ముసలం పుట్టింది''.
''నిజమే. నిన్న, నేడు, రేపు సంఘర్షణ లొంగుబాటు ఇదే వాస్తవమా? ఈ ప్రపంచం మారదా. ఉమ్మడిగా మానవజాతి ఐక్యంగా వుండదా?'' అంది సరిత.
''కనుచూపులో అలాంటిది కనిపించదు. అయినా మనం నిరుత్సాహ పడనవసరం లేదంటారు. ప్రపంచానికి ముందు ముందు అలాంటి సిద్దాంతం రాదని ఎలా అంటాం?''
''వస్తుందని మాత్రం ఎలా అంటాం?''
ఇద్దరూ నవ్వుకున్నారు.
''ఇప్పటి అవసరం జెండర్-కులం-మతం-ప్రాంతం-దేశం. ఇంకా సవాలక్ష వైరుధ్యాలు. ఈ వలయంలో చరిత్రను సంఘర్షించకుండా నిరోధించేది ప్రస్తుతం లేదు'' అంది హిమజ. సరిత నిజమే అన్నట్లు తలూపింది.
ఎటు చూసినా పచ్చటి పైరు చేలు. మధ్యలో పంటకాలవల పరుగులు. అక్కడక్కడ కనిపిస్తున్న విశాలమైన వక్షాలు. మధ్యలో ఓ సమాధి కనిపించింది. దానికి ఎరుపు రంగు వుంది.
''ఈ ఊర్లో ఒకప్పుడు కమ్యూనిస్టులు వుండేవారు అనుకుంటాను'' అంది హిమజ. సరిత చిన్నగా తలూపింది. బస్సు దిగాక ''హనుమంతరావు గారి ఇల్లు కావాలి'' అంది సరిత.
''రండమ్మా. దగ్గరే. నేను తీసుకువెళ్తాను'' అన్నాడాయన. దారిలో అడిగాడు.
''మీరు ఆయన బంధువులా''?
''కాదండి. ఆయన గురించి విన్నాం. చూసి వెళ్దాం అని వచ్చాం''.
''అలాగా. గొప్ప మనిషిలేమ్మా''.
''దారిలో ఓ సమాధి కనిపించింది. అది ఎవరిది''?
''లక్ష్మణరావు గారిది. ఆయన పేరు తెలిసుంటుంది-గొప్ప నాయకుడు. హనుమంతరావు గారిది, వారిది గొప్ప స్నేహం. ఈ ఊరే ఇద్దరిదీ. ఆయన చనిపోయారు. చివరి రోజుల్లో ఈయన ఇక్కడే వుందామని వచ్చారు. ఇప్పటి కుర్రాళ్లకి ఇద్దరి గురించి తెలియదమ్మా. ఏదో పాతతరం మనుషులం మాకు అప్పటి సంగతులు గుర్తున్నాయి'' అన్నాడు.
ఇంటి దగ్గర దించి ఆయన్ని పలకరించి వెళ్లాడు. అత్యంత నిరాడంబరంగా వుంది ఇల్లు. ఎప్పటిదో పాత డాబా ఇల్లు. అక్కడ ఓ కుర్చీలో కూర్చునున్నారు. వయోభారం కనిపిస్తోంది. గోడమీద ఇద్దరి ఫోటో వుంది. రెండో వ్యక్తి లక్ష్మణరావుగారు అయి వుంటుందనుకున్నారు సరిత, హిమజ. తమని తాము పరిచయం చేసుకున్నారు. హిమ తన తాతగారి పేరు చెప్పి మీకు గుర్తున్నారా అని అడిగింది.
హనుమ కాసేపు ఆలోచించి ''లీలగా గుర్తువస్తున్నారు. ఇప్పుడు చాలా విషయాలు మరిచిపోతున్నాను'' అన్నారు. ఇంతలో ఒకావిడ మంచి నీళ్లు తీసుకు వచ్చింది.
''మా అమ్మాయి. నీళ్లు తాగండి'' అన్నాడాయన. ఇద్దరూ ఎం.బీ.బీ.ఎస్. చదువుతున్నారని తెలుసుకున్నాడు. ఇక్కడ వైద్యం దొరుకుతుందా అంటే కొత్తగా ఓ డాక్టర్ వచ్చాడు. పది కిలోమీటర్లు వెళ్తే టౌను వస్తుంది. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఇంకొన్ని వున్నాయి అని చెప్పాడు. వారిద్దరూ ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. మెల్లగా, మధ్యలో ఆలోచించి సమాధానాలు చెప్పాడు హనుమంతరావు.
వాటి సారాంశం ఇద్దరి మనసులో ముద్రించుకుపోయింది.
''నేను కమ్యూనిస్టు పార్టీలోకి రావటానికి కారణం మా లక్ష్మణ. అనేక మంది అనేక కారణాలతో వస్తుంటారు. నన్ను స్నేహం ఆ మార్గానికి తీసుకు వచ్చింది. అప్పట్లో భూస్వాముల పిల్లలు, పేదవారి కష్టాలను చూసి చలించిపోయిన వారు, చదువుకున్న వారు ఉద్యమాల్లోకి వచ్చారు. క్రమంగా పేద వాళ్లను ఉద్యమాల్లోకి తీసుకువచ్చారు. అప్పుడు కులం గురించి పట్టించుకోలేదు అనటం కంటే ఎవరు ఎక్కువ అన్యాయానికి గురవుతున్నారనేది ముఖ్యంగా వుండేది. ఇప్పుడు మాత్రం కుల సంఘాల్లో ఎంతమంది నాయకులున్నారు. వారి సంఖ్యతో పోల్చుకుంటే బాధలు పడేవారంతా నాయకత్వాల్లోకి రారు. కమ్యూనిస్టులకి ఓట్లు వేయనట్లే కులాల వారికి ఓట్లేయరు''.
''హింసకి కులం, మతం వుండవు. కుటుంబరావు కులం ఏంటి? అతను బ్రాహ్మణుడు. అప్పట్లో అగ్రకులాలవారు చాలా మంది చనిపోయారు. అలాగే ప్రమాదకరం అనుకున్న వారిని చంపుతారు. కాలాన్ని బట్టి ఎక్కువ, తక్కువలు వుంటాయి''.
''మొదటిసారి పార్టీ చీలుతున్నప్పుడు విలవిలలాడి పోయాను. రెండోసారి, మూడోసారి, అది అనంతంగా సాగుతూనే వుంది. మనం ప్రజలందరినీ ఏకం చేయటానికి బయలుదేరాం. ఇన్ని ముక్కలు కావటానికి కాదు. ఇది పాలక వర్గంలోనూ వుంది. అయితే వారిలో చీలిక దశాబ్దాల తర్వాత జరుగుతుంది. రాజకీయాలు డబ్బుల మయం అయిపోయాయి. అప్పుడు త్యాగాలు సహజం. ఇప్పుడు ఏ త్యాగాలు చేయనివారు వేదికల మీద వుంటారు''.
''బతికినంత కాలం నేను కమ్యూనిస్టుగా వుండగలనా అనుకునే వాడిని. మనిషి మనిషిగా బతకటం ఎంత కష్టమో, నిజమైన కమ్యూనిస్టుగా బతకటం అంత కష్టం కూడా''.
''సాయుధ పోరాటం అనుకున్నాం. ఎన్నికల ద్వారా సాధించవచ్చు అనుకున్నాం. అవన్నీ విఫలం అయ్యాయి. సంస్కరణ పనులు చేశాం. ప్రజలను ఆ సమయాల్లో ఆదుకోగలిగామన్న తప్తి వుంది''.
''నాకు వచ్చిన రెండెకరాలు పార్టీ కోసం అమ్మాను. తర్వాత పార్టీ ఇచ్చిన కొద్ది పాటి ఎలవెన్సులతో బతికాం. నా భార్య వెళ్లి పోయింది. మా మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలుండవచ్చు. కానీ తనో గొప్ప స్త్రీ. అత్యంత సామాన్యురాలు''.
''ఇప్పుడు అందరిలా కమ్యూనిస్టుగా వున్న అనేకులు బలహీనతలకి అతీతంకాదు. భ్రమలు పెరిగాయి. కాల్పుల్లో చనిపోయిన వారు మాత్రమే విప్లవ వీరులు కాదు. చివరి దాకా కమ్యూనిస్టుగా బతికిన వారు ధన్యులు''.
చివరిగా అడిగారు ''మార్క్సిజాన్ని మించిన సిద్ధాంతం మరొకటి వుందా''?
''లేదు. రేపటి సంగతి తెలియదు. అందులో నూటికి తొంభై మందికి వచ్చే నష్టంలేదు. పది మందికి అన్నీ వదులు కోవాలంటే కష్టంగానే వుంటుంది'' అన్నాడాయన.
''మీరు కమ్యూనిస్టుగా వుండగలిగారా''? - హనుమంతరావు ఆలోచించాడు కొంత సమయం.
''అది నిర్ణయించాల్సింది నేను కాదు. నాలో లోపాలుండవచ్చు. బల హీనతలుండొచ్చు. నన్ను ఇతరులు, నన్ను నేను అసహ్యించుకునే పనులు నేను చేయలేదు. ఆ తప్తి నాకుంది''.
''మాలాంటి వారికి ఏమైనా చెబుతారా''?
''చెప్పను. మీ ఇద్దర్నీ చూస్తుంటే నాకు మా లక్ష్మణ గుర్తొస్తున్నాడు. ఇలానే వుండండి. మార్గం మీకు తెలుస్తుంది. ఇన్ని రకాల మార్పులు వస్తాయని మాకు తెలియదు. ఊహించలేదు. చివరిగా ఒకటి చెబుతాను. మనలాంటి వాళ్ళం రకరకాల వైరుధ్యాల గురించి మాట్లాడతాం. నాకు అర్థమైందొకటే...''.
ఇద్దరూ ఆయన్ని చూస్తున్నారు.
''మనిషి లేదా స్త్రీ లేదా ఇంకొకరు, వారిలోనే వైరుధ్యం వుంది. ఇది సామాజికం కాదు. వ్యక్తిగతం. వారు కులం, మతం, పెట్టుబడి దారుడు, కార్మికుడు, రైతు, కూలి, స్త్రీ ఇలా ఏ విభాగానికి చెందినా, మిలియనీరు అయినా నిరుపేదయినా వారిలో వారు నిత్యం యుద్ధం చేస్తుంటారు. అది పూర్తి కానంత కాలం ఎవరికీ శాంతి వుండదు. ఎవరూ ముక్తి సాధించలేరు''.
తిరుగు ప్రయాణంలో 'లక్ష్మణ' సమాధిని దర్శించుకున్నారు.
''హనుమంతరావు గారి ఆలోచనలు మనకి దగ్గరగా వున్నాయి కదా సరితా''.
''అవును''.
''ఇప్పుడు మన మార్గం''?
''మనలోని వైరుధ్యాలు తగ్గించుకుంటూ మనిషిలా బతికే ప్రయత్నం చేయటం'' అంది సరిత.
ఆప్యాయంగా హిమజ సరిత చేతిని అందుకుంది.
- పి.చంద్రశేఖర ఆజాద్
9246573575