Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామంలో ప్రతి ఒక్కరు ఆ కుర్రాడిని ''చిన్న పంతులు'' అని పిలుస్తారు. అది వింటే చాలు ఆ కుర్రాడికి ఇబ్బందిగా ఉంటుంది. అసలు దాని అర్థం ఏమిటనేది తెలుసుకునేంత వయసు కాదు తనది. కారణం ఏదైనాగాని, అలా పిలుపించు కోవడం అతనికి ఇష్టం ఉండదు. పిలిచిన వాడు చిన్నవాడయితే, లాగి చెంపమీద కొట్టాలనిపిస్తుంది. అదే కాస్త పెద్ద కుర్రాడైతే ఆ వ్యక్తి వెళ్ళిపోయేంత వరకు వేచి చూసేవాడు. తాను నివసించే ఆశ్రమంలో ప్రతి ఒక్కరికీ, ఆఖరికి అక్కడ ఉండే ఆవులకి, లేగదూడలకి ఇంకా గ్రామంలో ఉండే చెట్లు చేమలకి, చెరువులు, ఆటగోలు పిల్లలకి... అందరకీ తన ఈ పేరు సుపరిచితమైపోయింది.
నిజానికి అతని పేరు టుటులూ ..! ఆ పేరుతో వాళ్ళమ్మ ఎంతో ముద్దుగా పిలుస్తుంది. అయితే ఆకాశంలో ఇంద్రధనువులా అది కరిగిపోయింది. పూచి వాడిపోయిన దేవకాంచన పుష్ప సముదాయంలా, నీటిలోని బుడగలా ఆ పేరు మాయమైపోయింది.
''చిన్న పంతులు'' వయసు పదకొండు సంవత్సరాలు. వాళ్ళమ్మానాన్నలకు చాలా కాలం పిల్లలు లేకపోడంతో పూరి జగన్నాధునికి చేసిన పూజల వల్ల తను జన్మించాడు. అంతకు ముందు తమ గ్రామ దేవతకి, చంద్రశేఖరునికి, మంగళా దేవికి, అరిదిలోని అఖండలా మణి ప్రభువుకి ఎన్నో పూజలు చేశారు. ఏమీ లాభం లేకపోయింది. చివరికి రైలు ఎక్కి పూరీ క్షేత్రం వెళ్ళారు. ఒక కొడుకు పుట్టినట్లయితే జగన్నాధ ప్రభువు సేవ నిమిత్తం అతడిని సమర్పించుకుంటామని మొక్కుకున్నారు.
ఆ తర్వాత యేటికి పూజలు ఫలించి ఇదిగో ఈ టుటులూ జన్మించాడు. తల్లిదండ్రులు ఎంతో ముద్దు చేసేవారు. ఆ తల్లి ఎంతో గర్వంగా తన కొడుకుని చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకుని వెళ్ళేది. గతంలో శుభకార్యాలకి వాటికి వెళ్ళినప్పుడు తనని గొడ్రాలు అని చెప్పి చిన్నచూపు చూసేవాళ్ళు. కొడుకు చేతికి రక్షా యంత్రం కట్టి, బుగ్గకి దిష్టి చుక్క పెట్టేది.
టుటులూ బాల్యం ఆడుతూ, పాడుతూ గడిచింది. లేగల చెవుల్ని పట్టుకుని నడిపించేవాడు. తూనీగలు పట్టడం, కోడిపుంజు ఈకలు లాగడం ఇలా ఎన్నో చేసేవాడు.
స్కూలుకి వెళ్ళేదారిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. దాని మీద ఆడుకునే ఉడతల్ని చూస్తుండేవాడు. వాటికి ఉన్న చిన్న చిన్న గోళ్ళతో పళ్ళను తింటూ ఉంటే అతనికి ఎంతో సంతోషం గా ఉండేది. స్కూలుకి వెళ్ళడం కూడా మర్చిపోయేవాడు. అంత లోనే స్కూల్ బెల్ మోగేది లేదా వాళ్ళ మేష్టారో, నాన్నారో వచ్చి ఈ బుడతని స్కూల్‌కి గుంజుకెళ్ళిపోయేవారు. క్లాస్‌లో ఉన్నా సరే బయట కనిపించే మేకలని చూస్తూండేవాడు. వాటి వెనుకే ఉండేవి తెల్లటి కొంగలు. అవి కూడా తనకి బాగా ఇష్టం.
టుటులూ అంటే చలాకీ పిల్లాడు అని అందరూ అనేవారు. అలా ఎవరైనా అంటే వాళ్ళమ్మకి ఇంకా బాధగా ఉండేది. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే కొడుకుని ఒక గదిలో దాచేసేది. అన్నం తినేటప్పుడు మాత్రం ఎన్నో సుద్దులు కొడుక్కి చెప్పేది. తన బిడ్డని మంచి పిల్లాడిగా మార్చమని ఆ జగన్నాథునికి మొరపెట్టుకునేది. దేవుడు తనని ఎలా మార్చుతాడు అని ఆ చిన్న బుర్రకి తోచేది కాదు. అయితే తల్లి కన్నీరు, నాన్న కోపం, మేష్టారి బెత్తం వీటి భాష మాత్రం టుటులూకి బాగా తెలుసు.
టుటులూకి పదవయేడు రాగానే వాళ్ళ నాన్న ఓ ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ చేర్చాడు. తల్లి వేదననిగాని, పొరుగువారి మాటల్ని గాని ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ జగన్నాథ ప్రభువుకి తాము చేసిన బాస చెల్లించ వలసిందేనని తీర్మానించాడు.
ఆ రోజు ఉదయం టుటులూకి చక్కగా స్నానం చేయించింది తల్లి. తల దువ్వి, లక్షణంగా బుగ్గన చుక్క పెట్టింది. కొత్త దుస్తులు వేశారు. ఇంట్లో తినుబండారాలు అతనితో తీసుకెళ్ళడానికి సదిరారు.
ఆశ్రమానికి పయనమవుతున్న టుటులూకి శుభాకాంక్షలు తెలుపడానికి బంధువులంతా వచ్చారు. అందరూ ముద్దు చేశారు ఆ చిన్నారి బాలుడిని. అమ్మ తన కొడుకుని గుండెలకి హత్తుకుంది, చీర కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంది. అమ్మ వండిన ఒక్క అరిసె కూడా తినలేకపోయాడు టుటులూ ఆ సందడిలో..! సాధ్యమైనన్ని పప్పల్ని చొక్కా జేబులోనూ వాటిల్లోనూ కుక్కుకున్నాడు. ఖేరంగా అనే ఊరు దాకా తండ్రి తో కలిసి నడుస్తూనే ఉన్నాడు. కాళ్ళు నొప్పి పుట్టాయి ఆ దూరానికి. తండ్రి మీద కోపం వచ్చింది. ఊరికే తల్లి గుర్తుకు రాసాగింది.
ఈ పాతాపూర్‌లో ఉన్న ఆశ్రమానికి వెళ్ళడానికి ముందర టుటులూ ఎన్నో పనులు చేయాలనుకున్నాడు. వాళ్ళ బంధువుల అబ్బాయి తయారు చేసిన గేలంతో చేపలు పట్టాలని, స్నేహితుడికి ఉన్న ఓ గాలిపటం వంటిదే తాను తయారు చేయాలని ఇలా ఎన్నో అనుకున్నాడు. ఆశ్రమానికి నడుచుకుంటూ వెళ్ళిన శ్రమలో ఇవన్నీ మరిచిపోయాడు. బాగా అలసిపోవడం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది. మొద్దు నిద్ర. తెల్లారి లేచి చూసేసరికి పక్కన తండ్రి కనిపించలేదు. ఒక్కసారిగా చెప్పలేనంత బాధ కలిగింది. తండ్రికి సంబంధించిన సంచి, చెప్పులు, గొడుగు ఏవీ కనిపించలేదు.
అలాగే మంచం మీద పడుకుని ఏడ్చాడు. ఓదార్చడానికి ఇక్కడ అమ్మ గాని, నాన్న గానీ ఎవరూ లేరు. అది గుర్తొచ్చి ఏడుపు ఆపేసుకుని నిశ్శబ్దమైపోయాడు. ఇక ఆ రోజు నుంచి టుటులూ జీవితంలో నూతన అధ్యాయం మొదలయింది. క్షురకుడు వచ్చి బోడిగుండు చేసి, మధ్యలో పిలకని ఉంచాడు. ఈ తంతు అంతా కాస్త నొప్పిగానే తోచింది. గీకేటప్పుడు అక్కడక్కడ గాట్లు కూడా పడ్డాయి. వేళ్ళు నుంచి కారే రక్తం లాగే తల మీద కారే రక్తం కూడా ఎర్రగానే ఉంటుందని అర్ధమైంది.
ప్రతిరోజు స్నానాదికాలు కానిచ్చి తుండు ఒకటి చుట్టుకుని పూలు కోయడం, వాటిని దండ కట్టి ఆశ్రమంలో ఇవ్వడం అతని విధుల్లో ఒకటి. దండ కట్టే సమయంలో సూది గుచ్చుకుని రక్తం గాని వస్తే వెంటనే ఆ వేలుని నోట్లో పెట్టుకుంటాడు. బాధ ఉపశమించేది. తల్లి నుంచి నేర్చుకున్న విషయమది. దేవుడి పూజ కి దండలు అల్లిన తర్వాత, ఆశ్రమంలోని గోవుల్ని మేపడానికి బయటకి తీసుకువెళతాడు. తిరిగి వచ్చిన తర్వాత దగ్గరలోని పాఠశాలకి వెళతాడు. మళ్ళి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పూజ కోసం దండలు కడతాడు. గుడిలో అర్చకుడు పూజాదికాలు నిర్వహిస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి తాళం వేస్తుంటాడు.
స్కూల్‌లో పిల్లలంతా టుటులూ పిలక లాగుతూ ఏరు చిన్న పంతులు అని ఆట పట్టిస్తుంటారు. అతని నోట్ పుస్తకాలు కూడా దాచేస్తుంటారు. టుటులూ ఏడుస్తూ టీచర్‌కి చెప్పేవాడు, ఆయన పిల్లలకి భయం చెప్పినా అది తాత్కాలికమే. మళ్ళీ తెల్లారి మామూలే. రోజులు గడుస్తున్నాకొద్దీ చికాకుపుట్టి కంప్లయింట్ చేయడం మానుకున్నాడు. టుటులూ ఆవులు మేపుతున్నప్పుడు, దూరంగా కనిపించే కాలిబాటని చూసేవాడు. అది పాములా వొంపులు తిరిగి ఉండేది. అక్కడ నుంచి అమ్మా నాన్న ఎవరైనా వస్తున్నారా అని చూసేవాడు. కనుచూపు మేర లో ఎవరూ కనిపించేవారు కారు. కాసేపు వెక్కి వెక్కి ఏడ్చి ఆ తర్వాత తుండుతో మొహం తుడుచుకునేవాడు. ఆశ్రమంలో ఎవరైనా చూస్తే కోపగించుకుంటారని భయం.
కొన్నిసార్లు ఆశ్రమంలోని అర్చకుడు బాగానే ఉండేవాడు. ఫరవాలేదులే అనుకునేవాడు. కాని సొంత ఊరు గుర్తుకు వచ్చి ఏడ్చినపుడు మాత్రం అతను కోపగించుకునేవాడు. మళ్ళీ పరమాన్నం, కొబ్బరి ముక్కలు పెట్టేవాడు. అలా అయినా సొంత ఊరు జ్ఞాపకం వస్తూనే ఉండేది.
ఆశ్రమంలో పీఠాధిపతికి ఒక శిష్యుడు ఉండేవాడు. అతనిపేరు అలువా బాబా..! ఈ టుటులూకి అతనంటే అసలు గిట్టేది కాదు. ఏదో చిన్నతనం వల్ల కొద్దిగా పొరబాటు చేసినా బాగా అరిచేవాడు ఈ అలువా బాబా. ఒరేరు శుంఠా అని తిట్టేవాడు.
ఒకసారి రాత్రిపూట మెలకువ వచ్చినపుడు అనిపించింది నన్ను విడిచి అమ్మ ఎలా ఉండగలుగుతుందబ్బా అని..! పోనీ నాన్న అయినా వస్తాడా అంటే ఆయన జాడా లేదు. ఆ చిన్న పంతులుకి ఇక్కడ నుంచి పారిపోవాలనిపించింది, ఒక రోజు..! ఎలాగో నడుచుకుంటూ పాతాపూర్ నుంచి ఖేరంగా దాకా వచ్చాడు. అక్కడ అడ్డంగా ఓ నది వచ్చింది. తనకేమో ఈత రాదు. పడవ నడిపేవాళ్ళూ కనబడలేదు, ఒక వేళ ఉన్నా అంత తొందరగా తీసుకెళ్ళే విధానం ఏమీ కనిపించలేదు. ఏమి చేయాలో అర్ధం కాలేదు.
పైగా ఆ ప్రదేశంలో చీకటిపడితే దెయ్యాలు తిరుగుతాయని ప్రసిద్ధి. అవతల ఒడ్డువైపు చూశాడు, ఎవరైనా కనిపిస్తారే మోనని..! అవతలే తమ గ్రామం ఉండేది. ప్చ్... ఎవరూ జాడ లేరు. కాసేపు ఏడ్చి, ఏమి చేయాలో తోచక తిరిగి ఆశ్రమానికి వచ్చేశాడు.
ఈ ఆశ్రమ జీవితం ఏమీ నచ్చడం లేదు. తాజాగా వేపిన చేప ముక్క దొరకదు. కనీసం ఉప్పు చేప కూడా ఉండదు. ప్రతి రోజూ అదే అన్నం, అదే పప్పు. వాళ్ళమ్మ చేసే నోరూరించే కూరలు గుర్తుకు వస్తుంటాయి. ఆ చప్పిడి అన్నం తినబుద్ధి కాక ఒక్కోసారి కుండలో నీళ్ళు తాగి పడుకునేవాడు.
అలువా బాబా ఒక్కోసారి టుటులూతో కాళ్ళు నొక్కించు కునేవాడు. అతని బాన పొట్ట చూస్తే టుటులూకి నవ్వు వచ్చేది. అలువా బాబా సంగతి తెలుసు గనక నవ్వు ఆపుకునేవాడు. అదే ఇంట్లో అయితే తన కాళ్ళని అమ్మే నొక్కుతుంది. అది గుర్తు వచ్చి ఊసూరుమనిపించింది.
తన తండ్రి, ఈ ఆశ్రమ నిర్వాహకులు, దేవుడు ఈ ముగ్గురే తన ఈ దీనస్థితికి కారణం అని ఆ చిన్నబుర్రకి అనిపించేది. తను ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నందు వల్లే ఇక్కడికి పంపించారేమో.. ఈ సారి ఇంటికి వెళ్ళిన తరువాత తను బుద్ధి గా ఉండాలి. వేళకి స్కూల్‌కి వెళ్ళాలి. చక్కగా చెప్పిన పని చెయ్యాలి.. అని చెప్పి తనలో తను ఒట్టు పెట్టుకున్నాడు. గాలి పటాలు ఎగరేయకూడదు, చెరువులో ఈదడం, చెట్లు ఎక్కడం, తూనీగలు పట్టడం వంటివి కూడా చేయకూడదు. తండ్రి చెప్పినట్లు వినాలి అని కూడా తీర్మానించుకున్నాడు.
ఎందుకని నన్ను నాన్న ఇక్కడ వదిలేశాడని ఆశ్రమంలో ఉండే పెద్దాయనని అడుగుదామని అనుకున్నాడు. కాని ఆయన గంభీరమైన రూపం చూసి వెనక్కి తగ్గేవాడు. సరేలే.. ఆ దేవుడే నన్ను అమ్మానాన్నల దగ్గరకి మళ్ళీ పంపుతాడులే అని సరిపుచ్చుకునేవాడు.
దేవుడు విగ్రహాల దగ్గర వింజామర వీస్తుండే సమయంలో కూడా మొర పెట్టుకునేవాడు ఏమిటయ్యా నాకు ఈ పరిస్థితి, ఇది చూసి నీకు ఆనందమా అని..! టుటులూకి ఓసారి పంతులు గారు చెప్పారు, దేవుడు ఏదీ మనుషులతో ప్రత్యక్షంగా మాట్లాడడు... కొన్ని సంకేతాల ద్వారా ఆయన సూచిస్తూంటాడని..! దేవుని విగ్రహం మీద నుంచి పూలు కింద పడితే అనుకున్న పని అవుతుందని సంకేతమట. అందుకని చాలా పూవులూని అక్కడ పెట్టేవాడు, కాని అవి కింద పడేటప్పుడు ఒకదానికొకటి అతుక్కుపోవడమో... మధ్యలో ఎక్కడో తట్టుకుని ఆగిపోవడమో జరిగేది. అప్పుడు నిరాశగా అనిపించేది.
ఆ రోజు టుటులూకి బాగా విచారంగా ఉంది. లెక్కపెట్టి చెప్పాలంటే అయిదవ సారిగా ఓ పొరబాటు చేశాడు. ఒరేరు నిన్ను ఆశ్రమం నుంచి బయటకి పంపేస్తా అని పంతులుగారు అన్నారు. కొన్నిసార్లు పొరబాట్లు చెయ్యడం కూడా మంచిదేనేమో..! లేగ పెయ్యలా పరిగెత్తాలని తన కోరిక. తూనీగ రెక్కల్లా చేతులు ఎక్కడా ఆగడం లేదు. పింటూ గాడి గాలిపటంలా ఎగురుతోంది మనసు.
ఈ పొరబాట్లు అన్నీ కలిసి ఏదో ఒకరోజు తనకి విముక్తి కలిగించవచ్చునేమో..! ఇక్కడి స్కూల్‌లో పరసు అనే స్నేహితుడు ఉన్నాడు. వయసులో తనకన్నా మూడేళ్ళు పెద్ద. తన పిలక మీద ఎలాంటి కామెంట్ చేయని వాడు ఇతనొక్కడే. స్కూల్ అయిన తర్వాత అతనితోనే నడుచుకుంటూ వస్తుంటాడు.
''పరసు... నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నువు ఎంత మంచి వాడివో మా అమ్మకి చెబుతాను'' అనేవాడు టుటులూ. ఆ పరసు టుటులూకి ఎన్నో సలహాలు ఇస్తుండేవాడు, పొరబాట్లు చేస్తూ ఉంటేనే నిన్ను ఆశ్రమం నుంచి త్వరగా ఇంటికి పంపించి వేస్తారని చెబుతుండేవాడు. అలాంటప్పుడు టుటులూకి కన్నీళ్ళు వచ్చేవి. మళ్ళీ నేను మా ఊరు వెళ్ళగలనా అని..! నది కి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇల్లు, అక్కడి పొలాలు, కాలవలు, ఒంటి కాలు మీద జపం చేసే కొంగలు గుర్తుకు వచ్చేవి.
''అలా చేతగానివాడిలా ఏడవకు, ధైర్యంగా ఉండాలి'' అనేవాడు పరసు. స్నేహితుడి మాటలు అతనిలో స్థయిర్యాన్ని నింపేవి. ఒకసారి ఆశ్రమానికి వచ్చిన ఓ భక్తుడి దుస్తుల్ని దాచి ఎక్కడో పడేశాడు. స్నానం చేయకుండానే దేవుడి విగ్రహానికి పూలమాల అలంకరించేవాడు. ఇలా కొన్ని పొరబాట్లు కావాలనే చేస్తుండేవాడు. దేవుడి పట్ల అలా చేస్తే ఆయనకి కోపం రాదా అని సందేహం వచ్చేది. దేవుడు అలాంటి చిన్న విషయాల్ని పట్టించుకోడు, ఎందుకంటే ఆయనకి నీ బాధలు అన్నీ తెలుసు గదా అని స్నేహితుడు పరసు ఓదార్చేవాడు.
అన్నిటికన్నా పెద్ద పొరబాటు ఒకటి చేశాడు. బాగా వేయించిన రొయ్య ముక్కని అలువా బాబా చూస్తుండగా ఓ రోజు తిన్నాడు. అసలు ఈ ఉపాయం చెప్పింది స్నేహితుడే, అద్భుతంగా పనిచేస్తుందని సలహా ఇచ్చాడు. తన ఊరు వెళ్ళి పోవడానికి అయిదు ఏమిటి, అయిదు వందల పొరబాట్లయినా చేస్తా అనుకున్నాడు.
పరసు ఇచ్చిన సలహా ఆనందాన్ని కలిగించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని తిన్నదే లేదు. గర్భ గుడిలోకి వెళుతున్న అలువా బాబాకి తాను రొయ్యని చుట్టి తెచ్చిన ఆ కాగితాన్ని కూడా కావాలని చూపించాడు.
అలువా బాబాకి దిమ్మ తిరిగిపోయింది. అది తను ఊహించిందే..! అలువాబాబా ఈడ్చి ఒక్కటి తన్నాడు టుటులూని. ఇది మాత్రం తాను ఊహించలేదు. పరసు కూడా చెప్పలేదు. ఆశ్రమంలో పెద్ద దుమారం రేగింది. ఈ ప్రాంగణం లో చేపని తినడం మహా పాపమని, వెంటనే శుద్ధి చేయాలని లేకపోతే దేవునికి ఆగ్రహం వచ్చి ఈ ప్రదేశంలో ఉండడని అందరూ అన్నారు. ఇక్కడ దేవుడు ఉంటాడా ఉండడా అన్నది సమస్య కాదు తాను ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి వొట్టు పెట్టాడు ఎళతాడా లేదా అన్నదే టుటులూ సమస్య.
ఆ రాత్రి అతనికి సరిగా నిద్ర పట్టలేదు. ప్రతి ఒక్కరూ ఎన్నో విధాలుగా తిట్టారు. అంతటితో ఆగక టుటులూ తల్లిదండ్రుల్ని ఇంకా వంశాన్ని కూడా తిట్టారు. పరసు చెప్పిన ప్రకారమే తాను చేశానని చెప్పాలను కున్నాడు. కాని ఎట్టి పరిస్థితుల్లో చెప్పనని తన తల్లి మీద ఒట్టు పెట్టాడు పరసు దగ్గర..! దాన్ని కాదని చెబితే తల్లికి ఏమైనా జరిగితేనో, అదీగాక ఒట్టు మీరితే కళ్ళు కూడా పోతాయంటారు. సరే.. ఏది ఏమైనాగాని చెప్పకూడదనే నిర్ణయించుకున్నాడు.
ఆ తెల్లారి ఆశ్రమంలోని పెద్ద పంతులు గారు టుటులూని పిలిపించారు. ఇక నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మీ నాన్నని పిలిపిస్తానని అన్నారు. లోలోపలే పట్టరాని సంతోషం కలిగింది టుటులూకి. అయితే బైటికి అది కనిపించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తోట అవతలకి వెళ్ళిన తర్వాత మాత్రం తాను చేసిన పని మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఆనందించడమే గాక సలహా ఇచ్చిన పరసుకి కతజ్ఞత తెలుపుకున్నాడు తనలోనే..!
వాళ్ళ నాన్న ఎట్టకేలకు వచ్చాడు. నాన్నని చూస్తే కొద్దిగా వయసు పెరిగినట్లుగా అనిపించాడు. ఆనంద బాష్పాలు రాలుతుండగా, వెళ్ళి కౌగిలించుకున్నాడు తండ్రిని.
కాషాయ వస్త్రాలు, గుండు, పిలక, నుదిట మీద నామాల తో ఉన్న టుటులూకి ఇక తనకి మోక్షం లభించింది, నాన్న ఇంటికి తీసుకుపోతాడులే అని సంతోషం వేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత బుద్ధిమంతునిగా ఉండాలనే విషయాన్ని మర్చిపోయాడు. వాళ్ళ ఇంటిపక్కనే ఉన్న చెరువు, దాని పక్కనే ఉన్న ఆటస్థలం, గగన్ మామయ్య వాళ్ళ బుజ్జి కుక్క ఇంకా ఆవు పెయ్య గుర్తుకు రాసాగాయి. అమ్మకి ఉన్నట్టుండి కనిపించి ఆశ్చర్యపరచాలి అనుకున్నాడు.
తనకి సంబంధించిన వస్తువులన్నీ తన స్కూల్ బ్యాగ్‌లో కుక్కుకున్నాడు. వాటర్ మగ్‌ని విసిరి కొట్టాడు. ఇక దానితో పనేముంది..? చెమ టలు వస్తున్నాయి. అలువా బాబా మంచం పక్కనే ఉన్న అటుకుల సీసాలో నుంచి కొన్ని అటుకుల్ని ఒంపుకుని నోట్లో పోసుకు న్నాడు. అలా తన కసి తీర్చుకున్నాడు.
బయటకి వచ్చి చూసే సరికి వాళ్ళ నాన్న పెద్ద పంతులు గారితో మాట్లాడుతూ కనిపించాడు. ఆయన చేతిలో కొంత ధనం పెట్టి ఇలా అన్నాడు. ''ఏదో చిన్న పిల్లాడు, పొరబాటు చేశాడు. దయచేసి మా అబ్బాయిని క్షమించండి.''
ఆ మాటలు విన్న టుటులూకి మతిపోయినంత పనయింది. ఏమి అనాలో అర్థం కాలేదు. అంతలోనే తండ్రి టుటులూ దగ్గరకి వచ్చి ఇలా అన్నాడు ''నేను పంతులు గారికి నీ తరఫున క్షమాపణలు చెప్పాను. ఆయన మన్నించారు. ఇక మీదట నువ్వు మంచి పిల్లాడిలా మసలుకోవాలి, సరేనా..? నీకు పన్నెండు ఏళ్ళు రాగానే జగన్నాధ ప్రభువుకి అమ్మి, ఆ తర్వాత వేలం పాటలో నిన్ను కొనుక్కుంటాము. అప్పుడు నిన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోతాము. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. నువు పుట్టినప్పుడు మొక్కుకున్నాం గదా, కనక అలా చేయడం మన ఆచారంలో భాగం అన్నమాట.''
పిడుగు పడినట్లయింది టుటులూకి..! హదయం వక్కలయింది. తన చెవులని తనే నమ్మలేకపోయాడు. ఈ లోగా అలువా బాబా వచ్చి తన చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. టుటులూ ఎలాగో విడిపించుకుని వాళ్ళ నాన్న కేసి చూసి దీనంగా పిలవసాగాడు.
వాళ్ళ నాన్న ఆశ్రమంలోని దేవుడి గుడి దగ్గరికెళ్ళి నమస్కరించుకుని, తన భాగ్యానికి కతజ్ఞతలర్పించుకొని వడి వడిగా రోడ్డు మీదికి వెళ్ళిపోయాడు. అలా చూస్తుండగానే తండ్రి కనుమరుగైపోయాడు. ఆ చిన్న పంతులు టుటులూ అరిచిన అరుపు తండ్రికి గాని, పెద్ద పంతులు గారికి గాని, ఆ గుళ్ళోని దేవుడికి గాని ఎవరికీ వినిపించలేదు.
- ఒరియా మూలం : గౌరహరి దాస్
- తెలుగు సేత : మూర్తి కె.వి.వి.ఎస్,
7893541003