Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయం ఎనిమిది గంటల సమయం. జంట నగరాల్లో కూలీలందరూ చేరుకునే అడ్డా అది. ఆ ఏరియాకు దగ్గరలో వున్న గుడిసె వాసులు పొట్ట నింపుకోడానికి, పనులు వెదుక్కునే నిమిత్తం ఉదయం ఏడు గంటలకి ఆ సెంటర్‌కు చేరుకుంటారు. ఆ సెంటర్‌ను జెండాల సెంటర్ అంటారు. అక్కడ అన్ని కార్మిక సంఘాల వారు తమ తమ స్థూపాలను నిర్మించుకున్నారు. సి.ఐ.టి.యు, ఎ.ఐ.టి.యు.సి... మొదలైన అన్ని ట్రేడ్ యూనియన్ల జెండాల దిమ్మల చుట్టూ కూలీల్లో కొందరు కూర్చొని, మరికొందరు సహచరులతో నిలబడి ముచ్చటించుకుంటూనే ఏవరయినా మేస్త్రీ వచ్చి తమను తీసుకొని పోతే బాగుండు అని అనుకుంటున్నారు.
వాళ్ళ కుటుంబాలోలని ఆడ కూలీలందరూ అక్కడక్కడ గుంపులుగా కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. వారితో పాటు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ చుట్టూ చేరి ఆడుకుంటున్నారు. పాపం, పుణ్యం, అభం, శుభం తెలీని వయసు వారిది. అయినా తల్లిదండ్రులతో పాటు కూలీకి వెళ్ళడం వాళ్ళ దినచర్య. వాళ్ళల్లో కొంతమంది పిల్లలు అక్కడికి వచ్చే మేస్త్రీలను 'కూలీలు కావాలా బాబుగారూ! ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు రండి'' అని పిలుస్తుంటారు కూడా. రెండు జెండాల దిమ్మెల మీద పాతిన జెండా కర్రలకు చీరెలను ఉయ్యాలలాగ కట్టి పసి పిల్లలను అందులో పడుకోబెట్టి కొందరు పెద్ద పిల్లలు ఉయ్యాలలూపుతున్నారు.
ముఠా మేస్త్రీలు కొందరు వచ్చి తమ పనులకు పనికి వచ్చే పనివాళ్ళను ఎంచుకొని తీసుకెళ్తున్నారు. అక్కడ చేరిన వారిలో అధికభాగం భవన నిర్మాణరంగంలో పనిచేసేవారే. ఇటీవల బిల్డర్లు తాము కట్టిన ఇళ్ళకు తగిన రేటు రాక స్థబ్దంగా వుండిపోయారు. గత నెల రోజుల నుండి బిల్డర్లు మళ్ళీ ఇళ్ళు నిర్మించటానికి సమాయత్తమవుతుండడంతో కూలీలు కొంతమందికి పని దొరుకుతున్నది.
యాదయ్య, పోచమ్మ ఇద్దరూ బల్దియా శివార్లలోని గ్రామాల్లో ఒక గ్రామంలో నివసిస్తూ పొట్ట గడవక తోటి కూలీలతో వలస వచ్చి అసంపూర్తిగా వున్న ఒక భవనం లోపలి భాగంలో వున్న సెంట్రింగ్ కర్రల మధ్యలో పిల్లలను పడుకోబెట్టి తమను తీసుకొని వచ్చిన మేస్త్రీ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆ మేస్త్రీ ఒక బిల్డర్ నిర్మించే గృహాల కట్టుబడికి కులీలను పంపిస్తూ దాని మీద వచ్చే కమీషన్‌తో జీవిస్తున్నాడు.
యాదయ్య, పోచమ్మలకు ఒక ఇల్లంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. ఆ బిల్డర్ నిర్మించే గృహాల మధ్యనే ఒక గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. ఆ గుడిసె మీద నల్లటి ప్లాసిక్ పట్టాలతో కలిపి కుట్టిన పెద్ద టార్పాలిన్‌తో మూసివేశారు. మీరు వుండే గుడిసె అర్ధచంద్రాకారంలో మూడడుగుల ఎత్తులో వెదురు బద్దలను వంచి కట్టిన వాటితో నిర్మించబడి వుంటుంది. అందులోనే రెండు భాగాలుగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు వున్న ఇద్దరు పిల్లలను గుడిసె వెనుక భాగాన్ని విడదీస్తూ కట్టిన ఒక వెదురు తడికల వెనుక పడుకోబెడతారు. భార్యాభర్తలిరువురూ ముందు భాగంలో పడుకుంటారు.
వారం రోజుల నుంచి పోచమ్మకు జ్వరం తగిలి మూసిన కన్ను తెరవకుండా పడి వున్నది. పిల్లలిద్దరి వయసు ఒకడికి పన్నెండు సంవత్సరాలు, మరొకడికి పది సంవత్సరాలు. వాళ్ళిద్దరు కూడా తండ్రితో పాటు పనికి వెళ్తున్నారు. ముగ్గురికి వచ్చే రోజువారీ కూలీ పోచమ్మ మందులకే సరిపోవడం లేదు. ఎంతో కొంత మిగిలిన దాంతో ఒక పూట భోజనానికి సరిపోతోంది.
ఉదయం పూట భోజనం సర్కారు వారు పెట్టే అయిదు రూపాయల భోజనంతో కడుపు నింపుకుంటూ, రాత్రిపూటకు పైసలు మిగిలితే భోజనం లేకుంటే పస్తులుండటం వాళ్ళకు అలవాటయిపోయింది.
ఈ రోజు పోచమ్మ ఓపిక చేసుకుని తాను కూడా కూలికి వస్తానని బయలుదేరింది. యాదయ్య ఏమీ అడ్డగించలేదు. అలా అని పనికి రమ్మని ఒత్తిడి చేయనూలేదు. ఉదయం ఆరు గంటలకే లేచి గుడిసె శుభ్రం చేసుకుని, గుడిసె లోపలకు ఎవరూ వెళ్ళడానికి వీల్లేకుండా వెదురు తడికెను పెట్టి రెండువైపులా తాళ్ళతో గట్టిగా కట్టి, తమ వెంట వుంటున్న కుక్కను కాపలా పెట్టి, ఒక సారి చుట్టు పక్కల పరకాయించి చూసి ఫర్వాలేదులే అనుకుని అడ్డా దగ్గరకు వచ్చారు.
పోచమ్మ పనిచేస్తానని అయితే వచ్చిందికానీ, శరీరం ఏమాత్రం సహకరించడంలేదు. రెండడుగులు వేయగానే ఆయాసం ముంచుకు వస్తోంది. అడుగులు తడబడుతున్నాయి. అయినా పిల్లల చేతులు పట్టుకుని ఎలాగో అడ్డా దగ్గరకు వచ్చింది.
ఈ రోజు వాళ్ళను తీసుకుని వెళ్ళే మేస్త్రీ ఇంకా రాలేదు. వస్తాడో రాడో తెలియదు. వలస కూలీలంతా ఒకరొకరుగా ఎవరినో యాచించి పనికి వెళ్తున్నారు. యాదయ్యను పనికి పిలిచేవాళ్ళు ఎవరూ కనిపించలేదు. అయినా యాదయ్య నిరాశ చెందలేదు. ఎవరో ఒకరు రాకపోతారా? తనకు పని దొరకకపోతుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నాడు.
పిల్లలిద్దరూ సగం పగిలిన రబ్బరు బంతీ, అసంపూర్తిగా నిర్మాణంలో వున్న ఇంటిముందున్న నాలుగు పలకల కట్టె ముక్కలను బ్యాట్‌గా మలుచుకుని ఆ ఇంటి నీడలో క్రికెట్ ఆట ఆడుకుంటున్నారు.
బయట ఎండకాస్తున్నా సెంట్రింగ్ పెట్టి, వాటర్ క్యూరింగ్ అయిన భవనం కాబట్టి లోపల చల్లగానే వుంది. పోచమ్మ ఎండలో నిలబడలేక ఆ అసంపూర్తి భవనం ముందు భాగంలో వున్న నీడలో కూర్చుంది. ఆమెను ఒక్కసారిగా ఆలోచనలు చుట్టుముట్టాయి.
పోచమ్మ తల్లిదండ్రులు మహబూబ్‌నగర్ జిల్లాలో, ఒక పల్లెటూళ్ళో నివసించేవారు. అది మరీ కుగ్రామం అయినందున రవాణా సౌకర్యాలు ఆ ఊరి దరిదాపుల్లోకి రాలేదు. పొలాలకు సాగునీరు సౌకర్యం లేక రైతులు సాగుచేయడం మానుకొని కొంతమంది గల్ఫ్ దేశాలకు సంపాదన కోసం వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం ఉన్న ఊరు విడిచి వెళ్ళలేక అక్కడే వుండి తాగునీటి సౌకర్యం లేక, తమవాళ్ళు వాళ్ళకోసం వుంచిపోయిన కొద్దిపాటి ఉప్పు, పప్పులతో కాలం గడుపుతూ ఊరు విడిచి ఎక్కడికీ వెళ్ళలేక ఇంటిముందున్న పశువులను చూసుకుంటూ వున్నారు. ఈ మధ్య మరీ గడ్డుకాలం దాపురించి పశువులు అన్నీ మరణించాయి. వాళ్ళు కాలే కడుపులతో నకనకలాడుతూ జీవచ్ఛవాల్లా బతుకుతూ గల్ఫ్ నుండి తమవాళ్ళు పంపే డబ్బు కోసం చావకుండా ఎదురు చూస్తున్నారు.
యాదయ్య, పోచమ్మల పెళ్ళి జరిగింతర్వాత కొంతకాలం బాగానే గడిచింది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చడానికి వాళ్ళు తాకట్టు పెట్టిన పొలం బ్యాంకువాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు గడవడం కష్టమయిపోయింది. ఇద్దరు పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టలేక, వాళ్ళ చుట్టాలు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్తుంటే, వాళ్ళ వెంట వీళ్ళు కూడా వచ్చారు.
కొంతకాలం ఒక బిల్డరు దగ్గర పనిచేస్తూ ఆ భవనాల పక్కనే ఒక గుడిసె వేసుకుని ఇసుక, కంకర, పైపులకు కాపలాగా వుంటూ జీవనం గడిపారు. ఆ బిల్డరు తాను నిర్మించే గృహాలన్నీ పూర్తయిపోయింతర్వాత ఇంకో చోట ప్లాట్లు కొనుక్కొని, అక్కడ ఇళ్ళు నిర్మించడానికి వెళ్తూ ''యాదయ్యా! నేను అక్కడికి వెళ్ళింతర్వాత మిమ్మల్కందర్నీ అక్కడికి తీసుకెళ్తా. అప్పటి వరకూ మీరు ఇక్కడే వుండండి'' అని చెప్పి వెళ్ళాడు.
రెండు నెలలయినా అతని దగ్గర్నుంచి కబురు రాలేదు. అతడూ కనిపించలేదు. కానీ వారు గుడిసె వేసుకున్న స్థలాన్ని కొనుకున్న యజమాని అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. యాదయ్యకు ఏమీ చేయడానికి పాలు పోలేదు. తనకు తెలిసిన వాళ్ళు పని చేస్తున్న బిల్డరు దగ్గరికి వెళ్ళి ఏదయినా పని ఇవ్వమని వేడుకున్నాడు.
అతడు ఏమనుకున్నాడో ఏమో కానీ ప్రతి రోజూ కాకపోయినా అప్పుడప్పుడు పని ఇస్తుండేవాడు. పోచమ్మ సమీపంలోని ఇళ్ళ వద్దకు వెళ్ళి ఇంటి పనులు చేస్తూ అప్పుడప్పుడూ యాదయ్యతో కలిసి పనికి వెళ్తుండేది. ఇటీవల అతడు కూడా యాదయ్యను పనిలోకి తీసుకోవడం లేదు. పిల్లలు చేయడానికి పని ఏమీ లేక సోమరి పోతుల్లా తయారయ్యారు. పెద్దవాడు మాత్రం ఊరికే కూచోకుండా ఇటీవల ఓ సూత్రం కనిపెట్టాడు. వాళ్ళ గుడిసెలకు కొంత దూరంలో ఒక ప్రభుత్వ పాఠశాల వుంది. దాంట్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఇది గమనించి రోజూ తమ్ముణ్ణి తీసుకుని భోజనం సమయానికి స్కూలుకి చేరుకుని పొట్ట నింపుకుంటున్నారు. కొన్నాళ్ళయింతర్వాత వాళ్ళు ఆ పాఠశాల విద్యార్థులు కారని తెలుసుకుని రానీయడం లేదు. దినదినగండంగా మారిన తమ బతుకుల్ని తలచుకుంటూ యాదయ్య, పోచమ్మ దు:ఖించని దినం లేదు.
అదుగో... అప్పుడు తారసపడ్డాడు సైదులు. సైదులు ప్రతిరోజూ ఒక అడ్డా దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా పని సంపాదించుకుని పొట్ట పోసుకుంటున్నాడు. వాడితో పరిచయం అయ్యాక యాదయ్య, పోచమ్మలు సైదులుతో పాటు పనికి వెళ్తున్నారు. దొరికిన రోజు తినడం, దొరకని రోజు పస్తులుండటం అలవాటయిపోయింది.
ఎండ చురుక్కుమనిపించడంతో పోచమ్మ ఈ లోకంలోకి వచ్చింది. కూలీలందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. పిల్లలిద్దరూ బంతాటాపుచేసి ఓ గోడకు చేరగిలపడి నిద్రపోతున్నారు. ఇంతలో అటుగా వచ్చిన సైదులు 'పోచమ్మా! ఈ రోజు నీకు పని దొరికేటట్టు లేదుగదా! ఎక్కడికి వెళ్తావు. ఇదుగో ఈ ఇల్లు ముందర ఆడుకుంటున్న వాళ్ళందరూ మన వాళ్ళ పిల్లలే. వీళ్ళందర్నీ జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతూ వుండు. వాళ్ళు వచ్చింతర్వాత వాళ్ళతో తృణమో పణమో ఇప్పిస్తా. అసలే ఓపిక లేనిదానివి'' అని వాళ్ళందర్నీ పోచమ్మకు ఒప్పజెప్పి వెళ్ళాడు.
సైదులు వెళ్ళింతర్వాత యాదమ్మ ఒకసారి పరిసరాలు పరికించింది. నిన్న ఖర్చుపెట్టగా మిగిలిన రెండు రూపాయలు కొంగున ముడి వేసి వున్నాయి. ఆమె కూర్చున్న స్థలానికి ఎదురుగా ఒక పక్కన పోచమ్మ దేవాలయం కనబడింది. ఒకసారి ఆయమ్మను చూసి మొక్కుకుందామని అక్కడకు వెళ్ళింది. దర్శనం చేసుకుని వస్తూ రెండు మొక్కజన్న కండెలు కొనుక్కుని పిల్లల కోసం వచ్చింది. ఆ సరికి పిల్లలిద్దరూ తల్లి కోసం వెతుకుతున్నారు.
తను తెచ్చిన మొక్కజన్న పొత్తులు పిల్లలిద్దరికీ చెరొకటి ఇచ్చి మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయింది. పిల్లలిద్దరూ మొక్కజన్న పొత్తులు తింటూ కబుర్లలో మునిగిపోయారు.
పోచమ్మకు సైదులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వాళ్ళు వదిలివెళ్ళిన పసిపిల్లలు ఎక్కడున్నారు అని చూసి, వాళ్ళందరినీ ఎండ తగలకుండా సెంట్రింగ్ చేసిన భవనంలోని ఒక భాగంలోకి చేర్చి పడుకోబెట్టి కాపలాగా కూర్చుంది. అది వాళ్ళకు మామూలే. ప్రతి రోజూ పని దొరకని వాళ్ళను ఎవరినో ఒకరిని పిల్లలకు కాపలాగా పెట్టి, వాళ్ళు వచ్చింతర్వాత వాళ్ళ కూలీలోంచి తలా ఒక రూపాయో, అర్థరూపాయో ఇచ్చి ఆదుకుంటూ వుంటారు.
పోచమ్మ వాళ్ళను కాపలా కాస్తూ తమ పెళ్ళి అయిన తర్వాత సంఘటనలను గుర్తు చేసుకోసాగింది. ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే వాతావరణంలో మార్పొచ్చింది.
ఉన్నట్లుండి ఎండ మాయమైపోయింది. ఆకాశమంతా కారుమబ్బులు కమ్ముకున్నాయి. చల్లటి గాలి మొదలయింది. వెనువెంటనే సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఒక పావుగంట గడిచీ గడవకముందే వడగళ్ళు పడటం మొదలయింది. పిల్లలిద్దరూ వడగళ్ళు ఏరుకుంటూ, వాటిని నోట్లో వేసుకుని అటూ ఇటూ ఎగురుతూ తిరుగుతున్నారు.
పోచమ్మ వాళ్ళను గమనించి ''అరేరు రాజూ! ఇట్టా రండి. వడగళ్ళు పడుతున్నాయి. నెత్తిమీద పడితే దెబ్బ తగులుతుంది. తల తడిస్తే జలుబు చేస్తుంది రండి'' అంటూ పిలిచింది. వాళ్ళు వచ్చి పోచమ్మ ఒళ్ళో తలదాచుకున్నారు.
వాతావరణం క్షణాల్లో భయంకరంగా మారిపోయింది. కనీవినీ ఎరుగనంత కుంభవృష్టి కురుస్తోంది. వీధులనీన క్షణంలో నిర్మానుష్యమయ్యాయి. దుకాణాల వాళ్ళందరూ ఎక్కడవాళ్ళక్కడ కూర్చొని ''మన జన్మలో ఇంతవరకూ ఇలాంటి కుంభవృష్టి కురవడం చూడలేదు'' అనుకుంటున్నారు.
పోలీసులు వాహనాల మీద తిరుగుతూ ''వర్షం ఎక్కువగా వుంది. ఎవరూ బయటికి రావద్దు'' అంటూ హెచ్చరిస్తున్నారు.
వర్షం భయానకంగా వుంది. ఎవరికెవరూ కనబడటం లేదు. పోచమ్మ భయం భయంగా పిల్లలను చూసుకుంటూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఉరుములు, మెరుపులూ ఉధృతమవుతున్న వర్షం... పోచమ్మ మదిలో భయం మొదలయింది. ఇంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపులో ఆమెకు ఎదురుగా వున్న ఓ భవనం పెళపెళమంటూ కూలిపోవడం కన్పించింది.
'అమ్మో' అనుకుంటూ పోచమ్మ పిల్లలిద్దరినీ గుండెకు హత్తుకుంది. ఇంతలో పడుకున్న పసిపిల్లలు మేలుకొని ఏడవటం మొదలుపెట్టారు. పోచమ్మకు ఏమీ తోచడం లేదు.
ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలీడం లేదు. పోచమ్మ, పిల్లలకు ఆశ్రయమిచ్చిన ఆ భవంతి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ భవనం విరిగి సిమెంటు దిమ్మలు పడిన శబ్దం ఉరుములతో కలిసిపోయింది. నిశ్చేష్టురాలై చూస్తున్న పోచమ్మ మీద పైన సపోర్టింగ్‌గా పోసిన భీమ్ కూలి ఆమె నెత్తిమీదనే పడింది. భవనమంతా ఒక్కసారి కూలిపోవడంతో ఆ శిధిలాల కింద పోచమ్మ, ఆమె పిల్లలే కాక, మిగిలిన పసిపిల్లలు కూడా ఆ వరద దెబ్బకు బయటకు నెట్టుకుని వచ్చి, వరదలో పడి మూసీనదిలో కొట్టుకుని పోతున్నారు. కళ్ళారా చూస్తున్న భవనాల్లోని వారు ''అయ్యో! అయ్యో!'' అని అరవడం తప్ప వేరేమీ చేయలేకపోయారు.
పన్నెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన ఆ వాననీటిలో పోచమ్మలాంటి వారెందరో గంగలో కలిసిపోయారు. మిగిలిన వారందరూ ఆ భవనాల శిథిలాల కింద కూరుకునిపోయారు.
వర్షం వెలవగానే ఫైరింజన్లు, బుల్‌డోజర్లు, అధికారులు, అనధికారులు అందరూ ఆ ప్రాంతం చేరుకున్నారు. అయినా చేయగలిగిందేముంది? సహాయక చర్యలు ముమ్మరంగా సాగాయి. చావగా మిగిఇన వారికి సర్కారు నష్ట పరిహారమంటూ అందజేసింది.
వార్తాప్రసార సాధనాలన్నీ బ్రేకింగ్ న్యూస్ ఐటంలలో చనిపోయిన వారి శవ శకలాలను, కొట్టుకుపోతున్న అభాగ్యజీవులను మార్చి మార్చి చూపిస్తున్నాయి. ఆ వార్తల ప్రసారాల మధ్యలో విషాద గీతం వినిపిస్తోంది.
రచయిత సెల్ : 9885787250
- తాటికొండాల నరసింహారావు