Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయం ఎనిమిది గంటలయింది. ఆ రోజు ఆదివారం కావడంతో కటింగ్ చేయించుకుందామని సెలూన్‌కు వెళ్ళాను. ఓనర్ రమేష్ నా శిష్యుడే కావడంతో గేట్లో అడుగుపెట్టగానే ''నమస్కారం సార్! రాక చాలా రోజులయింది. ఏదైనా ఊరు వెళ్ళారా?'' అంటూ ఎదురుగా వచ్చి నమస్కారం చేశాడు.
రమేష్ వాళ్ళ నాన్న వెంకటస్వామి కూడా నాకు పరిచయమే. దాదాపు నలభై ఏళ్ళవుతుందనుకుంటా. నేను ఖమ్మం పక్కన వున్న ఒక ఊళ్ళో హైస్కూల్లో ఉద్యోగం చేసేటప్పుడు వెంకటస్వామి మా ఇంటికి వచ్చి షేవింగ్, కటింగ్ చేసి వెళ్ళేవాడు. ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చినా అతనికి అవసరం వచ్చినప్పుడు పదీ, ఇరవై తీసుకుని పోయేవాడు. వెంకటస్వామిని నేను ''ఏమోరు! కుచేలరావ్?'' అని హాస్యమాడేవాడిని. ఎందుకంటే వెంకటస్వామికి ఆరుగురు మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలు.
ఆ వూళ్ళో నాయీ బ్రాహ్మణ కుటుంబాలు నాలుగు వుండేవి. ఆ వూళ్ళోని ఇళ్ళను నాలుగు కుటుంబాల వారు కుటుంబానికి ఇన్ని ఇళ్ళు అని ఒప్పందం చేసుకుని, వాళ్ళు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబంలోని వారందరికీ వృత్తిపని చేసి, సంవత్సరానికి ఒకసారి రైతులు, తదితరులు ఇచ్చే ధాన్యంతో కుటుంబ పోషణ చేసుకుంటూ వుండేవారు. అలా వాళ్ళిచ్చిన మేరతో సంసారం గడుపుకునే కుటుంబాలలో వెంకటస్వామి కుటుంబం ఒకటి.
నేను స్కూల్‌లో పాఠాలు చెప్పడమే కాక, ఇంటి దగ్గర స్కూల్ వదలగానే కొంతమంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పేవాడిని. అలా ఆ పిల్లల్లో వెంకటస్వామి కొడుకు రమేష్ ఒకడు. అందువలన వాడు అప్పటి నుండే నాకు తెలుసు. ఆ ఊళ్ళో నేను దాదాపు పది సంవత్సరాలు పని చేశాను. అందుచేత నన్ను చూడగానే నమస్కరిస్తాడు.
ఆ రోజు నాకు బాగా గుర్తు. స్కూల్ నుండి ఇంటికి వచ్చి, శ్రీమతి ఇచ్చిన కాఫీ తాగి పడక కుర్చీలో కూర్చుని తాపీగా ఆ రోజు పేపర్ చూస్తున్నాను. ఇంతలో వెంకటస్వామి ఏడ్చుకుంటూ వచ్చి ''సార్... మీరే సహాయం చేయాలి. ఎవరిని అడిగినా లేవంటున్నారు. దయ చూపించండి సార్'' అన్నాడు.
నాకు విషయమేమీ అర్థం కాక ''వెంకటస్వామీ! కంగారు పడకు. అసలేం జరిగింది. వివరంగా చెప్పు. సహాయానికేముంది? నా చేతనయినంత చేస్తాలే!'' అన్నాను.
అతను కొన్ని నిమిషాలాగింతర్వాత కొంత స్థిమితపడి అసలు విషయం చెప్పాడు, ''మా రమేష్ ప్రాణం మీదికొచ్చింది సార్. దవాఖానాకు పోవాలె. మూసిన కన్ను తెరవడం లేదు. మన డాక్టర్ సత్యం, ఖమ్మం తీసుకువెళ్ళమంటున్నాడు. కాలూ చేయీ ఆడటం లేదు. ఎట్లయినా మీరే సాయం చేయాలి సార్'' అంటూ బిక్క ముఖం పెట్టాడు.
జరిగిన విషయం నాకు అర్థమయింది. ''సరే వెంకటస్వామీ, కంగారుపడకు. నేనిస్తాలే. ఎంత కావాలి'' అని అడిగాను.
''కనీసం అయిదు వందలయినా ఖర్చవుతుంది అంటున్నాడు సత్యం'' అన్నాడు.
''సరే, ఆ అయిదొందలు నేనిస్తాలే! రమేష్‌ను తీసుకుపోయి హాస్పటల్‌లో చేర్పించు. కావాలంటే రేపింకా సర్దుతాను'' అని చెప్పి ఇంట్లోకి వెళ్లబోయాను. నా శ్రీమతి సంభాషణ అంతా విన్నది కాబోలు... నేను లేచీ లేవకముందే ఐదొందలు నా చేతిలో పెట్టి ''వెంకటస్వామికి ఇవ్వండి పాపం.. పిల్లలు గలవాడు. అవసరం ఎవరికయినా వస్తుంది'' అన్నది.
నాకొక్క క్షణం మనసు విచలితమయింది. ఆ అయిదు వందలు శ్రీమతిని ఎలా అడగాలా అనుకుంటున్నాను. ఎందుకంటే, మా చిన్నవాడు కాలేజీలో కట్టవలసిన ఫీజు అది. దానికోసమే ప్రత్యేకించి ఇచ్చాను. అది గవర్నమెంటు కాలేజీ కావటాన కాలేజీ ఫీజు ఐదువందలే. నేనడక్క ముందే శ్రీమతి నా చేతిలో పెట్టడంతో సాటి మనుషుల మీద ఆమె చూపిన మానవత్వానికి నా కళ్ళు చెమర్చాయి.
''పరీక్ష ఫీజు తర్వాత చూద్దాం. ముందు వెంకటస్వామికి ఇవ్వండి'' అనడంతో ఆ ఐదొందలు అతనికిచ్చాను.
''ఆపదలో ఆదుకున్నారు సార్. మీ మేలు మర్చిపోలేను'' అంటూ వెంకటస్వామి వెళ్ళిపోయాడు.
హాస్పటల్‌లో చేరిన తర్వాత హాస్పటల్ ఖర్చు రెండువేల దాకా పెరిగింది. వెంకటస్వామి నా మీద నమ్మకంతో వేరే ఎక్కడా డబ్బు కోసం ప్రయత్నించలేదు. ఎలాగా అని ఆలోచనలో పడ్డాను. ఇంతలో మా దూరపు బంధువు ఒకరు మా ఇంటికి వచ్చారు. ఆయన నన్ను చూసి ''ఏమిటి మూర్తీ, అదోలా వున్నావు. ఏం జరిగింది?'' అంటూ ఆరా తీశారు.
సంగతి తెలుసుకున్న ఆయన ''మూర్తీ, కంగారు పడకు. ఆపదలో వున్న వాళ్ళను ఆదుకోవడం మంచిదే కదా! నా దగ్గర రెండు వేలున్నాయి. ప్రస్తుతం అవి తీసుకుని గండం గట్టెక్కించు. డబ్బు అతను ఇచ్చినప్పుడే నాకు ఇవ్వు'' అని రెండు వేలు చేతిలో పెట్టాడు.
నాకు ఆశ్చర్యమయింది. మంచి మనసుకు మంచి రోజులంటే ఇవే కాబోలు అనుకుని, వెంకటస్వామి ఆపద గట్టెక్కించాను. ఆ రెండు వేలు తర్వాత నా స్వంతంగానే ఆయనకు వెంటనే పంపించాను. దాదాపు ఐదు రోజుల తర్వాత రమేష్ ఆరోగ్యం మెరుగయింది. అతడు వచ్చిన తర్వాత వెంకటస్వామి ఇంటి వెనక చెట్ల పాదులలో వేసిన వంకాయలు, దొండకాయలు, దోసకాయలు, మరేవో కూరలు తెచ్చి, ''సార్! మీ మేలు జన్మజన్మలకీ మర్చిపోను'' అంటూ వాటిని ఇచ్చి వెళ్ళాడు.
ఆ రోజు నుండి నేను ఆ వూరు నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యేవరకు వెంకటస్వామితో నా స్నేహం బలపడింది. నేనెప్పుడూ వెంకటస్వామీ, నేనూ వేరువేరు అనుకోలేదు. నేను ఆ వూరి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యేంత వరకూ వెంకటస్వామి వృత్తి పని చేసినందుకు నా దగ్గర పైసా కూడా తీసుకోలేదు. కానీ నేనూ మా ఆవిడా పండగ అనో, పిల్లల పుట్టిన రోజు అనో వాళ్ల కుటుంబాన్ని పిల్చి ఆర్థికంగా, వస్తు రూపేణా ఎంతో కొంత సహాయం చేస్తూ వచ్చాం. రమేష్ వాళ్ళ అన్నదమ్ములు కూడా రోజుకు ఐదారు గంటలు మా ఇంట్లోనే వుండి, మా శ్రీమతికి అండదండగా వుండేవాళ్ళు.
ఆ వూరి నుంచి బదిలీ అయింతర్వాత కొద్ది రోజులు మా మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. కొంతకాలానికి అవీ ఆగిపోయాయి. నేను ఉద్యోగరీత్యా నాలుగయిదు ఊళ్ళు తిరగటం, మా పిల్లల చదువులు, పెళ్ళిళ్ళలో పడి ఆ కుటుంబాన్ని తాత్కాలికంగానైనా మర్చిపోయాం.
***
నేను ఇంక నాలుగైదేళ్ళకు రిటైర్ అవుతాననగా కుటుంబాన్ని ఖమ్మానికి మార్చాను. ఒక రోజున ఆదివారం పూట షేవింగ్ చేయించుకుందాం, సెలూన్ ఎక్కడ వుందా అని చూస్తే మా వీధికి ఒక వీధి దాటిన తర్వాత మెయిన్‌రోడ్ మీద కొంతదూరం నడవగానే 'వెంకటస్వామి హెయిర్ కటింగ్ సెలూన్, మెన్స్ బ్యూటీ పార్లర్' అని బోర్డు కనిపించింది. వెంటనే అందులోకి దూరి పోయాను.
ఒక పక్కగా వున్న బెంచీ మీద ఒకరిద్దరు కస్టమర్లు ఆ రోజు పేపర్లు చూస్తూ కూర్చున్నారు. నేను కూడా ఒక పేపర్ చేతిలోకి తీసుకుని చూస్తున్నాను. హఠాత్తుగా వాడు నా దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తూ ''మీరు మూర్తి సార్ కదండీ'' అన్నాడు పరీక్షగా చూస్తూ. కొన్ని క్షణాలకు నేనూ అతడిని గుర్తుపట్టాను. వాడు వెంకటస్వామి కొడుకు రమేష్.
''ఓరి నీ బండబడ, నువ్వు వెంకటస్వామి కొడుకు రమేష్‌వి కదూ!'' అన్నాను సంభ్రమాశ్చర్యాలతో.
వాడు చేస్తున్నపని ముగించుకుని నాతో కబుర్లు మొదలెట్టాడు. వాడి షాపులో వర్కర్లు మా మాటలు వింటూనే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
''ఏమిటి రమేష్ సంగతులు? ఎంత కాలమయింది మిమ్మల్ని చూసి. మీ అమ్మానాన్నా అంతా క్షేమమేనా? నువ్విక్కడున్నావేమిటి?''
''ఏం చెప్పమంటారు సార్. మీరు మా వూరి నుంచి బదిలీ అయిన సంవత్సరానికి మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నాలుగయిదు నెలల్లో మా నాన్న కూడా పోయాడు'' అన్నాడు దగ్గుత్తికతో కొంతసేపు ఆగి మళ్ళీ చెప్పాడు...
''ఆ తర్వాత మా అన్నదమ్ములు అందరం కలిసి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాం. ఆ తర్వాత ఊళ్ళో జరుగుబాటు లేక అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళూ రైతుల ఇంట్లో జీతానికి కుదిరి, ఎవరి జరుగుబాటు వారు చూసుకున్నారు. నేను ఆ ఊళ్ళో వుండలేక పెళ్ళయింతర్వాత ఇక్కడికొచ్చాను. ఇది మా అత్తారి ఊరే. నేను ఇక్కడే వుండి మొదట చిన్న డబ్బా పెట్టుకుని షాపు ప్రారంభించాను. కొంత చదువుకున్నవాణ్ణి కావడంతో కొంతమంది పెద్దల సాయంతో ఈ షాపు నడుపుకుంటూ, ఇదిగో నలుగురు వర్కర్లను పెట్టుకున్నాను''
''ఊ... అయితే మొత్తానికి జీవితంలో అన్ని అనుభవాలు అయ్యాయన్నమాట. ఇంతకూ నీకు పిల్లలెందరు?''
గర్వంగా ఫీలవుతూ... ''ఒక అబ్బాయి, ఒక అమ్మాయి సార్. ఇద్దర్నీ బాగానే చదివించాను. మా బాబుకు హైదరాబాద్‌లో ఎంబిబిఎస్ చదువు పూర్తయింది. ఇప్పుడు హౌస్‌సర్జన్ చేస్తున్నాడు''
''వెరీ గుడ్! మరి అమ్మాయి సంగతేంటి?'' అని అడుగుదామనుకుంటున్నంతలో ఒక పెద్ద మనిషి షాపులో ప్రవేశించాడు. ఆయన్ను చూడగానే ''ఒక్క నిమిషం సార్... మీరేమీ అనుకోకుండా ఒక్క నిమిషం వుండండి. సార్‌ని పంపించి వస్తాను'' అని ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి దువ్వెనా, కత్తెరా చేతిలోకి తీసుకున్నాడు.
ఆయనకు క్షురకర్మ చేస్తూనే... ఆయనకు నన్ను పరిచయం చేశాడు. ఆయన మేముంటున్న వార్డులోనే వుంటున్నాడు. జడ్.పి.పి పదవిలో వున్నాడు. అందుకే ఆయన రాగానే ఎదురు వెళ్ళి మర్యాద చేశాడన్నమాట. రమేష్ చెపుతున్నాడు...
''ఈ సార్ మన జడ్.పి.పి రామారావుగారు. చాలా మంచివారు'' అని ఆయనకు నన్ను చూపిస్తూ... ''ఈ సార్ మా గురువుగారు. మా చిన్నతనంలో దెబ్బలు కొట్టి మరీ చదువు చెప్పేవారు'' అనటంతో ఆయన ఒక్కసారిగా నవ్వటం మొదలుపెట్టి, ''ఆ రోజులు అటువంటివి. ఇప్పుడు కొట్టమను చూద్దాం'' అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు.
రమేష్ అన్నాడు... ''మా పాపను కూడా ఈ ఊళ్ళోనే ఇచ్చాను. ఇదుగో ఈయనే మా అల్లుడుగారు'' అంటూ ఒకరిని చూపించాడు. అతను చిరునవ్వు నవ్వగానే, నేనూ నవ్వాను. అతను కూడా ఆ షాపులోనే పని చేస్తున్నాడు.
ఆయన వెళ్ళిపోయింతర్వాత నన్ను కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ లోకాభిరామాయణంలో పడ్డాడు. ''మా బాబు డాక్టరయితే, ఇక్కడే ఒక స్థలం కొని హాస్పటల్ కట్టించి ప్రాక్టీసు పెట్టిద్దామనుకుంటున్నాను సార్. మాలాంటి వాళ్ళకు ఉచితంగా పరీక్ష చేసి మందులిప్పించాలని నా కోరిక సార్. పెద్దవాళ్ళ దగ్గర ఫీజు తీసుకున్నా, మాలాంటి బీదాబిక్కీకి ఉచిత వైద్యం అందించాలని నా కోరిక సార్'' అన్నాడు.
అతడి కోరిక నాకు చాలా సంతృప్తినిచ్చింది. ''అలాగే రమేష్. మంచి పని చేస్తున్నావు'' అన్నాను. నా దగ్గర డబ్బేమీ వద్దు అన్నా, నేను బలవంతంగా యాభై రూపాయలు అతడి చేతిలో పెట్టాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు షాపుకు వెళ్ళినా అదే అలవాటు.
***
కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ సెలూన్‌కి వెళ్ళాను. అతడు పని చేస్తూ ''ఈ రోజు సాయంత్రం ఇంట్లో వుంటారా సార్. మీతో కొంచెం మాట్లాడాలి'' అన్నాడు. నేను సరేననగానే, ''సార్, ఈ రోజు నుంచి మీరు షాపుకు రావద్దు. నేనే ప్రతి ఆదివారం మీ ఇంటికి వస్తాను. మా నాన్నలాగే నేనూ మీ కుటుంబంలో ఎవరికైనా మీ ఇంటికే వచ్చి పని చేస్తాను'' అన్నాడు. నేను సరే అని ఇంటికి వెళ్ళాను.
అన్నట్లే అతడు రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. వస్తూనే కొన్ని పండ్లు ఏవేవో పట్టుకుని మా శ్రీమతికి ఇచ్చి ''అమ్మగారూ బాగున్నారా! నేను వెంకటస్వామి కొడుకు రమేష్‌ను. గుర్తుపట్టారా? నా చిన్నప్పుడు మీ ఇంట్లో వుండి సార్ దగ్గర చదువుకున్నాను'' అన్నాడు.
మా శ్రీమతి ఆప్యాయంగా ''నీ పేరు రమేష్ కదూ. ఒకసారి నీవు ఏదో జ్వరంతో బాధపడుతూ ఖమ్మం పోవాలంటే మా సార్ డబ్బు సాయం చేశారు. ఆ రమేష్‌వి నువ్వే కదూ!'' అన్నది.
''అవునమ్మగారు! ఆ రోజు మీరు చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోను'' అన్నాడు.
''సరే! మీరు మాట్లాడుతూ వుండండి'' అని లోపలికి వెళ్ళి ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది.
కాఫీ తాగుతూ అసలు సంగతి బయటపెట్టాడు. వాడి కొడుకు ఎవరో లేడీ డాక్టర్‌ను ప్రేమించాడట. ఆమెనే పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్తానంటున్నాడట. ''నిన్ననే ఇంటికి వచ్చాడు సార్! నేను చెపితే వినేటట్లు లేడు. మీరయినా కాస్త చెప్పండి సార్. వింటాడేమో!'' అన్నాడు.
అలాగే చెపుతాలే కానీ, ఈ కాలం పిల్లలు మనం చెపితే వింటారా? వాళ్ళ ఆశలు, ఆశయాలు వేరే వుంటాయి. అయినా చెప్పి చూద్దాం'' అన్నాను.
మరుసటి రోజు కొడుకును వెంటబెట్టుకుని వచ్చాడు. ఇద్దరూ నమస్కారం చేసి కూర్చున్నారు. కుర్రాడికి మంచి సంస్కారమే వున్నట్టు తోచింది. ఆ వేషం, భాష చాలా చక్కగా వుంది. ముఖ్యంగా అతడు కూర్చున్న తీరు, అణకువా బాగా నచ్చింది.
రమేష్, ''చూడండి సార్! వీడే మా అబ్బాయి. డాక్టర్ కోర్సు పూర్తయింది. ఇప్పుడు నేనే ఒక ఆస్పత్రి కట్టించి ఇస్తాను. ప్రాక్టీసు చేస్తూ, బీదా బిక్కీకి సాయంగా వుండరా అంటుంటే వినటం లేదు. ప్రేమా, గీమా అంటూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరినో ప్రేమించాడంట. అమెరికా పోతాడంట'' అని కంప్లయింట్ చేశాడు.
నేనేమీ అనకముందే రమేష్ కొడుకు.. ''అవును సార్! మా నాన్న చెప్పింది మంచి మాటే కానీ, నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మా నాన్న అన్నట్లు నేను ఒక అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే'' అని ఒక్క క్షణం ఆగాడు. ఆ క్షణంలో అతని కళ్ళలో ఆ అమ్మాయి పట్ల ప్రేమా, అతని భవిష్యత్తు మెరుపులా మెరిసినట్లనిపించింది.
మళ్ళీ అతనే ''ఆ అమ్మాయి తల్లిదండ్రులిద్దరూ మంచి స్టేటస్‌లో వున్నవాళ్ళు. మా ఇద్దరినీ స్టేట్స్‌కు పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. మా నాన్న అన్నట్లు ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాలంటే కనీసం కోటి రూపాయలవుతాయి. ఆయన స్థలం కొనీ, కట్టించటానికి మనకు అంత స్థోమత వుందా చెప్పండి. అయినా మేం శాశ్వతంగా అక్కడే వుండం. కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత ఇక్కడికే వచ్చి బీదాబిక్కీకి సహాయం చేయగలం. నా ఆలోచనలో ఏమయినా తప్పు వుందా చెప్పండి'' అన్నాడు.
అతను చెప్పిన విధానం, ఆ కన్విన్సింగ్ నేచర్, అతని దృఢదీక్షా, సమాజం పట్ల అవగాహనకు నాకు ఎంతో ముచ్చట వేసింది. అతని ఆలోచన కూడా సబబుగానే తోచింది.
''రమేష్! మీవాడు చెప్పింది కూడా బాగానే వుంది. ఇప్పటికిప్పుడు నువ్వు కోటి రూపాయలు ఎక్కణ్ణుంచి తేగలవ్. పరిస్థితిని బట్టి ఖర్చు ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఆ విషయం కూడా ఆలోచించుకో. మీ వాడి ఆలోచన సరైందే అనుకుంటున్నాను. రత్నంలాంటి కొడుకును కన్నావురా. బాబు చాలా బుద్ధిమంతుడు. అతడిని స్టేట్స్ వెళ్ళిరానీ'' అన్నాను.
రమేష్ కొడుకు ఇంకా ఏదో అనబోతూ వుండగానే ''నువ్వు ఆగరా. చూడండి సార్.. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల మాట వినరని బాగా అర్థమయింది. నేను చెప్పేది కూడా వినండి. ఈనగారు ప్రాక్టీసు పెట్టాక, మమ్మల్ని కూడా అక్కడికే వచ్చి వుండమంటాడు. నేను మటుకు చచ్చినా ఈ ఊరు వదలిపెట్టేది లేదు. నేను ఇక్కడే ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే'' అని ఆవేశపడుతూ అన్నాడు రమేష్.
కొన్ని క్షణాలు ఆగిన తర్వాత నేనే అన్నాను ''రమేష్ చూడు... నీ ఆలోచన మంచిదే. అలా అని అతని ఆలోచన మంచిది కాదని అనలేం. ఇద్దరూ డాక్టర్లే కాబట్టి స్టేట్స్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత క్రమంగా మకాం ఖమ్మానికి మార్చుకోవచ్చు. అప్పుడు ఎలాగూ మీ భార్యాభర్తలు అతని దగ్గరే వుండవచ్చు. అప్పటి దాకా మీరు ఖమ్మంలోనే వుండండి. ఏమంటావోరు'' అని రమేష్ కొడుకును అడిగాను.
''మీరన్నది కూడా మంచి మాటే సార్. అలా చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు'' అన్నాడు.
రమేష్ కూడా ''సరే సార్! మీరు చెప్పినట్లే కానీ, నేను మటుకు నా సెలూన్ మూసే ముచ్చటే లేదు. నాకు అన్నం పెట్టింది. నాకే కాదు, వీడు డాక్టర్ చదవటానికి కూడా డబ్బులు పంపించింది నా సెలూనే. నేను ఎక్కడికీ వెళ్ళను. వాడు మళ్ళీ ఇక్కడకు రావాల్సిందే. అలా అయితేనే ఒప్పుకుంటాను'' అన్నాడు.
''మరి నీవేమంటావ్'' అన్నాను. అతను కూడా ''ఒకే సార్. మా నాన్న చెప్పినట్లే చేస్తాను'' అన్నాడు. ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం కనిపించింది.
''సరే రమేష్. నీ కోరిక తీరిందిగా. మీ వాడిని ఆనందంగా అమెరికా పంపించు'' అన్నాను.
ఇద్దరూ ''వస్తాం సార్'' అంటుండగానే శ్రీమతి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగి ఇద్దరూ వెళ్ళిపోయారు.
- తాటికొండాల నరసింహారావు
రచయిత సెల్ : 9885787250