Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేష్ ఐదవ తరగతి చదువుతున్నాడు. రెండో శనివారం వచ్చిందంటే చాలు పొద్దునే లేచి మొఖం కడుక్కొని, బడి గ్రౌండ్‌కి ఎల్లిపోతాడు నరేష్. అక్కడ తొమ్మిదో తరగతి వాళ్ళు క్రికెట్ ఆడుతుంటారు. వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే బాల్ అందివ్వడం, స్టంప్స్ కింద పడిపోయినప్పుడు సరిచేయడం, మంచి నీళ్ళు అందివ్వడం లాంటివి చేస్తుంటాడు. అలా చేస్తే మ్యాచ్ చివర్లో తనకు బ్యాటింగ్ ఇస్తారు. బ్యాటింగ్ ఎలా చేయాలో జాకీర్ దగ్గరుండి నేర్పిస్తాడు. అందులో జాకీర్ బ్యాటింగ్ అంటే నరేష్‌కి చాలా ఇష్టం.
బాల్ అందిస్తాడని కాదు కాని నరేష్‌కు ఉన్న ఉత్సాహాన్ని గమనించి, తమ్ముడూ తమ్ముడూ అంటూ అందరూ బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఒక రోజు క్రికెట్ ఆడి ఇంటికి తిరిగి వస్తున్న నరేష్‌కి, మురికి కాలువ పక్కన ఒక అవ్వ చిందర వందర జుట్టుతో, చినిగిన బట్టలతో, ఆకలి, నీళ్ళు అని గొణుగుతూ కనపడింది. ముఖం మొత్తం మాసిపోయి ఉంది. చూడగానే భయపడ్డాడు కాని, ఆమె కుడి కాలికి గాయం అయి రక్తం రావడాన్ని చూసి నరేష్ చలించిపోయాడు.
ఇంటికి పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ నాన్న ప్యాంటు జేబులో డబ్బు తీసుకొని, పీరమ్మ అంగడికి పోయి రెండు నీళ్ళ ప్యాకెట్లు, ఒక బిస్కట్ ప్యాకెట్ తెచ్చి అవ్వకిచ్చాడు నరేష్. అవ్వ ఆదర బాదరాగా నీళ్ళు తాగి నాలుగు గుడ్ డే బిస్కట్లు తినింది. బిస్కట్లు తిన్న తర్వాత ఎలాగో ఒక ఆటోలో ఆమెను రాజారెడ్డి ఆసుపత్రికి తీసుకు పోయినాడు. నర్సు దగ్గరికి పోయి అవ్వకు గాయమైంది రక్తం వచ్చాందని చెప్పడంతో, వెంటనే నర్సు అవ్వ గాయానికి కట్టు కట్టి మందులు ఇచ్చింది. నీరసంగా ఉండటంతో గ్లూకోజ్ బాటిల్ కూడా పెట్టింది.
ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న నరేష్‌ని చూసి ''ఏం పేరు నీది? ఈ అవ్వను ఎక్కడ చూసినావు? మీ ఇల్లెక్కడీ'' అని నర్సు అడగడంతో... ఈ లోకంలోకి వచ్చిన నరేష్, ''నా పేరు నరేష్. నేను నాగార్జున హైస్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్న. క్రికెట్ ఆడి ఇంటికి పోతాంటే అవ్వ కాలువ కాడ కనిపించింది అందుకే ఇక్కడికి తీసుకు వచ్చాను'' అని జరిగింది చెప్పాడు. చాలా మంచి పని చేశావని నర్సు ముద్దు చేసింది.
గ్లూకోజ్ బాటిల్ ఎక్కించడం అయిపోగానే అవ్వను తీసుకొని ఇంటికి పోయాడు నరేష్. జరిగిన విషయం వాళ్ళమ్మకు, నాన్నకు చెప్పి, అవ్వకు ఎవరూ లేరని, ఇంట్లోనే పెట్టుకుందామని బతిమిలాడాడు. అయితే నరేష్ వాళ్ళ నాన్న అవ్వను ముసలోళ్ళ ఆశ్రమంలో చేర్పించాడు. ఆరోజు నుండి నరేష్ శెలవు వచ్చిందంటే చాలు ఆశ్రమానికి వెళ్లి అక్కడే అవ్వతో ఆడుకోవడం చేస్తున్నాడు.
ఈ మధ్య గ్రౌండుకు రావడం లేదేందని జాకీర్ నరేష్ వాళ్ళ ఇంటికెళ్లి అడిగాడు. వాళ్ళ నాయన జరిగిన విషయం చెప్పడంతో జాకీర్ ఆశ్చర్యపోయాడు. ఎంతో ఇష్టమైన క్రికెట్ వదిలేసి అవ్వ కోసం ఆశ్రమానికి నరేష్ పోయాడు. మరి నేనేమో ఇంట్లో ఉన్న నాన్నమ్మతో కొద్ది సేపు కూడా గడపడం లేదు. ఆటలు ముఖ్యమే కాని మరీ ఇంట్లో వారిని వదిలేసి ఆడాల్సిన అవసరం లేదనుకున్నాడు. శనివారం రెండు పూట్ల క్రికెట్ ఆడకుండా ఒక పూట మాత్రమే క్రికెట్ ఆడి మరో పూట జాకీర్ తన అమ్మమ్మతో గడపడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న ముసలోళ్ల బాగోగులు తెలుసుకునేవాడు. చందాలు సేకరించి ఆశ్రమానికి ఇచ్చేవాడు.
నరేష్ క్రికెట్‌లో జాకీర్ లాగ కావాలనుకున్నాడు. పెద్దైన తరువాత అవుతాడు కూడా. దాని కంటే ముందే తనలో ఉన్న సహాయ గుణం కారణంగా జాకీర్ నరేష్‌ని అనుసరించేలా చేసుకున్నాడు.
- జాని తక్కెడశిల,
7259511956