Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలాకాలం తరవాత శర్మగారు మా ఇంటికి వస్తున్నారు. కాబట్టీ ఆయనకి ఏదో ఒక సర్‌ప్రైజివ్వాలి. మా ఇంట్లో దొంగతనం జరిగింతరవాత సీసీ కెమెరాలు పెట్టించాను. ఆయన మా ఇంట్లోకి ఎలా అడుగు పెట్టారో, ఆయన్ని నేనూ మా చింటూగాడూ ఎలా రిసీవ్ చేసుకున్నామో, ఆయన మా ఇంట్లోకి రాగానే అన్న మొట్టమొదటి మాటేమిటో అన్నీ సెల్లో చూపిస్తే ఆయన మేం అదంతా ఎప్పుడు రికార్డ్ చేశామో తెలీక కన్‌ఫ్యూజవుతూనే థ్రిల్ ఫీలవుతారు.
ఈ విషయం చింటుగాడికి చెబ్దామనుకునే లోపే కొంపలు మునిగిపోయినట్టు హడావిడిగా ఎంట్రీ ఇచ్చేశారు శర్మగారు. ఆయన్ని చూడగానే చింటూగాడు సంతోషంతో ఎదురెళ్ళాడు. ఉన్నట్టుండి ఆయన కాళ్ళమీద పడిపోయాడు. వాడలా పాదాభివందనం చేస్తాడని ఎంతమాత్రం ఊహించని శర్మగారు కంగారుపడి ఒక్కసారిగా వెనక్కి ఎగిరి దూకాడు. ఆ దూకడంలో ఎడమకాలు బాలెన్స్ తప్పింది. కుడికాలిమీద నిలబడటం కోసం చేసే ప్రయత్నంలో పక్కనే ఉన్న తలుపు ఊతం తీసుకోబోయారు. ఉన్నట్టుండి గట్టిగా గాలి వీయడంతో ఊతమివ్వాల్సిన తలుపు వెళ్ళి గోడకి కొట్టుకుంది. తలుపు చేతికందకపోవడంతో నిలదొక్కుకోలేక వెల్లకిలా పడిపోయాడు. ఎగదోసుకొస్తున్న నవ్వుని ఆపుకోవడానికి నానా తంటాలూ పడుతూ ఆయన్ని పైకి లేపి తీసికెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాను. చింటూగాడు ఆయన్ని చూసి ఎక్కడ నవ్వుతాడో, ఆయనెక్కడ ఫీలవుతారో అని లోపల్లోపల భయంగానే ఉంది నాకు. కానీ వాడు సామాన్యుడు కాదు కదా, అందుకే రాముడు మంచిబాలుడిలాగా ఆయన పట్ల ఎక్కడ లేని సానుభూతీ చూపిస్తూ కాలికి ఆవనూనె తెచ్చిచ్చాడు. వాడిచ్చేదాకా ఆవనూనె నొప్పులకి మంచిదనే విషయం ఆయనక్కూడా తెలీదట. ఆ విషయం చెబుతూ వాణ్ణి చూసి ఎంతగా మురిసిపోయాడో!!
చూశారా? నేను శర్మగారికి సర్‌ప్రైజివ్వాలనుకున్నాను. ఆ విషయం వాడితో అనలేదు. అయినా నా మనసులోని మాట చిటికెలో గ్రహించేశాడు. ఆయనకి దిమ్మతిరిగిపోయే సర్‌ప్రైజిచ్చేశాడు. అదే వాడి ప్రత్యేకత. బడిలో కూడా అంతే. మేస్టర్లు చెప్పిన మంచి పనుల్ని నిజ జీవితంలో ఆచరించి చూపించే బుద్ధిమంతుడు. వాడు కొత్తగా చేరిన బడి ఔత్తరాహ్యులది. పెద్దలు కనిపిస్తే చాలు, వారికి పాదాభివందనం చెయ్యడం వాళ్ళ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని వాడు పాటించాడు. వాడు ఆ సంప్రదాయంతో ఆయనకి సర్‌ప్రైజిస్తున్న విషయం పాపం శర్మగారు ఊహించలేకపోయారు. అందుకే ఈ తంటాలు.
చింటూకి ఈ స్కూలు ఆరోది. అంతకు ముందు ఐదేళ్ళలోనూ ఐదు స్కూళ్ళు మారాడు. అలా మారడం వల్ల వాడికి నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అయింది. కానీ గిట్టనివాళ్ళు మాత్రం వాడి అల్లరి తట్టుకోలేక ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు వాడిని తరిమేశాయని ప్రచారం చేస్తూంటారు. వాళ్ళ అక్కసు వాళ్ళది..
మా వాడి తెలితేటల గురించి నేను చెబితే అది గొప్పలు చెప్పుకున్నట్టవుతుంది. అదే శర్మగారు స్వయంగా తెలుసుకునేలా చేస్తే? అప్పుడాయనక్కూడా వాడి గొప్పదనం అర్థమౌతుంది.
అందుకే, ''నువ్వెందుకు పాదాభివందనం చేశావో శర్మగారికి చెప్పరా'' అన్నాను.
''మా కొత్తస్కూల్లో నేర్పిన ఫస్ట్ మోరల్ అదే''
''మరలా కాళ్ళకి దణ్ణాలు పెట్టడం నీకిష్టమేనా?''
''మనం దణ్ణాలు పెట్టించుకునే లెవెల్‌కి డెవలప్పవ్వాలేగానీ, దణ్ణాలు పెట్టే స్టేజీలో ఉండకూడదు''
''వాడి సమాధానంలో ఎంతటి ఆత్మాభిమానం ఉందో చూశారా?'' అని అడగ్గానే శర్మగారు ఏం మాట్లాడాలో తెలియక మాటలు తడుముకున్నాడు. ఆనక చింటూగాడిని మంచినీళ్ళు తెమ్మని లోపలకి పంపించాడు.
''అందరూ దణ్ణాలు పెట్టించుకునే స్టేజిలోనే ఉంటే పెట్టేవాళ్ళెవరుంటారు? వాడికి వాళ్ళ మేస్టారు చెప్పిన పని చెయ్యాలనిపించింది. చేస్తున్నాడు. చెయ్యనివ్వండి. ఎందుకు చేస్తున్నావని అడిగితే వాడిలో సెకండ్ థాట్ తలెత్తుతుంది. అప్పుడు వాడు ఆ సెకండ్ థాట్ గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. ఫలితంగా స్కూల్లో మేస్టర్లు పాఠాలు చెబుతూంటే వీడు ఆ పాఠాలకి సంబంధించిన సెకండ్ థాట్స్ గురించి ఆలోచిస్తూంటాడు. దాంతో తను ఎక్కడో పాఠం చెబుతుంటే వీడింకెక్కడో ఆలోచిస్తున్నాడని మేస్టర్లకి మండుతుంది. వీడికి పనిష్మెంటివ్వడంతో క్లాసు ముగుస్తుంది. ఇప్పుడు మీరిచ్చిన సెకండ్ థాట్ వల్ల వీడిలో తన మేస్టర్లు తనకి ఇష్టంలేని పనులు చేయిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతుంది. అది మేస్టర్ల పట్ల చులకన భావాన్ని ఏర్పరుస్తుంది. పిల్లల్ని చెడగొట్టడానికి ఇంత తెలివి ఉపయోగించడం అవసరమా?'' అంటూండగానే వాడు మంచినీళ్ళు తేవడం ఈయన మాటలు ఆపెయ్యడం జరిగిపోయాయి.
అయినా నాకు తెలీక అడుగుతానూ, దేనిగురించైనా అన్ని కోణాల్లోంచీ ఆలోచించేలా చెయ్యడానికేగా చదువు? మరీయనేంటి, సెకండ్ థాట్ పాడుచేస్తుందంటాడు?
- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి,
9440037258