Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెచ్‌ఐవీ/ ఎయిడ్స్.. యావత్ ప్రపంచాన్ని వణికించిన, కుదిపేస్తున్న వ్యాధి. ఇప్పటి వరకూ కచ్చితమైన చికిత్స లేని ఈ ప్రమాదకర వైరస్ నివారణ, నియంత్రణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వందలాది ఎన్జీవోలు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై అనేక రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టకపోతే.. 2030 నాటికి రోజుకు 80 మంది యుక్త వయస్సు ఉన్నవారు ఈ మహమ్మారికి బలవ్వాల్సిందేనని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఎయిడ్స్ మరణాలు, కొత్త ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే ఈ తగ్గింపులో అంత వేగం కనిపించడం లేదు. హెచ్‌ఐవీ సోకిన బాలల్లో సగం మంది ఐదేళ్లు నిండకుండానే మరణిస్తున్నారు.
అవగాహన అంతంతే...
డిసెంబర్ ఒకటిన ప్రతీ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ మహమ్మారి పట్ల సమాజంలో ఉన్న అవగాహన అంతంత మాత్రమే. ఎయిడ్స్ వ్యాధిపై సమాజంలో ఇంకా సరైన చైతన్యం లేదంటున్నాయి గణాంకాలు. ఇందుకు నిదర్శనం భారత్‌లో 19 ఏళ్లలోపు యువత , బాలలు సుమారు కోటి లక్షా 20వేలమంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమతి తెలిపింది.
2030 నివేదిక...
'చిల్డ్రన్,హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ద వరల్డ్ ఇన్ 2030 ' పేరిట యూనిసెఫ్ ఓ నివేదిక విడుదల చేసింది. తల్లులు, గర్భిణులు, యువత, పిల్లల్లో హెచ్‌ఐవీ ముప్పులను తగ్గించడంలో దక్షిణాసియాలోని గణనీయ పురోగతి కనిపిస్తుంది. భారత్‌లో 2017లో 1,20,000 మంది చిన్నారులు, యుక్తవయస్కులు హెచ్‌ఐవీతో జీవిస్తున్నారు. ఇక పాకిస్థాన్‌లో 5,800 మంది, నేపాల్‌లో 1,600 మంది, బంగ్లాదేశ్‌లో వెయ్యి కంటే తక్కువ మంది హెచ్‌ఐవీ బాలలున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా...
2017లో కొత్తగా హెచ్‌ఐవీ సోకిన ఐదేళ్లలోపు బాలల సంఖ్య 2010తో పోలిస్తే 43 శాతం తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఇది 35 శాతం వరకు తగ్గింది. యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) చికిత్స తీసుకుంటున్న 14ఏళ్లలోపు బాలల సంఖ్య మొత్తం బాధితుల్లో 73 శాతం వరకూ ఉంది. ఇది 2010తో పోలిస్తే 50 శాతం వరకూ పెరిగింది. ఎయిడ్స్ మరణాలు, కొత్త ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య తగ్గుతున్నది. అయితే ఈ తగ్గింపులో అంత వేగం కనిపించడం లేదు.
బాధితులు బాలికలే...
హెచ్‌ఐవీ సోకిన బాలల్లో సగం మంది ఐదేళ్లు నిండకుండానే మరణిస్తున్నారు. తల్లుల నుంచి పిల్లలకు హెచ్‌ఐవీ సంక్రమించకుండా నిరోధించే చికిత్సలు అనుకున్న స్థాయిలో లక్ష్యాలు చేరుకోవట్లేదని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కింది. తల్లుల నుంచి పిల్లలకు హెచ్‌ఐవీ సోకిన కేసులు గత ఎనిమిదేళ్లలో 40 శాతం వరకూ తగ్గాయి. ఇలాంటి కేసుల్లో మూడింట రెండు శాతం బాధితులు బాలికలే ఉన్నారని రిపోర్ట్‌లో వెల్లడించింది. మూడు దశాబ్దాల కిందట ఎయిడ్స్ మాట వింటే గుండెల్లో వణుకు పుట్టేది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి వ్యాపించే మార్గాలు, ఎయిడ్స్ వైరస్‌ను నియంత్రించే ఎఆర్‌టి మందుల ఆవిష్కరణతో ఈ భయం పోయిందనే చెప్పొచ్చు.
నివారణ పట్ల అవగాహన...
ఆస్తమా, మధుమేహం మాదిరిగానే ఎయిడ్స్ కూడా దీర్ఘకాలిక వ్యాధిగా రూపాంతరం చెందడం గమనార్హం. ఎయిడ్స్ తొలి కేసు 1981లో అమెరికాలో నమోదైనప్పటికీ.. భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ నేటికి కూడా చర్చగానే మిగిలిపోయింది. ఇప్పటికే ఎయిడ్స్ వ్యాధిపై చాలామందిలో సరైన అవగాహన లేదనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ వ్యాధి నివారణ పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికే ఎప్పటికప్పుడు కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
- రూప