Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ
- ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై చర్చ
- ఐక్యంగా ఉండాలని నేతలకు హితవు
- విడిగా కేటీఆర్‌ను కలిసిన తుమ్మల
- తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్‌ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఇటీవల అధికార పార్టీలో చోటుచేసు కుంటున్న పరిణా మాలపై కూలంకషంగా చర్చించారు. ఖమ్మం, నల్ల గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించాలని దిశానిర్దేశం చేశారు. జమిలి ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎన్నికలేవైనా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని హితోపదేశం చేశారు.
ఎమ్మెల్యేలు ఉంటారు...పోతారు...!
ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారని...పద్ధతి మార్చుకోవాలని క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. ''ఎమ్మెల్యేలు ఉంటారు.. పోతారు.. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండటం అవసరం. పార్టీ నాయకులంతా సమన్వయం చేసుకోవాలి. కొత్త, పాత అందర్నీ కలుపుకుని పోవాలి. కార్యకర్తలపై ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించడం.. పార్టీలో గ్రూపులు చేయడం...మంచిది కాదు'' అని ఎమ్మెల్యేలకు హితోపదేశం చేసినట్లు తెలిసింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం వేంసూరు మండల పర్యటనలో ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకునే కేటీఆర్ ఈ రకంగా మాట్లాడి ఉంటారని.. ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ''ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి బాస్‌లంటే అందర్నీ కలుపుకు పోవడంలో తప్ప... కార్యకర్తలను అణచివేసే విషయంలో కాదు... కార్యకర్తల ఆవేదనను ఎవరో ఒక్కరు బయటకు చెప్పాలి...బహుషా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ విధంగా చెప్పి ఉంటారు. దాన్ని సదుద్దేశంతో తీసుకోవాలి' అని కేటీఆర్ సూచించినట్లు సమాచారం. సమావేశంలో భాగంగా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు నివేదించారు. చేసిన పనులతో పాటు చేయాల్సిన పనులనూ దానిలో పొందుపరిచారు.
ఆ రెండు ఆసక్తికరం...
ఈ భేటీలో భాగంగా రెండు అంశాలపై ఆసక్తిరేకెత్తింది. ఒకటి పొంగులేటి విషయంలోనైతే...రెండోది కేటీఆర్‌తో మాజీ మంత్రి తుమ్మల జిల్లా నేతలతో కాకుండా విడిగా సమావేశం అవ్వడం. సుమారు పది నిమిషాల పాటు యువనేత కేటీఆర్, మాజీ మంత్రి తుమ్మల మధ్య ఏకాంత చర్చలపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. పాలేరుతో పాటు ఇతర నియోజకవర్గాల్లో తన అనుచరులకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని తుమ్మల, కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు. సమావేశం ముగిశాక కూడా నేతలందరూ ప్రగతి భవన్‌ను వీడినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి తుమ్మల మాత్రం చాలా సమయం లోపలే ఉండటంతో కేటీఆర్ వీరితో ప్రత్యేకంగా చర్చించినట్లు చెబుతున్నారు.
అజయ్ అందర్నీ సమన్వయం చేస్తారు...
''ఉమ్మడి జిల్లా మంత్రిగా పువ్వాడ అజరుకుమార్ రెండు జిల్లాల నేతలను సమన్వయం చేస్తారు. అందరం ఐక్యంగా కలిసి పనిచేద్దాం. పార్టీని ముందుకు తీసుకెళ్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కారణాలతో ఉమ్మడి జిల్లాలోని పదింట ఒక్క నియోజకవర్గంలోనే మన పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అలా కాకుండా చూసుకోవాలి. సంఘటితంగా పనిచేసి పార్టీని గెలిపించాలి. పాత, కొత్త నేతలందరూ ఐక్యంగా ఉండాలి.' అని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మొత్తంగా ఈ భేటీలో కేటీఆర్ పూర్తి సంయమనంతో...'నొప్పించక తానొవ్వక' అనే రీతిలో వ్యవహరించినట్లు తెలుస్తోంది. రెండుగంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు, బాణోత్ హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌లు లింగాల కమలరాజ్, కోరం కనకయ్య, నగర మేయర్ పాపాలాల్, ఆయా మున్సిపాల్టీల చైర్మన్‌లు, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌లు, ఆయా నియోజకవర్గ ముఖ్యనేతలు మొత్తం సుమారు 40 మంది వరకు పాల్గొన్నారు.