Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
జాయింట్ లయబిలిటీ గ్రూపులపై (జేఎల్‌జీ) సత్తుపల్లి సహకార బ్యాంకు అధిక వడ్డీలతో రుణ గ్రహీతలను ఆందోళనకు గురిచేయడమే గాక రికవరీల కోసం వెళ్లే బ్యాంకు సిబ్బంది ఇంట్లో సామాన్లను బయట పడేసి పరువు తీస్తోంది. బ్యాంకు పరిధిలో 600 గ్రూపులకు జేఎల్‌జీ పథకం ద్వారా రూ. 50వేలు చొప్పున రుణాలను 2015లో అందజేశారు. రుణాలు ఇచ్చే సమయంలో వడ్డీలేని రుణాలు చెప్పిన బ్యాంకు అధికారులు ఇప్పుడేమో అధిక వడ్డీలు వేసి మరీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ రుణ గ్రహీతలు లబోదిబోమంటున్నారు.
ఉదాహరణకు సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన బతుకమ్మ గ్రూపుకు రూ. 50వేలు రుణం అందించారు. అయితే ఈ గ్రూపు సభ్యులు రూ. 44వేలు జమచేయగా ఇంక రూ. 5,500 కట్టాల్సి ఉండగా రూ. 41,500 కట్టాలంటూ బ్యాంకు వారు నోటీసులు అందించారు. అలాగే సిద్దారంనకు చెందిన ప్రభు గ్రూపుకు రూ. 50 వేలు రుణం ఇవ్వగా రూ. 37,500 జమ కాగా రూ. 12,500 కట్టాల్సి ఉండగా మరో 50వేలు కట్టాలంటూ బ్యాంకు నోటీసులు అందించింది. ఇదే గ్రామంలో గౌరి గ్రూపుకు ఇచ్చిన రుణం రూ. 50వేలు, రూ. 41వేలు జమకాగా ఇంకనూ రూ. 9వేలు కట్టాల్సి ఉండగా రూ. 44వేలు కట్టాలంటూ బ్యాంకు వారు వత్తిడి తీసుకుకొస్తున్నారు. ఇదే కోవలో గణపతి గ్రూపు రూ. 36వేలు కట్టగా రూ. 13,500 గాను రూ. 50వేలు కట్టాలంటూ నోటీసులు అందించారు. ఇదే లెక్కన రుణాలు అందించిన అన్ని గ్రూపులకు కూడా అధిక వడ్డీలు వేసి బలవంతపు వసూళ్లకు బ్యాంకు సిబ్బంది రంగం సిద్దం చేసింది. ప్రస్తుతానికి సిద్దారం, గౌరిగూడెం ప్రాంతాల్లో డీసీసీబీ సత్తుపల్లి సిబ్బంది రుణ వసూళ్ల కోసం ఇంట్లో ఉన్న పెట్టేబేడా బయటవేసే పనిలో ఉంది. ఈ గ్రామాల్లో వసూళ్ల కార్యక్రమం అయ్యాక మిగతా గ్రామాలపై డీసీసీబీ సిబ్బంది బలవంతపు వసూళ్ల కోసం రుణ గ్రహీతలను బజారుకు ఈడ్చడానికి రంగం సిద్దం చేసిందని తెలుస్తోంది. ఈ విషయమై డీసీసీబీ బ్యాంకు మేనేజర్ జె.నందన్‌కుమార్‌ను 'నవతెలంగాణ' ప్రతినిధి వివరణ కోరగా వన్‌టైం సెటిల్‌మెంట్‌కు వచ్చే రుణ గ్రహీతలకు 7శాతం వడ్డీతో ఖాతా మూసి వేయడం జరుగుతుందని వివరించారు. అధిక వడ్డీలు పడ్డ వారివి జరిచేయడం జరుగుతుందన్నారు.
డీసీసీబీ బ్యాంకు ఎదుట జేఎల్‌జీ గ్రూపు సభ్యులు ధర్నా...
అధిక వడ్డీలు వేసి బలవంతపు వసూళ్లకు సత్తుపల్లి డీసీసీబీ పాల్పడుతందంటూ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం స్థానిక డీసీసీబీ బ్యాంకు ముందు రుణ గ్రహీతలు ధర్నా చేశారు. వడ్డీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : తోటకూర శ్రీనివాసరావు, చిలకా సాంబశివరావు, బతుకమ్మ గ్రూపు, గౌరిగూడెం
మా గ్రూపుకు రూ. 50వేలు ఇచ్చారు. రూ. 44,500 జమచేయడం జరిగింది. మేము ఇంకా రూ. 5,500 జమ చేయాల్సి ఉంది. కాని బ్యాంకు అధికారులు మాత్రం అధిక వడ్డీలు వేసి మమ్మల్ని ఇంకా రూ. 41వేలు కట్టాలంటూ ఇండ్లకు వచ్చి సామాన్లు బయటపడేసి పరువు తీస్తున్నారు. వడ్డీ లేకుండా ఇచ్చిన డబ్బులు మాత్రమే కడతాం.
వడ్డీలు రద్దు చేయాలి : తోటకూర రమేశ్, ఎలగం రాములు, ప్రభు గ్రూపు, సిద్దారం
వడ్డీలేని రుణాలని చెప్పి ఇప్పుడేమో అధిక వడ్డీలతో ఇబ్బంది పెడుతున్నారు. ఎంత రుణమైతే ఇచ్చారో అంత వరకే వసూలు చేయాలి. ఈధిక వడ్డీలు వేస్తే మేం అంగీకరించడం. వేసిన వడ్డీని రద్దు చేయాలి. బలవంతపు వసూళ్లకు పాల్పడవద్దు.
వడ్డీలేకుండా అసలు వసూలు చేయాలి :అల్లం వెంకటేశ్వర్లు, తోటకూర సోములు, గౌరి గ్రూపు, సిద్దారం
వడ్డీ లేకుండా ఇచ్చిన అప్పును మాత్రమే కట్టించుకోవాలి. మొదట్లో వడ్డీలేని రుణాలన్నారు. ఇప్పుడేమే అధిక వడ్డీలు ఎందుకు వేయాల్సి వచ్చింది. వెంటనే అధిక వడ్డీలను రద్దు చేసి అసలు కట్టించుకుంటే అవి కట్టడానికి మేం సిద్దంగా ఉన్నాం.
వడ్డీ లేకుండా ఇచ్చిన రుణాలను జమచేసుకోవాలి :జాజిరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి, సీపీఐ(ఎం) సత్తుపల్లి
జేఎల్‌జీ గ్రూపులకు ఇచ్చిన రుణాలను వడ్డీ లేకుండా ఇచ్చిన రుణాన్ని మాత్రమే వసూలు చేయాలి. వడ్డీలేని రుణాలంటూ ఇచ్చి ఇప్పుడేమో అధికంగా వడ్డీలు వేసి పేద ప్రజలను డీసీసీబీ ఆందోళనకు గురిచేస్తోంది. బలవంతపు వసూళ్లకు పాల్పడితే బ్యాంకు ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.