Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగు మందు తాగుతూ జేసీబీలకు అడ్డుగా నిలిచిన పోడు రైతు
- కోర్టు స్టేలు, మండల పరిషత్ తీర్మానం, రైతు బంధు మంజూరైనా ఆగని వేధింపులు
- కుటుంబాలను రోడ్డున పడేయకండి : ఎంపీటీసీ, ఎన్‌డీ నేత బిచ్చా
- 2005 కంటే ముందున్న పోడు జోలికి వెళ్ళడంలేదు : రేంజర్
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని కొమరారం పోడు భూముల్లో అటవీ అధికారులు, సిబ్బంది గురువారం దొంగ దొడ్ల ఏరియాలో ప్రొక్లైన్స్‌తో ట్రెంచ్‌లు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోడు రైతులు భూక్య హశ్య, బానోత్ రమేష్, మల్లెల కృష్ణ, బానోత్ పడితి, పాపయ్య, జాటోత్ రమేష్‌లు అడ్డుకున్నారు. ఇందులో భూక్య హశ్య ట్రెంచ్‌లో దిగి ప్రొక్లైన్‌కు అడ్డుగా ఉండి పురుగు మందు తాగడానికి ప్రయత్నించాడు. దీంతో కొందరు పోడు దారులు అడ్డుకుని పైకిలాగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొమరారంలో 101 మంది పోడు రైతులు సుమారు 500 ఎకరాల్లో పోడు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తరచూ అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తుండటంతో 2016 నుండి తమకు న్యాయం చేయాలని హైకోర్టుకు వెళ్ళామని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ దాడులు చేయడం సరికాదని అటవీ అధికారులు, సిబ్బందికి మొర పెట్టుకున్నారు. మూడు విభాగాలుగా మొత్తం 101 మంది కోర్టుకు వెళ్ళామని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కేసు ఫిబ్రవరి 8న విచారణ చేయనుంది. పంటలు పండించుకుని కుటుంబాలను పోషించు కుంటున్నామని వేడుకున్నారు. ప్రభుత్వం కూడ రైతు బంధు మంజూరు చేసింది. దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న భూముల్లో ట్రెంచ్‌లు (కందకాలు) తీయడం సరికా దన్నారు. తమకు ఏ ఆధారం లేదని భూమిని నమ్ముకుని జీవిస్తున్నా మని అధికారులకు, సిబ్బందికి మొర పెట్టుకు న్నారు. 2016లోనే హైకోర్టులో కేసు వేశామని కోర్డు భూమి మీది కాదని తీర్పు ఇస్తే విదిలేస్తామన్నారు. రెండు రోజులు చూస్తా మని ఆధారాలు చూపించి సమస్య పరిష్కరించు కోవాలని రేంజర్ రవి కిరణ్ తెలుపుతూ ట్రెంచ్‌లు నిలిపివేశారు.
కుటుంబాలను రోడ్డున పడేయకండి : ఎంపీటీసీ, ఎన్‌డీ నేత బిచ్చా
పోడు భూములకు ప్రభుత్వం రైతు బంధు మంజూరు చేసింది.భూములకు హైకోర్టు స్టే ఇచ్చింది. మండల పరిషత్ సైతం పోడు జోలికి వెళ్ళద్దని తీర్మాణం చేసింది.అయినప్పటికీ ఇల్లందు మండల అటవీ అధికారులు సిబ్బంది తరచూ పోడు భూములపై ట్రెంచ్‌లు ఏర్పాటు చేయడం సరికాదని ఎన్‌డీ నేత, కొమరారం మాజీ సర్పంచ్, ప్రస్తుత ఎంపీటీసీ అజ్మీర బిచ్చా అన్నారు. గురువారం మండల పరిషత్‌లో సర్పంచ్‌లు,ఎంపీటీసీ సమావేశం ఉందని ప్రజా ప్రతినిధులు, పోడు రైతులు లేని సమయం చూసుకుని ప్రొక్లైన్ తెచ్చి కందకాలు తీయడం సరికాద న్నారు. పోడు రైతులను రోడ్డున పడేయవద్దన్నారు. తమ వద్ద పూర్తి అధారాలు, కోర్టు స్టేలు ఉన్నప్పటికీ వాటికి సం బంధించిన పత్రాలు రేంజర్‌కు ఇచ్చినప్పటికీ పట్టించు కోకుండా కందకాల్లో పడేశారని అన్నారు. ఇది దారణమని ఇప్పటికైనా స్టే ఉన్న భూముల జోలికి వెళ్లవద్దని కోరారు.
2005 కంటే ముందున్న పోడు జోలికి వెళ్ళడం లేదు : రేంజర్
కోమరారంలోని దొంగ దొడ్ల ఏరియాలో పోడు భూముల్లో ట్రెంచ్‌లు వేస్తున్న విషయమై రేంజర్ రవి కిరణ్‌ను నవతెలంగాణ వివరణ కోరింది. స్పందించారు. 2005 కంటే ముందున్న పోడు జోలికి వెళ్ళడంలేదన్నారు. కోర్టు స్టే ఇచ్చిన భూములు ఇక్కడివి కావన్నారు. ఎక్కడి భూములవో ఇక్కడ చూపెడుతున్నారని అన్నారు. ట్రెంచ్‌లు వేసేది 60ఎకరాల్లో పోడు దారులు చెబుతున్నవి 500 ఎకరాలు ఇంత భూమి ఎక్కడిదన్నారు. 2005 తరువాత పోడు భూములను లాక్కుంటాం. అక్రయ పోడులోనే ట్రెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కొక్కరికి బీనామి పేర్లతో సాగు చేసుకుంటున్నారు వారికి మరో చోట సైతం భూములు ఉన్నాయన్నారు. ఆర్‌ఓ ఎఫ్‌ఆర్ చట్టాలలో ఉన్న లొసుగుల ఆధారంగా పోడు భూములను ఆక్రమించుకుంటున్నారని అన్నారు. పక్కాగా ఉన్న ఆర్‌ఓ ఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న రైతుల జోలికి వెళ్ళడం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నట్లు తెలిపారు.