Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిఆర్‌పిఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
మధిరఅర్భన్ : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని ఆదివారం మధిరలో జరిగిన పిఆర్‌పిఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తోందని, చిన్ని చిన్న కళాశాలలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించని ఎడల మండల కేంద్రాల్లో ఉండే కళాశాలలకు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం చూపి ఆదుకోవాలని కళాశాలల యజమానులు కోరుతున్నారు.
ప్రభుత్వ విధానాలతో ప్రైవేటు విద్యా సంస్థలకు తీవ్ర నష్టం ః కరివేద వెంకటేశ్వరరావు (సుశీల విద్యా సంస్థల అధినేత-మధిర)
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రైవేటు విద్యా సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోతున్నారు. దీంతో మండల కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న కళాశాలల్లో సిబ్బందికి జీతాలు చెల్లించలేక మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే అక్షరాస్యతల్లో వెనుకబడి ఉన్నాం, ప్రభుత్వ విధానాలతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు మరిత విద్యకు దూరమయ్యే అవకాశముంది.
కార్పొరేటుకు ధీటుగా విద్యను అందిస్తున్నాంః గుర్రం శ్రీకాంత్ (భరత్ జూనియర్ కళాశాల అధినేత-మధిర)
కార్పొరేట్‌కు దీటుగా మారుమూల ఉన్న చిన్న చిన్న కళాశాలలకు కూడా విద్యను అందిస్తున్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చదువులు చెపుతూ ర్యాంకులను అందిస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా గ్రామీణప్రాంత విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు నేటి పాలకులు.
సింఎం పాలన పిచ్చివాడి చేతిలో రాయిలా మారింది ః శీలం వెంకటరెడ్డి (భరత్ విద్యా సంస్థల అధినేత-మధిర)
సిఎం పరిపాలన పిచ్చివాడి చేతిలో రాయిలా ఉంది. విద్యార్థులకు చదువులను చేస్తున్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు, చదువులు బాగుపడతాయని ఉద్యమాలు చేసిన విద్యార్థులకు కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం ధారుణం. విద్యార్థులే భవిష్యత్‌లో సిఎంకు తెలంగాణ ఉద్యమ తీరులోనే ఫీజులపై పోరాడుతారు.
పేదలకు విద్య అందే పరిస్థితి లేదు ః బి. అంజన్‌బాబు (శ్రీనిధి విద్యా సంస్థల అధినేత-మధిర)
పేదలకు విద్య అందే పరిస్థితి లేదు. చిన్న చిన్న విద్యా సంస్థల వారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉంటూ వారి శ్రమను అందిస్తూ విద్యా సంస్థలను నడుపుతున్నారు. అలాంటి విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందక మూతబడే పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారుతోంది.
పనికిరాని వాటికోసం దుబారా ఖర్చు ః అమరనేని అప్పారావు (మోడరన్ విద్యా సంస్థల అధినేత-మధిర)
ప్రభుత్వం పనికిరాని వాటికోసం దుబారా ఖర్చు చేస్తోంది. దేశ భవిష్యత్ విద్యార్థులపైనే ఆదారపడి ఉన్నా, అలాంటి వారికోసం ప్రభుత్వం చేసేది ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి కంటిలో నలుసులా ప్రవర్తిస్తోంది. విద్యార్థుల పీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసి అటు విద్యార్థులను, ఇటు కళాశాలలను కాపాడాలి.