Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలుపు తీస్తే ఇల్లు గుల్ల
- బయటికెళ్తె గుంపుగా దాడి
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
పట్టణంలోని పలు కాలనీల్లో కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. భద్రాచలం పట్టణంలోని రెవెన్యూ, అశోక్‌నగర్, వెంకటేశ్వర కాలనీ తదితర కాలనీల్లో కోతుల బెదడ విపరీతంగా ఉంది. వీటి వల్ల ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి బయట పప్పు ధాన్యాలు వంటివి ఎండలో ఆరబెట్టడానికి వీలు లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండి తలుపులు తెరిచి ఉంటే చాలు వెంటనే ఇంట్లోకి చొరబడి ఇంట్లో అందిన కాడికి చిందరవందర చేస్తుంది. కొన్ని సమయాల్లో తలుపులు దగ్గరకు వేసిన వాటిని నెట్టి లోపలికి వచ్చేస్తున్నాయి. వాటిని తరమడానికి వెళ్తే మీదకు ఎగబడుతున్నాయి. అశోక్‌కాలనీలో కోతులు ఇంటిపై కప్పు నుండి ఎగరడం, చెట్లు, పూలు, పండ్ల చెట్లను నాశనం చేస్తున్నాయి. కొన్ని ఇళ్లల్లో మంచినీటి పంపులను నాశనం చేస్తున్నాయి. రేకుల ఇళ్లుపై ఎగరడంతో రేకులు పగిలిపోతున్నాయి. కోతుల బెడదను నిర్మూలించాలని గ్రామప్రంచాయతీ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
దుకాణాలు మూసుకోవాల్సి వస్తోంది : వెంకటేశ్వరరావు, అశోక్‌నగర్ కాలనీ : నాగలక్ష్మి
మాది కిరాణాషాపు. ఈ కోతుల భయంతో షాపును రోజుకు గంట సేపు మాత్రమే తెరుస్తున్నాం. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి షాపులోకి చొరబడు తున్నాయి. షాపులోని అన్ని వస్తువులను చింద రవందరగా చేస్తున్నాయి. ఈ భయంతో షాపు మూసుకొని ఇంట్లోనే కూర్చొవాల్సిన పరిస్థితి నెలకొంది. కోతులను తరమడానికి వెళితే ఒక్కసారిగా కోతుల గుంపు చుట్టుముట్టడంతో ప్రాణం పోయినంత పనైంది. దీంతో గట్టిగా అరిచేసరికి చుట్టుప్రక్కల వారు వచ్చి కోతులను వెళ్ళగొట్టారు.