Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారత రాజ్యాంగంపై విద్యార్థులు తప్పని సరిగా అవగాహన పెంచుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సహకారంతో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనను శనివారం కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో కే.సత్య ప్రసాద్‌రామ్ అధ్యక్షత వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో రాణించాలంటే పాఠ్య పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని, ప్రపంచ, దేశ చరిత్రలనూ చదవాలని కలెక్టర్ అన్నారు. గాంధీ, అంబేద్కర్, మలాల వంటి వారి జీవిత చరిత్రలను చదవాలని, నెలకు ఒక పుస్తకర అయినా చదవాలని, ప్రపంచ జ్ఞానాన్ని పెంపొందిం చుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించే వారు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. ఒకే రోజు 51 ప్రభుత్వ జూనియర్, కస్తూర్బా కళాశాలల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 40వేల పుస్తకాలు ప్రభుత్వ సంస్థల్లోకి చేర్చామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మేయర్ డాక్టర్ పాపాలాల్ మాట్లాడుతూ కలెక్టర్ చేస్తున్న పుస్తక యజ్ఞాన్ని బలపరుస్తామన్నారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి కదుల రఘుబాబు మాట్లాడుతూ వ్యక్తి వికాసం పుస్తకాల ద్వారానే సాధ్యమని తెలిపారు. అనంతరం భారతదేశంలో శాస్త్ర-సాంకేతికత పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, కార్పొరేటర్ బాల గంగాధర్ తిలక్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.