Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లుగా పెరగని మద్దతు ధరలు
- రవాణాకే అధిక మొత్తం ఖర్చు
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 వేల మంది రైతులు
- నేడు నేలకొండపల్లిలో రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అష్టకష్టాలు పడి చెరుకు పండించిన రైతుల బతుకులు పాలకుల పుణ్యమాని చేదెక్కుతున్నాయి. సుమారు రెండేండ్లుగా చెరకుకు మద్దతు ధర పెరగకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 వేల మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరతో పాటు రవాణా, కటింగ్ ఖర్చులు పెరగడంతో నానాటికీ చెరకు సాగు తగ్గిపోతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో చెరకు రైతులు మరింతగా కష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో చెరుకు రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయి ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
చెరుకు సాగు చేస్తున్న రైతులకు గత రెండేండ్ల కిందట (2016-17) కాలంలో ఉన్న మద్దతు ధర టన్ను చెరుకు రూ. 2,850లు మాత్రమే చెల్లించేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు పెరిగాయి. గతంలో టన్ను చెరుకు నరికితే కూలీలకు రూ.300నుండి రూ.400వరకూ చెల్లించేవారు. కానీ నేడు అదే టన్ను చెరుకు నరికినందుకు గాను రూ.400నుండి రూ.600వరకూ పెరిగింది. ఈ నేపథ్యంలో చెరుకు నరికినందుకూ, రవాణా చేసినందుకే ఎక్కువ మెత్తంలో రైతులు కోల్పోతు న్నారు. కానీ రెండేండ్లుగా ఈ ధరలు పెరిగినా మద్దతు ధరను పెంచడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో చెరుకుసాగు నానాటికీ తగ్గుతోంది.
ప్రోత్సాహం లేక తగ్గుతున్న సాగు...
గతంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చెరుకు సాగు విపరీతంగానే ఉండేది. కానీ ఇటీవల చెరుకు సాగుకు ప్రభుత్వాల నుంచి అంతగా ప్రోత్సాహకాలు లేకపోవడంతో నానాటికీ చెరుకు సాగు తగ్గుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నేలకొండపల్లి, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, కొణిజర్ల, వైరా, తల్లాడ, మధిర, ఎర్రుపాలెం, జూలూరుపాడు, కొత్తగూడెం, కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తదితర ప్రాంతాల్లో చెరుకు సాగు ఉండేది. కానీ నేడు ఆస్థాయిలో సాగులేదు. గతంలో కల్లూరులోని కాకతీయ షుగర్ పరిశ్రమలో ఏడాదికిగాను 2.40లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌కు వస్తే అదే నేడు కేవలం 40 వేల టన్నుల చెరుకు మాత్రమే క్రషింగ్‌కు వస్తోందని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. మధుకాన్ షుగర్ పరిశ్రమలో ఏడాదికి గాను 2లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ చేస్తే ఇప్పుడది 1.40లక్షల టన్నుల క్రషింగ్‌కు తగ్గిపోవడమే ఇందుకు సాక్ష్యమని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని కల్లూరు, నేలకొండపల్లి మండలాల్లో చెరుకు పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లో ప్రస్తుతం బఫర్‌స్టాక్ పెరుగుతోందని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.
అంతర్జాతీయ వ్యవసాయ ఒప్పందాల ఫలితమే- బొంతురాంబాబు-చెరుకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
అంతర్జాతీయంగా వ్యవసాయ ఒప్పందాల వల్ల ఏర్పడిన ప్రతిష్టంభన, ప్రభావం ఫలితంగానే చెరుకు సాగుకు ఈ ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలే కష్టాల్లో ఉన్న చెరుకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ముందుకు రాకపోవడంతో మరింతగా నష్టాలపాలవుతున్నారు. ఫలితంగా చెరుకుసాగు సంక్షోభంలో పడింది.