Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురంహవేలి
రోడ్ల వెంట ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చేపడుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఖమ్మం నగరంలో గురువారం కలెక్టర్, సీపీ తప్సీర్‌ఇక్బాల్, మేయర్ పాపాలాల్, నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి కలిసి నగరంలో సైకిళ్లపై పర్యటించి, సమస్యలను పరిశీలించారు. కాల్వొడ్డులోని నయాబజార్ పాఠశాల నుంచి బైపాస్ రోడ్ లోని శ్రీశ్రీ విగ్రహం వరకు సైకిళ్లపై పర్యటించి ట్రాఫిక్ సమస్య, డ్రయినేజ్, రోడ్డువెడల్పు, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్ సిగల్స్ ఏర్పాటు తదితర పనులపై తగు ఆదేశాలు చేశారు. ప్రధానంగా మయూరి సెంటర్ నుంచి జిల్లా పరిషత్ వరకు ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున రోడ్లపై ఉన్న ఆక్రమణలను సత్వరమే తొలగించాలని కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన రహదారి ప్రాంతంలో నూతన నిర్మాణాలు చేపడుతున్న వారు తప్పనిసరిగా ట్రాఫిక్ క్లియరెన్స్ లైసెన్స్ పొందాలని తెలిపారు. రోడ్లపై పార్కింగ్ లేకుండా సెల్లార్‌లలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈలు రంగారావు, శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, టౌన్ ఏసీపీ గణేష్, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.