Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలేజీలో ఏ సర్టిఫికేట్ కావాలన్నా ముందు గుర్తుకొచ్చేది అడ్మినిస్ట్రేషన్. ఒక కాలేజీ నడవడానికి బోధనా సిబ్బంది ఎంత ముఖ్యమో బోధనేతర సిబ్బంది కూడా అంతే ముఖ్యం. కాని ప్రస్తుతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధనేతర సిబ్బంది అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి సమస్యకు కోర్టుల చుట్టూ తిరగవల్సి వస్తుంది. నెల నెలా జీతం, గ్రాట్యూటీ, ఉద్యోగ భద్రత, కాస్త జీతం పెంచమన్నా ... ఇలా ఏది అడిగినా కాలేజీల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ఎంతోమంది బోధనేతర సిబ్బంది ఎలా కోర్టుల చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్నారో తెలుసుకుందాం...
రాష్ట్రంలో జె.ఎన్.టి.యు ఆధ్వర్యంలో సుమారు 288, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 10 కళాశాలలు ఉన్నాయి. ఇందులో బోధనేతర సిబ్బంది 50వేల మంది పనిచేస్తున్నారు. వారికి నిబంధనల ప్రకారం జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఎఐసిటిఇ నిబంధనలు పాటించడం లేదు. 1:3 ప్రకారం కొన్ని కళాశాలల్లో కనీసవేతనం అమలు చేయడం లేదు.
- ఆడమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 3 లేదా 4 నెలలకు ఒకసారి వేతనం ఇస్తున్నారు.
- అభినవ్ హైటెల్ ఇంజనీరింగ్ కాలేజీలో పది మంది జీతం పెంచమనందుకు ఓరల్ టర్మినేషన్ చేశారు. లేబర్ ఆఫీసులో విచారణ జరుగుతుంది.
- చిలుకూరు బాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వనందుకు వారు కూడా లేబర్ డిపార్టుమెంట్‌లో కేసు వేశారు. పెండింగ్‌లో వుంది.
- వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాట్యూటీ చట్టంపై కోర్టులో స్టే తెచ్చుకున్నారు. అది హై కోర్టులో విచారణలో వున్నది.
- ఎం.వి.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంటిన్‌లో పనిచేస్తున్న వారిని అకారణంగా తొలగించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించి పనిచేయించుకుంటున్నారు. తీసివేసిన కార్మికులు లేబర్ కమీషనర్ దగ్గర కేసు వేస్తే వారిని ఉద్యోగంలోకి తిరిగి తీసుకోమని లేబర్ కమీషనర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో ఛాలెంజ్ చేసి స్టే తెచ్చుకున్నారు.
ఈ విధంగా యాజమాన్యాలు ఉద్యోగుల విషయంలో మొండివైఖరి ప్రదర్శిస్తున్నారు. దాంతో ప్రతి చిన్న విషయానికి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగవల్సివస్తుంది.
ఎం.జె.సి.టి.ఇ కాలేజీలో పనిచేస్తున్న 94 మంది వేతన సవరణ చేయమని సమాఖ్య ద్వారా లేబర్ కమీషనర్ దగ్గర కేసు వేశారు. విచారణ జరిపిన కమీషనర్ లేబర్ కోర్టుకు రిఫర్ చేశారు. యాజమాన్యం దీనికి కూడా హైకోర్టులో స్టే తెచ్చుకున్నది. మూడు నెలల నుండి ఎం.వి.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా బ్యాంకు నుండి లోను తీసుకోమని ఒత్తిడి చేస్తున్న ఈ విషయం కూడా అసిస్టెంట్ లేబర్ కమీషనర్ రంగారెడ్డి జిల్లా పరిధిలో విచారణ జరుగుతున్నది.
డి.వి.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీలో జీతం పెంచమని అడిగినందుకు పోలీసులతో అరెస్టు చేయించారు. కానీ మనము ప్రతిఘటించడంతో వారు చర్చలకు వచ్చారు.
ఇంజనీరింగ్ కళాశాలలో ఒక నిబంధన ఉంది. యాజమాన్యం ఎప్పుడైతే ప్రభుత్వంతో అనుమతి తీసుకుంటుందో అందులోనే ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగినా, జరగకపోయినా 10 సంవత్సరాలు దాటిన ఏకళాశాలనైనా ప్రభుత్వం టేక్ ఓవర్ (స్వాధీనం చేసుకొనుటకు అర్హత ఉన్నది) కాని ఏ ప్రభుత్వాలు సాహసించచంలేదు. ఉదాహరణకు ఎం.వి.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలకు నిబంధన పెట్టిన పత్రం సాంకేతిక సంచాలకులు ఇచ్చిన పత్రం బి-/బి2746/80, తేది.2.12.1980. 10 సంవత్సరముల తరువాత ఏ నిమిషములోనైనా స్వాధీనపరచుటకు అర్హత పత్రం.
దీనికి బాధ్యులు ఎవరు. యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటుంటే ప్రభుత్వం న్యాయవాదులు నిమ్మకునీరెత్తినట్లు ఉన్నారు. వారు ప్రభుత్వాలను సవాల్ చేసే విధంగా ప్రవర్తిస్తుంటే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం లేదు. గత్యంతరము లేని పరిస్థితిలో సమాఖ్య ఇంప్లీడ్ అవడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులపై మార్గదర్శకము లేని నిబంధనలు ప్రభుత్వంచే గుర్తింపబడని సూత్రములు మా సభ్యులపై రుద్ది వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా రాజీవ్ శర్మ సాంకేతిక సంచాలకులుగా ఉన్నప్పుడు 7.7.2000 సం||లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులచే చర్చలు జరిపినారు. త్రైపాక్షిక సమావేశం జరిగింది. కానీ ఇంతవరకు మళ్ళీ అలాంటి సమావేశం జరగలేదు.
డి.టి.ఇ ఆఫీస్ వారు చెప్పే సమాధానం ఒక్కటే. మేము ప్రభుత్వానికి మీ సమస్య వ్రాయడం జరిగింది. మీరు ప్రిన్సిపల్ సెక్రెటరీ ని కలువమని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. సమాఖ్య నుండి విన్నవించేది ఏమిటంటే, అయినదేదో అయినది ఇక నుండి అయినా ఉద్యోగులు అందరూ సంఘంలో చేరి సభ్యత్వము తీసుకొని పోరాటానికి సిద్ధమవ్వాలి.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఏదురు చూసి మోసపోకుమా. నిజము మరచి నిద్రపోకుమా అన్న కవి మాటలను స్ఫూర్తిగా తీసుకొని సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడాలి.
- సి.భగత్‌సింహా,
బోధనేతర సిబ్బంది సమాఖ్య
రాష్ట్ర ప్రధానకార్యదర్శి
న్యాయస్థానంలో విచారణలో ఉన్న కేసులు
- వాసవీ ఇంజనీరింగ్ కాలేజి ఫర్ గ్రాడ్యుయేషన్ నెం.13093/2012
- ముఫకుంజా కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ ఇ.ఎస్.ఐ నెం. 13038/2013
- ముఫఖంజా కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేటెడ్ నెం. 31272/2013
- ఎం.వి.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజి క్యాంటిన్‌లో పని చేస్తున్న కార్మికులను అకారణంగా తొలగించిన వారికి కమీషనర్ వారిని ఉద్యోగాలలో తీసుకోమని ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా అపివేస్తూ స్టే తెచ్చుకున్నారు. 34745 /2013
డిమాండ్స్
- కనీస వేతనం అమలు చేయాలి.
- 10వ పి.ఆర్.సి. అమలు చేయాలి.
- ఇ.ఎస్.ఐ. Ê పి.ఎఫ్ అమలు చేయాలి.
- ఉద్యోగులందరికీ అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వాలి.
- గ్రాట్యూటీ 1972 చట్టం ప్రకారం ఎల్.ఐ.సితో లింక్ అవ్వాలి.
- బోధనేతర సిబ్బందికి గవర్నమెంటే సర్వీసు కండీషన్లు మరియు నియమ నిబంధనలు తయారు చేసి, యాజమాన్యాలకు పంపాలి.
- అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం (తేది.9.5.2012) వేతన సవరణ చేయాలి.