Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారు పిల్లలకు పాఠాలు చెబుతారు. మేధావులుగా తయారు చేస్తారు. కాని వారి పిల్లలకు మాత్రం పీజులు కట్టలేని స్థితిలో ఉన్నారు. కనీసం మూడు పూటలు తిండి కూడా పెట్టలేని ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాయమాటలు చెప్పారు. తీరా రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగమే లేదని ఇంటికి పంపారు ఐటిఐ ఉపాధ్యాయులను. ఇలాంటి వారిలో వేణుగోపాల్ కూడా ఒకరు. ఆయన తన సమస్యను కొలువుతో ఇలా చెప్పుకుంటున్నారు...
నా పేరు వేణుగోపాల్. నేను 2006లో ఐటిఐలో గెస్ట్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగంలో చేరాను. అప్పుడు నా నెల వేతనం 2500 రూపాయలు మాత్రమే. అప్పట్లో ఇంత తక్కువ వేతనానికి బిటెక్ చేసినవారు, డిప్లొమా చేసిన వారు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఐటిఐలో విద్యార్థులకు టీచింగ్ చేసేవారు ఎవరూ లేరు. దీంతో రోజూ విద్యార్థులు కాలేజీకి వచ్చి క్లాసులు జరగక ఇబ్బందులు పడేవారు. దాంతో విద్యార్థుల సమస్యలు ప్రిన్సిపల్ చూడలేక ఐటిఐలో అప్రెంటీస్ చేసిన నన్ను సహాయం చేయమని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న నేను వేతనం గురించి ఆలోచించలేదు. వెంటనే గెస్ట్ ఎటిఒగా చేరి 2500 రూపాయల వేతనంతో 2009 వరకు పని చేశాను.
2009లో సిఐటియు సహకారంతో సంఘం ఏర్పాటు చేసుకొని ఉద్యమం చేసిన ఫలితంగా గెస్టు వారినందరిని ఔట్‌సోర్సింగ్‌లోకి మార్చారు. వేతనం 6,500 రూపాయలకు పెంచారు. ఆ తర్వాత ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు నెలనెల వేతనాలు ఇవ్వకుండా, ఇఎస్‌ఐ, పిఎఫ్‌లు చెల్లించకుండా నానా ఇబ్బందులకు గురిచేశారు. వీటికి వ్యతిరేకంగా పోరాడాము. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల కింద టీచింగ్ స్టాఫ్‌ను నియమించడం అవమానకరం అని యూనియన్ ఆధ్వర్యంలో మళ్ళీ ఆందోళనలు చేసాము. ఫలితంగా 2011లో మమ్మల్నందరినీ కాంట్రాక్ట్‌లోకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వేతనం 12000కు పెరిగింది. దాంతో జీవితం కొంత సాఫీగా సాగుతోందనుకుంటున్న తరుణంలో పిడుగు లాంటి వార్త తెలిసింది.
క్వాలిఫికేషన్ లేదనే పేరుతో నన్ను నాతోపాటు మరో 56 మంది లెక్చలర్లను ఉద్యోగం నుండి తొలగించారు. రెన్యువల్ చేయకుండా ఇంటికి పొమ్మని చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. తెలంగాణ వస్తే రెగ్యులర్ అవుతారని సకల జనుల సమ్మెలో పాల్గొని జీతాలు పోగొట్టుకున్నాము. తెలంగాణ వచ్చింది. కాని ఉన్న ఉద్యోగం పోయింది. అధికారులను అడిగితే మీకు క్వాలిఫికేషన్ లేదు పొమ్మంటున్నారు. తొమ్మిది సంవత్సరాల పాటు అవసరం లేని క్వాలిఫికేషన్ సమస్య ఇప్పుడెందుకు వచ్చిందంటే రూల్స్ మారాయని ప్రభుత్వం చెబుతుంది. నేను ఎటిఒగా చేరే నాటికి ఆ ఉద్యోగానికి 'ఐటిఐ చేసి అప్రెంటీస్ మూడు సంవత్సరాలు చేసినవారు అర్హులు'. నేనూ అదే చేసి చేరాను. ఇప్పుడు కొత్త 2014 తర్వాత మేమందరం రోజూ ఐటిఐలకు వెళ్ళి విద్యార్థులకు చదువు చెబుతున్నాము. ప్రాక్టికల్స్ చేయిస్తున్నాము. కాని సంవత్సర కాలంగా వేతనాలు లేవు. రెన్యువల్ కాలేదనే పేరుతో వేతనాలు లేకుండా పని చేయించుకుంటున్నారు. ప్రిన్సిపల్‌ను అడిగితే పైనుండి ఆర్డర్స్ రాలేదు అని చెబుతున్నారు. వేతనాలు లేక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇంటి అద్దెలు, స్కూలు ఫీజుల వంటివి చెల్లించలేక పోతున్నాము. నిత్యవసర సరుకులు కొనలేక పస్తులు ఉండాల్సిన దుస్థితికి నెట్ట బడ్డాము. ప్రభుత్వం ఇంకా తత్సారం చేయకుండా వెంటనే అందరినీ రెన్యువల్ చేయమని కోరుతున్నాను.
డిమాండ్స్
- ఐటిఐలలో 2014 జూన్ వరకు పని చేసిన వారందరినీ రెన్యువల్ చేయాలి.
- కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారందరినీ ప్రభుత్వం హామీ ఇచ్నిన విధంగా రెగ్యులరైజ్ చేయాలి.
- పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.