Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనారోగ్యంతో బాధపడుతూ, తిరగలేని స్థితిలో ఉన్న విఆర్‌ఏలకు మెడికల్ ఇన్‌వాలిటేషన్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనేక సంవత్సరాల పోరాటం జరిగింది. ఫలితంగా ప్రభుత్వం జీవో. నెం. 670 ని 2012, డిసెంబర్ 5న విడుదల చేసింది. ఆ జీవోకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మెడికల్ ఇన్‌వాలిటేషన్ జీవో.661 ని లింకు చేసింది. దీని వలన వీఆర్‌ఏలు పోరాడి సాధించుకున్న మెడికల్ ఇన్‌వాలిటేషన్ నిరుపయోగంగా మారింది. 670 జీవోను సవరణ చేసి, వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, పలుమార్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా వారి బాధలను పట్టించుకోవడం లేదు.
మెడికల్ ఇన్‌వాలిటే జీవో.670:
మెడికల్ ఇన్‌వాలిటేషన్ జీవో నెం. 670 లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన జీవో 661ని లింకు చేసి ఉద్యోగులకు పెట్టిన అన్ని షరతులు వీఆర్‌ఏలకు పెట్టారు. మెడికల్ బోర్డు నుండి (మెడికల్ అన్‌ఫిట్ ) సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ ఉండాలి. గుండె జబ్బు, కాళ్ళు చేతులు పనిచేయకపోవడం, పక్షవాతం లాంటి ఆరు జబ్బులకే పరిమితం చేశారు. 60 సంవత్సరాల లోపు వారు మాత్రమే మెడికల్ ఇన్‌వాలిడేషన్ తీసుకోవాలని షరతులు పెట్టారు. మిగిలిన ఉద్యోగుల మాదినిగా పీఆర్‌సీ వర్తింపు, కనీస వేతనాలు, పర్మెంటేజ్ డీఏ, హెల్త్‌కార్డులు పెన్షన్‌తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలని వీఆర్‌ఏలు దశాబ్దాలుగా కోరుతున్నారు. వీఆర్‌ఏలు పార్ట్‌టైమ్ ఉద్యోగులు. ఇచ్చేది గౌరవ వేతనం అంటూ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సౌకర్యాలకు వీఆర్‌ఏలను ప్రభుత్వం దూరం చేస్తుంది. వీఆర్‌ఏలకు ఇచ్చే విధానంలో ఒక న్యాయం, వీఆర్‌ఏల నుండి తీసుకునే విధానంలో మరో న్యాయంగా ప్రభుత్వం వ్యవవారిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సౌకర్యాలు వీఆర్‌ఏలకు వర్తించవని చెబుతున్నా ప్రభుత్వం మెడికల్ ఇన్‌వాలిటేషన్ జీవోలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన షరతులు పెట్టి వీఆర్‌ఏల వారసులైన బక్క జీవులకు న్యాయంగా రావల్సిన ఉద్యోగాలను దూరం చేయటం ఎంత దుర్భార్గం.
వీఆర్‌ఏలు కోరుతున్న సవరణలు:
మెడికల్ ఇన్‌వాలిటేషన్ కోసం మెడికల్ బోర్డు నుండి కాకుండా ఏ ప్రభుత్వ హాస్పిటల్ నుండైనా (మెడికల్ అన్‌ఫిట్) అని సర్టిఫికెట్ తీసుకున్న దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని జబ్బులకే పరిమితం చేయకుండా అన్ని జబ్బులకు వర్తింప చేయాలి. 60 సంవత్సరాలలోపు వయసును 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి కూడా వర్తింప చేయాలి. జిల్లా కలెక్టర్ చైర్మన్ కాకుండా వీఆర్‌ఏ నియామకం 1849 సర్వీసు రూల్స్ ప్రకారం తహశీల్దారు లేదా ఆర్‌డిఓను చైర్మన్‌గా పెట్టి.. ఈ సవరణలు చేసి మెడికల్ ఇన్‌వాలిటేషన్ కింద తండ్రి స్థానంలో వారసులకు కారుణ్య నియామకం చేయాలని గత మూడూ సంవత్సరాలుగా పలు దఫాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా 'చెవిటి వాని ముందు శంఖం ఊదిన' చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
తప్పించుకోవడానికి ఎన్నో సాకులు
సర్వీస్ నిబంధనల ప్రకారం 65 సంవత్సరాలలోపు తండ్రి చనిపోతే వారసుడికి ఉద్యోగం ఇవ్వాలని నిబంధన పెట్టారు. కాని 65 సంవత్సరాలు దాటి తండ్రి చనిపోయినా వారసుడికి 18 సంవత్సరాలలోపు ఉన్నా, 40 సంవత్సరాలకు వయసు పైబడిన వారసులకు ఉద్యోగాలు రావటం లేదు. పైగా జీవోలు సవరించి వీఆర్‌ఏ ఉద్యోగానికి విద్యా అర్హత పదోతరగతి పెట్టారు. ఒకవేళ తండ్రి చనిపోయినా 10వ తరగతి బదిలీ లేకుంటే వారసుడికి ఉద్యోగం ఇవ్వడం లేదు. చదువుకు, వయసుకు పరిమితులు పెట్టడం మూలంగా అనేక మందికి ఈ ఉద్యోగాలు దూరం చేస్తున్నారు. వీఆర్‌ఏలు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు జీవోలను ప్రభుత్వం సవరించి వీఆర్‌ఏల ఉద్యోగాలను కుదిస్తుంది. కొత్త వీఆర్‌ఏల పేరుతో రాత పరీక్షలు, రోస్టర్ పద్ధతులు పెట్టడం వలన దళితులు, వెనబడినవారికి ఈఉద్యోగాలను దూరం చేస్తున్నారు. అనేక కారణాలు చూపుతూ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది.
మెడికల్ ఇన్‌వాలిటేషన్ జీవోను వీఆర్‌ఏలు కోరిన విధంగా సవరణ చేస్తే వయసు మీరిన తల్లిదండ్రుల స్థానంలో వారి వారసులు యువకులు, చదువుకున్నవారు, శక్తి సామర్థ్యాలు ఉన్నవారు వీఆర్‌ఏగా వస్తారు. వారిలోని సామర్థ్యంప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి, గ్రామీణ ప్రజలకు ప్రాథమిక సమాచారం అందించడానికి ఉపయోగపడుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే మెడికల్ ఇన్‌వాలిటేషన్ జీవో 670 సవరణ చేసి వీఆర్‌ఏల వారసులకు ఈ కారుణ్యనియమకాల కింద ఉద్యోగాల ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలి.