Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం, వ్యాపారం, ఇతర కారణాలలో భాగస్వామికి దూరంగా.. వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తమ దాంపత్య జీవితం గురించి కలత చెందుతారు. ఒకరికి ఒకరు దూరంగా ఉండటం వల్ల ఇద్దరిలోనూ లేనిపోని అనుమానాలు, అపోహలు నెలకొనే అవకాశం ఉంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఇలాంటి భావాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. మనుషులు దూరంగా ఉన్నంత మాత్రాన మనసులు దూరంగా ఉండవని ఇద్దరూ గుర్తించాలి. మన జీవితాల్లోకి టెక్నాలజీ ప్రవేశించిన తరువాత ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. భాగస్వామికి దూరంగా ఉన్నవారు. వారితో అనుసంధానం కావడానికి ఇదే టెక్నాలజీ ఉపయోగపడుతుంది. సంబంధాన్ని, అనుబంధాలను కొనసాగించడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకుంటే.. భాగస్వామికి దూరంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావు.
నమ్మకం
రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా సరే.. నమ్మకం ఉంటేనే ఆ బంధం నిలుస్తుంది. సంబంధ, బాంధవ్యాలకు నమ్మకమే పునాది. శారీరకంగా ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ.. ఇద్దరి మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగ పరమైన సంబంధాన్ని దంపతులు కొనసాగించాలి. అన్ని విషయాల్లోనూ భాగస్వామిని నమ్మితేనే వారి మధ్య బంధం చిరకాలం నిలుస్తుంది.
కమ్యూనికేషన్
శారీరకంగా ఒకరికి ఒకరు దూరంగా ఉన్నప్పటికీ.. ఇద్దరూ మానసికంగా, భావోద్వేగాల పరంగా దగ్గరగా ఉండాలి. రిలేషన్‌షిప్‌లో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి కమ్యునికేషన్‌ను మెరుగుపరచుకోవాలి. దంపతులిద్దరూ రోజులో తమకు ఎదురైన అనుభవాలను, అనుభూతులను చర్చించుకోవాలి. మనస్పర్థలు ఎదురైతే మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఇలాంటి భావనలు ఇద్దరిలోనూ ఉండాలి. అలాంటప్పుడే ఒకరికి ఒకరు దగ్గరగా ఉన్నారనే భరోసా లభిస్తుంది. అలాగని 'నాతో మట్లాడాల్సిందే..' అని మొండిగా వ్యవహరించకూడదు. వారికి కూడా వ్యక్తిగత ప్రైవసీ ఇవ్వాలని గుర్తించాలి.
మనసు అంగీకరించాలి
లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో కొన్నాళ్లపాటు ఒకరికి ఒకరు దూరంగా ఉండాలని ఇద్దరూ నిర్ణయించుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా దూరంగా ఉండాల్సి వస్తోందనే భావనను మనసులో నిలుపుకోవాలి. క్లిష్ట సమయాల్లో మీ పక్కన వారు ఉండలేరని అంగీకరించాలి. ఉద్యోగం, ఆర్థిక అవసరాలు, కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలతోనే ఈ దూరం ఏర్పడిందని మనసుకు చెప్పుకోవాలి. దాంపత్యంలో ఇది కూడా ఒక దశ అని భావించాలి.
ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలి
దంపతులిద్దరూ దగ్గర లేనప్పటికీ.. ఆ భావన మనసులోకి రానివ్వకూడదు. కేవలం శారీరకంగానే దూరంగా ఉన్నామని ఇద్దరూ భావించాలి. ఇందుకు టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఖాళీ సమయాల్లో ఆడియో, వీడియో కాల్స్, చాటింగ్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో బహుమతులు పంపించడం, అప్పుడప్పుడూ సొంత చేతి రాతతో ఉత్తరాలు రాయడం.. వంటివి కొత్త అనుభూతిని కలుగజేస్తాయి. వీటితో పాటు భాగస్వామి ఇష్టాల ప్రకారం నడుస్తూ.. బంధంలో కొత్త ఉత్సాహాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేయాలి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ భావనను ఇవి దూరం చేస్తాయి. జూమ్ డేట్స్, సర్ ప్రైజ్ గిఫ్టులు ఇద్దరినీ మరింత దగ్గర చేస్తాయి.
ఈ పద్ధతులు ముఖ్యం
భాగస్వామికి రోజులో ఎంతో కొంత సమయం ప్రత్యేకంగా కేటాయించాలి. మీరు చెప్పిన మాటలు వారు వినేలా ప్రోత్సహించాలి. దాపరికాలు లేకుండా మీ గురించి అన్ని విషయాలనూ వారితో పంచుకోవాలి. ఇద్దరి మధ్య అభినందనలు తప్పకుండా ఉండాలి. ఒకరికొకరు విలువ ఇవ్వాలి. అవసరాలు, అనారోగ్యాలు, బంధుమిత్రులతో సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ వ్యవహారాలు.. వంటివన్నీ మాట్లాడుకోవాలి. దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకోవాలి. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నా.. అవి దాంపత్య బంధంపై ప్రతికూల ప్రభావం చూపవని ధ్రువీకరించుకోవాలి. ముఖ్యమైన సందర్భాల్లో ఏకాభిప్రాయంతో ముందడుగు వేయాలి.