Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శకుంతల దేవి... ఈ పేరు మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ''మానవ కంప్యూటర్'' ఎంతటి లెక్కలు అయిన క్షణాల్లో పరిష్కారించగల తెలివితేటలు.. గణితంలో అపారమైన ప్రతిభ ఆవిడ సొంతం. ఇటీవల ఆవిడ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'శకుంతల దేవి'... అమోజాన్ ప్రైమ్‌లో మనకు అందుబాటులో వుంది. ఒక కూతురు తన తల్లిపై క్రిమినల్ కేసు పెట్టడంతో మొదలవుతుంది సినిమా కథ. ఈ సినిమా మొత్తం ఒక మహిళ తన పిల్లల కోసం ఏం చేస్తుంది? పిల్లలా? తన ఆశయమా? అనే ప్రశ్న తనకి ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోంటుంది? ఈ కథనంతో నడుస్తుంది.
కథలోకి వెళితే 'శకుంతల' తనకి ఐదేండ్లప్పుడే ఆడుకుంటూ తన అన్నకు లెక్కల్లో సాయం చేస్తుంది. చిన్న వయసులోనే పెద్ద పెద్ద లెక్కలను పరిష్కారిస్తుంటే ఆశ్చర్యపోయి 'తన చెల్లి సామాన్యమైన అమ్మాయి కాదు అని చాలా ప్రతిభావంతురాలు' అని శకుంతల తండ్రికి ఈ విషయం చెబుతాడు. ఇక అప్పటి నుండి శకుంతల చేత గణితానికి సంబంధించిన షోలు ఇప్పిస్తూ, వచ్చిన డబ్బుతో ఇంటిని పోషిస్తుంటాడు ఆమె తండ్రి.
తల్లిపై ఏహ్యభావంతో
శకుంతలకి ఓ అక్క(శారద) ఉంది. ఆమెకి పుట్టుకలోనే అనారోగ్యం. అక్కకు నయం చేయించాలనుకుంటుంది. కానీ ఓ ప్రదర్శన వెళ్ళి వచ్చే సరికి అక్క చనిపోయి ఉంటుంది. ఆ సమయంలో 'ఎందుకు తనని ఆస్పత్రికి తీసుకువెళ్ళలేదు? అన్ని విషయాల్లో ఎందుకు మౌనంగా ఉంటావు? ఎందుకు తండ్రిని గట్టిగా నిలదీయలేవు?' అని తల్లిని ప్రశ్నిస్తుంది. ఇక అప్పటి నుండి శకుంతలకు తల్లి అంటే ఏహ్యభావం ఏర్పడింది. తాను తన తల్లిలా ఉండకూడదు అనుకుంటుంది. చిన్నప్పటి నుండి తన చూట్టూ వున్న పరిస్థితులను, ఆర్థిక ఇబ్బందులను చూసి డబ్బు సంపాదించానే కోరిక బలంగా నాటుకుపోతుంది. అలా కుటుంబ పరిస్థితులు తన బాల్యంపై చెరగని ముద్ర వేస్తాయి. తల్లిదండ్రులు అంటే ద్వేషం ఏర్పడుతుంది.
ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని
యుక్త వయసులోనే ప్రేమలో పడుతుంది. ప్రేమించిన వ్యక్తి తనని మోసం చేసి వేరే పెండ్లి చేసుకుంటున్నాడని తెలిసి అతన్ని తుపాకితో కాల్చివేస్తుంది. అక్కడి నుండి లండన్‌కు వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఉంటూ, గణిత పరిజ్ఞానంతో అక్కడ షోలు ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. అక్కడి వారు చాలా మంది ఓ భారతీయస్త్రీగా ఆమె వేషధారణను చూసి నవ్వుతారు. వారికి తన చమత్కారమైన మాటలతోనే సమాధానమిస్తుంది. ఓ షోలో ఆమె ప్రతిభ చూసి, స్పానిష్ గణిత శాస్త్రవేత్త 'మీకు ఇంత త్వరగా పరిష్కరించే టెక్నిక్స్ ఏ యూనివర్శిటిలో నేర్పించారు?' అని అడిగితే 'అసలు నేను స్కూల్‌కే వెళ్లలేదు. ఇంకా యూనివర్శిటినా.. నాకు బాల్యం మాత్రమే ఉంది' అని చెపుతుంది. నిజమే తన చిన్నతనం అంతా గణిత ప్రదర్శనలలోనే గడిచిపోయిందని సమాధానం ఇస్తుంది. ఆ స్పానిష్ శాస్త్రవేత్త సహాయంతో శకుంతల ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తుంది. ఇతర భాషల్లో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తుంది. అప్పటి నుండి ''హ్యూమన్ కంప్యూటర్''గా పేరు సాధిస్తుంది. ఆమె అభివృద్ధికి కారణమైన స్పానిష్ శాస్త్రవేత్త 'నీకు ఇక నా అవసరం లేదు నేను స్పానిష్ వెళ్లిపోతున్నాను' అంటాడు. 'ప్రతి మగాడు ఆడదానికి వారి అవసరం మాత్రమే ఉందని ఎందుకు అనుకుంటారు. అసలు స్త్రీని ఉద్దరిస్తున్నట్టు ఎందుకు భావిస్తారు?' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు కూడా ఆమె భాదపడదు. తన ప్రతిభను విస్తరించుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటుంది. తన మేథస్సును ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. నిజానికి శకుంతల దేవి మాములు స్త్రీ కాదు. అందుకే ఎన్ని దెబ్బలు ఎదురైనా పోరాడుతూ అందరిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటుంది.
పెండ్లి తర్వాత...
ఆ క్రమంలోనే శకుంతల దేవికి ఓ పార్టీలో బెంగాలీ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ సంతోష్ బెనార్జీ పరిచయమవుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. సంతోష్‌కి కలకత్తా వదిలి రావడం ఇష్టం లేదు. దాంతో పెండ్లి తర్వాత అక్కడే స్థిరపడతారు. వారికి 'అనుపమ' పుడుతుంది. అందరు తల్లుల్లాగా ఆమె కూడా పెండ్లి-పిల్లలు, అదే ప్రపంచంగా బంధీ అయిపోతుంది. షోలకు దూరం అవుతుంది. కానీ జీవితం అలా వెలితిగా ఉండటం ఆమెకు అసలు నచ్చదు. కుతూరుపై ఉన్న ప్రేమతో తన మేథస్సు, ప్రతిభను పక్కనపెట్టేస్తుంది. కూతురిని భర్త చూసుకుంటా అన్న తర్వాత షోలు ఇవ్వడం మొదలుపెడుతుంది. అయితే అప్పటి నుండి కూతురు తండ్రికి మాత్రమే పరిమితమవుతుంది. దాంతో ఆమె భాదపడుతుంది. భర్త కలకత్తా వదలడు అని అర్థమై బిడ్డను తీసుకొని బయటకి వచ్చేస్తుంది. ఆమె శకుంతల.. ఎప్పటికీ ఓ సాధారణ స్త్రీలా ఉండటానికి ఇష్టపడదు.
సాధారణ తల్లిలా ఎందుకు ఉండవు?
అనుపమ తన తల్లితో అన్ని దేశాలూ తిరుగుతుంటుంది. శకుంతల కూతురికి ఎంత సమయం కేటాయించినా అనుపమ తండ్రి గురించి భాదపడుతూ వుంటుంది. తల్లికి ఎప్పుడు షోస్ తప్ప ఇంకేం ఉండవు అని ఆమె అభిప్రాయం. ఆమె అందరి తల్లుల్లా ఉండదు అని భాదపడుతుంది. తల్లి ఆలోచనలకు అనుపమ విరుద్దంగా ఉంటుంది. అప్పుడే భర్త కూతురి గురించి ప్రస్తావిస్తూ, 'నువ్వు కూడా నీ తండ్రిలాగే చేస్తున్నావు. కూతురి బాల్యాన్ని తన నుండి వేరు చేస్తున్నావు' అంటాడు. శకుంతల భాదపడుతుంది. 'నేను ఏం చేసినా తన కోసమే' అని ఇష్టం లేకపోయినా అనుపమను బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. అయితే ఆమెను తన షోలకు తీసుకువెళ్తూ, కూతురితో గడిపేందుకు దొరికే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఓ ఇంటర్వ్యూలో తన తల్లి చెప్పిన మాటలు విని అనుపమకి కోపం వచ్చి 'నువ్వు ఎందుకు ఓ సాధారణ తల్లిలా ఉండలేవు?' అని ప్రశ్నిస్తుంది. 'ఎందుకంటే నేను సాధారణ స్త్రీని కాదు' అని ఆత్మవిశ్వాసంతో చెపుతుంది.
బంధాలు ప్రశ్నిస్తుంటాయి
చాలా తక్కువ మందికి తమ జీవితాల పట్ల విశ్వాసం, స్పష్టత ఉంటుంది. వారి మీద వారికి ప్రేమ, ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే బంధాలు ప్రశ్నిస్తుంటాయి. శకుంతల దేవి తన కెరీర్ కోసం భర్త, కూతురుని వాడుకుంటుందని, తన స్వేచ్చను దూరం చేస్తుందని కుతూరు నిందిస్తుంది. దాంతో కూతురు కోసం షోలు మానేసి, తన సమయం మొత్తం తనకే కేటాయిస్తుంది. కూతురు ఇంటీరియర్ డిజైనింగ్ ఇష్టం అనడంతో ఆమె ఎదగడానికి ఎంతో తోడ్పాటు ఇస్తుంది. కుతూరు ఓ వ్యక్తిని(అజరు)ని ప్రేమించి పెండ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటుంది. కూతురిపై ప్రేమ చంపుకోలేక, అల్లుడిని కూడా తమతో పాటు లండన్‌లో ఉండాలని నిర్ణయిస్తుంది. అందుకు అతను 'ఆడపిల్ల భర్తతో పాటు ఉండడం అనేది అందరు అమ్మాయిలు చేస్తుందే కాదా?' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె 'అబ్బాయి తల్లి.. కొడలు తమతో ఉండాలని కోరడం ఆచారం? అమ్మాయి తల్లి.. అల్లుడు తమతో ఉండాలని కోరడం తప్పా?' అని ప్రశ్నిస్తుంది. 'అను కోసం నేను అన్ని చేశాను. నా షోలు వదిలేశాను. తను ఇక్కడ ఉండదు' అని చెబుతుంది. అయితే కూతురు తల్లితో గొడవపడి అజరుని పెండ్లి చేసుకుంటుంది. శకుంతల మళ్లీ షోలు ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. కానీ కుతూరు దూరం కావడంతో ఇంతకు మునపులా మనసు పెట్టలేకపోతుంది. ఓ షోలో అడిగిన ప్రశ్నకు సమాధానం తప్పుగా చెబుతుంది. 'హ్యూమన్ కంప్యూటర్' కూడా తప్పు చేస్తుంది అని షో నిర్వాహకుడు చెప్పడంతో ఆమెలో ఓ నిర్వేదం చోటుచేసుకుంటుంది.
ఎవ్వరూ ఫర్ఫెక్ట్ కాదు
తన చిన్నతనంలో తల్లిపై ఆమె చూపిన ద్వేషం గుర్తొచ్చి భాదపడుతుంది. ఓ స్త్రీగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకోవాలని.. ఓ ప్రక్క తల్లిలా తన బిడ్డ మనసు గెలవాలని శకుంతల చేసే ప్రయత్నాల మధ్య ఆమె చాలా గొప్ప మహిళగా కనిపిస్తుంది. అనూకి ఒక బిడ్డపుట్టడంతో పాపను చూసుకోలేక అవస్తాపడుతూ అత్తగారితో తాను 'పర్ఫెక్ట్ మదర్' కాలేనా అని భాదపడుతుంది. అప్పుడు ఆమె ఈ లోకంలో పర్ఫెక్ట్ మదర్ ఉండదు. ఏ తల్లీ పర్ఫెక్ట్ కాదు. తన పిల్లల కోసం కోప్పడుతుంది, దండిస్తుంది ఇదంతా వారి కోసమే అని చెప్తంది. శకుంతల ఆస్తులు ఆమ్మకానికి పెట్టడంతో అనూ, అజరులు ఆమె మీద కేసు వేయడానికి లండన్ వెళ్తారు. కానీ శకుంతల కూతురును చూడటానికే ఇలా చేసింది అని తెలుసుకొని తన ఆస్తి అంతా కూతురి సొంతమని లాయర్ల ద్వారా తెలుపుతుంది.
ఇంటికే పరిమితం కాకుండా
తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తల్లి భదప్రరచుకున్న ఆల్బమ్‌లో చూసిన అనూ తల్లిని అర్థం చేసుకుని క్షమించమని కోరడంతో తల్లీబిడ్డలు కలిసిపోతారు. ఆ తర్వాత నుండి శకుంతల మళ్ళీ సంతోషంగా తన జీవితాన్ని గణిత షోలతో గడుపుతుంది. కూతురి ముందు ఇప్పుడు శకుంతల ఓ అసాధారణ తల్లిగా గర్వంగా నిలపడుతుంది. 'శకుంతల దేవి' కథ అసాధరణమైనది. ఓ స్త్రీ తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ, ఇటు తల్లిగా తన భాద్యతను బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అరుదు. ఇలా చేస్తుందంటే ఆమెను 'సూపర్ ఉమెన్' అని చెప్పాలి. ప్రస్తుత సమాజంలో స్త్రీ కుటుంబ బాధ్యతల మధ్య చిక్కుకొని అదే ప్రపంచంగా బతికేస్తుంది. అలాంటి వారికి 'శకుంతల దేవి' జీవితం స్పూర్తిదాయకం. ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో స్ఫూర్తిని నింపుతుంది. తన కలలే తన లక్ష్యాలు అనుకొని ప్రతి స్త్రీ కుటుంబానికే పరిమితి కాకుండా.. వారి కలలను నిజం చేసుకోడానికి ప్రయత్నించాలి. అప్పుడు ప్రతి ఇంట్లో ఓ 'శకుంతల దేవి' కనిపిస్తుంది.
- వజ్రాల ప్రియాంక