Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భర్త గుండె పోటుతో చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు. కౌలు డబ్బులే ఆ కుటుంబానికి ఆధారం. అయినా పైసా పైసా జాగ్రత్త చేస్తూ పిల్లల్ని పెంచుకుంది. పెద్ద కూతురు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. రెండో అమ్మాయి ఇంటర్ చదువుతోంది. హాయిగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి కుమార్ ప్రవేశించాడు. అప్పటి నుండి అన్నీ సమస్యలే. అతని బారి నుండి పెద్ద కూతురిని కాపాడుకోవాలని ఆ తల్లి తపన. అలాంటి సమయంలోనే సలహా కోసం కూతురిని తీసుకుని ఆమె ఐద్వా అదాలత్‌కు వచ్చి...
''మేడమ్, నా పేరు తులసి. మా వారు చనిపోయేనాటికి మా పిల్లలు చిన్నవాళ్ళు. అప్పటి నుంచి వాళ్ళే నా ప్రపంచం. మా పెద్దమ్మాయి రమ్య ఇంజినీరింగ్ చదివే రోజుల్లో కుమార్ అనే అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోవడంతో చదువు పూర్తయిన తర్వాత పెండ్లి చేయాలనుకున్నాం. అయితే మా అమ్మాయికి ఉద్యోగం తొందరగా వచ్చేసింది. ఆ అబ్బాయికి రాలేదు. కుమార్‌కి కూడా ఉద్యోగం వచ్చిన తర్వాతనే పెండ్లి చేయాలనుకున్నాం. కానీ అబ్బాయి వాళ్ళు ''అమ్మాయికి జాబ్ వచ్చింది కదా, మా వాడు కూడా మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఉద్యోగం కచ్చితంగా వచ్చేస్తుంది. వెంటనే పెండ్లి పెట్టేసుకుందాం'' అన్నారు. వాళ్ళ మాట కాదనలేక ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా.
ఇక పెండ్లి పదిరోజులు ఉందనగా కుమార్‌తో పాటు అతని తమ్ముడు, మరదలు ఉద్యోగ ప్రయత్నాల కోసం బెంగుళూరు వెళుతున్నారు. అప్పుడు కాలేజీకి సెలవుకావడంతో మా చిన్నమ్మాయి కూడా వాళ్ళతో పాటు వెళ్ళింది. అక్కడ కుమార్ మరదలు అతనితో చాలా చనువుగా ఉండేది. పైగా అతనితో ఏది పడితే అది మాట్లాడేది. మా అమ్మాయితో ''మా బావకు అమ్మాయిల పిచ్చి. వీడిని మీ అక్క ఎలా ఇష్ట పడిందో అర్థం కావటం లేదు'' అని అన్నదంట. ఆ విషయాలను మా అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత నాతో చెప్పింది. దాంతో అసలు ఈ పెండ్లి చేయాలా వద్దా అని ఆలోచనలో పడ్డాను. అయితే అబ్బాయి తల్లి దండ్రులకు ఇదే విషయం చెబితే ''కుమార్ తనని పెండ్లి చేసుకోకుండా మీ రమ్యను చేసుకుంటున్నాడని కోపం. అందుకే అన్నీ అబద్ధాలు చెప్పింది. మా వాడు అలాంటోడు కాదు. అయినా రమ్యకు మా వాడి గురించి తెలియదా? ఇంత దూరం వచ్చిన తర్వాత పెండ్లి ఆపితే ఏం బాగుంటుంది'' అంటూ హడావుడి చేశారు. వాళ్ళు చెప్పింది నిజమే అనుకుని పెండ్లికి ఒప్పుకున్నా.
పెండ్లి తర్వాత రమ్య, కుమార్ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇంట్లో ఏం మాట్లాడుకున్నా సాయంత్రం ఇంటికి వచ్చి వెంటనే మేం ఏం మాట్లాడుకున్నామో అన్నీ అడిగేవాడు. మేం మాట్లాడుకున్న ప్రతి విషయాన్నీ దగ్గర వుండి విన్నట్టే చెప్పేవాడు. అవన్ని అతనికి ఎలా తెలుస్తున్నాయో అర్థమయ్యేది కాదు. కొన్ని రోజుల తర్వాత మేం మాట్లాడుకున్న విషయాలే కాదు మేం ఏం చేసింది కూడా చూసినట్టే చెప్పేవాడు. దాంతో కెమెరాలు పెట్టి మా వీడియోలు తీస్తున్నాడేమో అనే అనుమానం వచ్చింది. ఇదే విషయం అతన్ని అడిగితే మమ్మల్ని బూతులు తిట్టాడు. తన తప్పు మాత్రం ఒప్పుకోలేదు. మా చిన్నమ్మాయి ఇంట్లో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అని హాస్టల్లో చేర్పించాం. అప్పటి నుంచి మాపై కోపం పెంచుకున్నాడు.
రమ్యతో బెడ్‌రూంలో ఉన్నప్పుడు కూడా వీడియోలు తీశాడంట. ఇప్పుడు తను చెప్పినట్టు వినకపోతే వాటిని నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. మీరే ఎలాగైనా మమ్మల్ని అతని బారి నుంచి కాపాడాలి'' అంటూ తులసి ఏడ్చేసింది.
''ఈ విషయాలన్నీ అతని తల్లిదండ్రులుకు చెబితే, 'మగ పిల్లలంటే ఇలాగే ఉంటారు. నువ్వే సర్దుకు పోవాలి' అంటున్నారు. ఈ మధ్యనే నాకు మరో విషయం తెలిసింది. అతనికి మానసిక సమస్య కూడా ఉంది. చిన్నప్పటి నుంచి మందులు వాడుతున్నారంట. ఈ విషయాలేమీ నాకు పెండ్లికి ముందు చెప్పలేదు. కాలేజీలో ఉన్నప్పుడు నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. అందుకే నాకు అనుమానం రాలేదు. పెండ్లి తర్వాత చేసేది లేక బాగుచేసుకుందాం అనుకున్నా. అందుకే అతనితో చాలా ఓర్పుగా ఉంటున్నా. వీడియోల గురించి అడిగినప్పటి నుంచి చాలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నేను పక్కనే ఉన్నా వేరే అమ్మాయిలతో, అబ్బాయిలతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడతాడు. బ్లూ ఫిలింలు చూడమంటూ బలవంతం చేస్తాడు. ఇవన్నీ భరించలేకపోతున్నాను. ఏం చేయాలో తోచడం లేదు. పెండ్లి అనే ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయాను. అందుకే మీ దగ్గరకు వచ్చాం'' అంది రమ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ.. ''మారతాడని సంవత్సరం చూశాను. అతను ఓ సైకో. మానసికంగా హింసిస్తున్నాడు. అతనితో నేను బతకలేను. పైగా ఆ తల్లిదండ్రులు కూడా అతన్నే సపోర్ట్ చేస్తున్నారు. మా చెల్లికి రావల్సిన ఓ సంబంధాన్ని కూడా చెడగొట్టాడు. ముందు అతని దగ్గర ఏమైనా వీడియోలు ఉన్నాయేమో తీసుకోవాలి. దానికి మీరు సాయం చేయాలి'' అంది.
లీగల్‌సెల్ సభ్యులు మాట్లాడుతూ ''అతనిపై ముందు పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టు. గృహహింస చట్టం, సైబర్ నేరం కింద అరెస్టు చేసి, నెట్‌లో అతనికి ఉన్న అకౌంట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. నీకూ, మీ చెల్లికి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెండ్లయి సంవత్సరం అవుతుంది, పైగా అతను మానసిక వ్యాధికి మందులు కూడా వాడుతున్నాడు. కాబట్టి కోర్టులో విడాకులకు వేసుకోవచ్చు. తర్వాత నీ జీవితం నువ్వు హాయిగా బతకొచ్చు. అన్నీ సర్దుకున్నాక మరో పెండ్లి చేసుకోవచ్చు'' అన్నారు.
''అమ్మో మళ్ళీ పెండ్లా..? ఆ మాట వింటేనే భయం వేస్తుంది'' అంది రమ్య. ''పాతిక ఏండ్లు కూడా నిండలేదు. నువ్వు అలా మాట్లాడకూడదు. అతని గురించి ఆలోచిస్తూ ఇక పెండ్లే వద్దనుకుంటే ఎట్లా. అందరూ అతనిలా ఉండరు. ఈ సమాజంలో మంచివాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఇప్పుడే మరో పెండ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు విడాకులు తీసుకో. ఉద్యోగం చేసుకో. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యాక అప్పుడు ప్రశాంతంగా ఆలోచించుకో. నీకు ఏది నచ్చితే అలాగే చేద్దాం. ఇలాంటి సమస్యలు చాలామందికి వస్తూనే ఉంటాయి. చదువుకున్నావు. ఉద్యోగం చేస్తున్నావు. నీకేం తక్కువ. తోడు గా అమ్మా, చెల్లి ఉన్నారు. అవసరమైన సహాయం మేమూ చేస్తాం. కాబట్టి ప్రశాంతంగా ఉండు. ముందు అతనికి విడాకుల నోటీసు పంపు'' అని ధైర్యం చెప్పారు.
లీగల్‌సెల్ సభ్యులు చెప్పిన ప్రకారమే రమ్య, కుమార్‌పై పోలీస్ స్టేషన్‌ల్లో కేసు పెట్టింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే డబ్బులిచ్చి కేసు నుంచి తప్పించుకోవాలని చూశారు. కానీ ఐద్వా నాయకులు రమ్యకు అండగా నిలబడడంతో కుమారు అనుకున్నది జరగలేదు. పోలీసులు నెట్‌లో అతని అకౌంట్లన్నీ క్లోజ్ చేసి.. అతని దగ్గర ఉన్న వీడియోలన్నింటినీ డిలీట్ చేయించారు. దాంతో రమ్య ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం విడాకుల కోసం కేసు నడుస్తుంది. ఉద్యోగం చేసుకుంటూ, చెల్లిని చదివిస్తూ తల్లితో రమ్య ప్రశాంతంగా ఉంది.
- సలీమ