Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే సరిపోవు అంటున్నారు నెదర్లాండ్స్ పరిశోధకులు. ఆహారం, వ్యాయామంతో పాటు కూర్చునే సమయాన్ని తగ్గించాలని వారు సూచిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయమే వెల్లడించారు. ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది రోజుకు 10-11 గంటలకు పైగానే ఆఫీసుల్లో కూర్చుంటున్నారు. ఇలా ఎక్కువసేపు కూచోవటం వల్ల మధుమేహ, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యలెన్నో వస్తాయి. రోజూ వ్యాయామం చేస్తున్నాం కదా అని చాలామంది ఎక్కువసేపు కూర్చోవటంతో తలెత్తుతున్న అనర్థాలను పెద్దగా పట్టించుకోవటం లేదు. అయితే రోజుకు కనీసం ఐదు గంటల పాటు నిలబడటం లేదా అటూఇటూ మెల్లగా నడవటం ద్వారా ఇలాంటి వాటిని తప్పించు కోవచ్చని నెదర్లాండ్స్ అధ్యయనం తేల్చి చెబుతోంది. ఇందులో పరిశోధకులు కొందరిని ఎంపిక చేసి వారి దినచర్యలను పరిశీలించారు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత తమ ఫలితాలను విడుదల చేశారు.
ముందుగా రోజులో 14 గంటల సేపు కూచోవాలని సూచించారు. ఆ తర్వాత రోజుకు ఒక గంట సేపు ఎక్సర్‌సైజ్ సైకిల్ తొక్కటం వంటి కూర్చోని చేసే వ్యాయామాలను చేయాలని, 13 గంటలు కూర్చోని ఉండేలా సూచనలు చేశారు. చివరగా రోజుకు 8 గంటల సేపు కూర్చోవటం, 5 గంటల సేపు నిలబడటం లేదా అటూఇటూ నడవాలని సూచించారు. అదేపనిగా కూర్చున్నప్పుడు శరీరంలో ఇన్సులిన్ నిరోధకత (కణాలు గ్లూకోజును స్వీకరించలేకపోవటం), కొలెస్ట్రాల్ స్థాయలు గణనీయంగా పెరిగాయి. ఓ గంట సేపు వ్యాయామం చేసి.. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడల కణాలు ఆరోగ్యం మెరుగుపడింది గానీ ఇన్సులిన్ నిరోధకత, కొలెస్ట్రాల్ స్థాయిల్లో మార్పేమీ కనబడలేదు. నిలబడటం, అటూఇటూ నడిచినప్పుడు మాత్రం ఈ రెండూ గణనీయంగా మెరుగుపడటం విశేషం. అంటే వ్యాయామం చేయటమే కాకుండా ఎక్కువసేపు కూర్చోకుండా ఉండాలని ఈ అధ్యయన ఫలితాల ద్వారా సూచిస్తున్నారు. ఇందుకు వైద్యపరంగా కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా నిలబడినపుడు కండరాలు సంకోచిస్తాయి. దీంతో కండరాలు గ్లూకోజును బాగా వినియోగించుకుంటాయి. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ స్థాయ నిలకడగా ఉంటుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే రసాయనాలూ విడుదలవుతాయి.
సో.. అదేపనిగా కూర్చోకుండా అప్పుడప్పుడు లేచి నాలుగడుగులు వేయండి. మంచిఆహారం, వ్యాయమంతో పాటు తక్కువ సమయం కూర్చోని ఉండటం కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం అని గుర్తుంచుకోవాలి.
ల