Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదయ్యకు పెండ్లయింది. భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇద్దరు కూతుళ్ళు, ఓ కొడుకు ఉన్నారు. పిల్లలు చాలా చిన్నవాళ్ళు. ఆస్తి బాగా ఉంది. కొడుక్కు మళ్ళీ పెండ్లి చేయాలని తల్లి చాలా సంబంధాలు చూసింది. కానీ కుదరలేదు. చివరకు ఓ సంబంధం కుదిరింది. అమ్మాయి పేరు మంగ, పేద కుటుంబం నుంచి వచ్చింది. అణకువగా, అందరితో ప్రేమగా ఉంటుంది.
మంగకు, యాదయ్యలకు ఘనంగా పెండ్లి చేశారు. మంగకు ముగ్గురు అన్నలు, ఓ అక్క. పెండ్లి నాటికి ఆమె వయసు పాతిక. యాదయ్యకు దగ్గరదగ్గర నలభై ఉంటాయి. యాదయ్య ముగ్గురు పిల్లల్ని మంగ తన సొంత బిడ్డల్లా చూసుకునేది. పిల్లలు కూడా ఈమెను అమ్మ అనే పిలిచేవారు. ఇంటి బాధ్యతలన్నీ స్వయంగా చూసుకునేది. కుటుంబం హాయిగా గడిచిపోతుంది. యుక్త వయసు రాగానే ఆడపిల్లలకు పెండ్లి చేయాలనుకున్నాడు యాదయ్య. కానీ అంత చిన్న వయసులో పెండ్లి చేయడానికి మంగ ఒప్పుకోలేదు. వద్దని వారించి చదివించింది.
తీవ్ర కడుపునొప్పితో
పెండ్లయిన మూడేండ్లకు మంగ నెల తప్పింది. ఆ సమయంలో యాదయ్య తండ్రికి ఆరోగ్యం బాగోకపోతే ఆస్పత్రిలో చేర్పించారు. మామను చూసుకోడానికి మంగ ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. పని ఒత్తిడి ఎక్కువై మంగకు తీవ్రమైన కడుపునొప్పితో రక్తస్రావమయ్యింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. భార్య ఆస్పత్రిలో ఉంటే యాదయ్య అస్సలు పట్టించుకోలేదు. పైసా కూడా ఖర్చుపెట్టలేదు. అన్నీ మంగ తల్లిదండ్రులే చూసుకున్నారు. కాపాడుకోవాలని ఎంత ప్రయత్నించినా మంగకు అబార్షన్ అయ్యింది.
విశ్రాంతి లేకనే
తన కుటుంబం కోసం ఇన్ని చేస్తున్నా భర్త తన గురించి పట్టించుకోలేదనే బాధ ఆమె మనసులో అలాగే ఉండిపోయింది. అయినా బయట పడేదికాదు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ గర్భవతి అయ్యింది. కడుపుతో ఉన్నా ఇంటి పనులన్నీ ఆమే చూసుకోవల్సి వచ్చేది. అంతమందికి వండడం, ఇంటి చాకిరితో అస్సలు విశ్రాంతి ఉండేది కాదు. ఈ సారి ఐదో నెలల నెలలో అబార్షన్ అయ్యింది. అప్పుడు కూడా యాదయ్య పట్టించుకోలేదు. పుట్టిన బిడ్డలు దక్కడం లేదని మంగ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అత్తింట్లో పనులు ఎక్కువగా ఉండడం వల్లనే కూతురికి ఇలా జరుగుతుందని మంగను తమతో పాటు తీసుకెళ్ళిపోయారు. దాంతో యాదయ్య మంగ దగ్గరకు వెళ్ళి ఇకపై ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు.
దెప్పిపొడుపు మాటలతో...
అయితే ఈసారి మంగకు మళీ ్ళగర్భం రాలేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. యాదయ్య కొడుక్కు పెండ్లి చేశాడు. ఏడాది తిరిగే సరికి కోడలికి బాబు పుట్టాడు. పిల్లలు లేని మంగ మనవడిని ఎంతో ప్రేమగా చూసుకునేది. బాబును సొంత కొడుకులా చూసుకునేది. అయితే అబార్షన్లు, ఇంటి పనుల వల్ల మంగ ఆరోగ్యం పాడైపోయింది. గతంలో మాదిరిగా పనులు చేయలేకపోతుంది. అప్పటి నుంచి యాదయ్య బాగా మారిపోయాడు. భార్యను పట్టించుకునేవాడు కాదు. పడుకుంటే దెప్పి పొడుపు మాటలు అనేవాడు.
పరిస్థితి అర్థం కాలేదు
రోజురోజుకు భర్తలో వస్తున్న మార్పును మంగ భరించలేకపోయింది. ఇన్నేండ్లు తను చేసిన కష్టానికి ఇదేనా ప్రతిఫలం అని బాధపడింది. కడుపున పుట్టిన బిడ్డలు కూడా లేకపోవడంతో మంగ భవిష్యత్‌పై బెంగపెట్టుకుంది. భర్తకు ఎన్ని స్థలాలు, ఇండ్లు ఉన్నా ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు. అందుకే ఈ మద్య కొత్తగా కట్టించిన ఇల్లు తన పేరుతో పెట్టాలని భర్తను అడిగింది. దానికి అతను ఒప్పుకోలేదు. అప్పటికే బాధలో ఉన్న మంగ తన భవిష్యత్ కోసం ఎంతో కొంత డబ్బు తన పేరున ఫిక్స్‌డ్ చేయాలని పంచాయితీ పెట్టింది. అతను మాత్రం మూడు లక్షలు ఇద్దరి పేరుతో ఫిక్స్‌డ్ చేస్తానన్నాడు. అయితే ఎంత చేసినా తన పేరుతోనే చేయాలని మంగ గట్టిగా అడిగింది. కానీ దానికి అతను ఒప్పుకోలేదు. దాంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే తన భవిష్యత్‌కు భద్రత చూపమంటూ అన్నల సహాయంతో ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
ఇద్దరి పేరుతోనే చేస్తాను
లీగల్‌సెల్ సభ్యులు యాదయ్యను రమ్మనమని లెటర్ పంపారు. రెండు వారాల తర్వాత అతను పదిమందిని తీసుకు వచ్చి ''మేడమ్ ఆమె నా పిల్లల్ని ఇప్పటి వరకు బాగానే చూసుకుంది. ఇప్పుడు అన్నలు ఆమెకు బాగా నేర్పుతున్నారు. ఇల్లు రాసివ్వడం మాత్రం కుదరదు. ఎందుకంటే అది మా కోడలి పేరుతో ఉంది. ఇప్పుడు దాన్ని ఈమె పేరుతో మార్చితే సమస్యలు వస్తాయి. తర్వాత మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో నాకూ అనుమానమే. అందుకే ఇద్దరి పేరుతో మూడు లక్షలు ఫిక్స్‌డ్ చేస్తా. అవసరమైనప్పుడు ఇద్దరం వాడుకోవచ్చు'' అన్నాడు.
భర్తగా నీ బాధ్యత
''ఇన్నేండ్లు మీ పిల్లల్ని సొంత బిడ్డల్లా చూసుకుంది. వారికి ఏ లోటూ లేకుండా చూసుకుంది. చివరకు మనవడిని కూడా అల్లారు ముద్దుగా పెంచింది. ఇప్పుడు ఆమె మిమ్మల్ని అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. తనకు కడుపున పుట్టిన బిడ్డలు లేకపోవడంతో తర్వాత తన పరిస్థితి ఏమిటో తెలియక కుంగిపోతుంది. మీ తర్వాత ఆమె పరిస్థితి ఏంటి? అందుకే సెక్యురిటీగా ఆమె కోరుకున్నట్టు చేయడం భర్తగా నీ బాధ్యత. ఇన్నేండ్ల మీ సంసారంలో ఆమె మిమ్మల్ని ఏమీ అడగలేదు. అది మీకూ తెలుసు. ఇప్పటికైనా తను కోరుకున్నట్టు చేయండి. అనవ సరంగా గొడవలు పెంచుకోవద్దు' అన్నారు లీగల్‌సెల్ సభ్యులు.
చివరికి ఒప్పుకున్నాడు
ఎంత చెప్పినా యాదయ్య ఒప్పుకోలేదు. మంగ మాత్రం తన పేరుతో డబ్బులు వేయాలంటుంది. దాంతో లీగల్‌సెల్ సభ్యులు మంగతో, గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి చివరకు మూడు లక్షలు జాయింట్‌గా ఫిక్స్‌డ్ చేసి, దానిపై వచ్చే వడ్డీ మంగ తీసుకునేటట్టు అతన్ని ఒప్పించారు. అలాగే ఓ లక్ష రూపాయలు ఆమె చేతికి ఇచ్చి, రెండు కుంటల భూమి ఇద్దరి పేర్లతో రిజిస్టర్ చేయించమని అడిగారు. వీటికి యాదయ్య ఒప్పుకున్నాడు.
అక్కడ నన్ను పట్టించుకోరు
అంతా అయిపోయిన తర్వాత మంగ లీగల్‌సెల్ సభ్యులతో ''ఇప్పుడు నేను మా అన్నల దగ్గర ఉంటున్నా. ఇక మా ఇంటికి వెళ్లిపోతాను. అయితే అక్కడకు వెళితే పని బాగా ఉంటుంది. నేను గతంలో మాదిరిగా ఇప్పుడు చేయలేను. పని విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఓపిక ఉంటే చేస్తాను. కానీ అక్కడ పని చేయకపోతే నానా మాటలంటున్నారు. ఆరోగ్యం బాగోకపోయినా పట్టించుకోరు. ఈ విషయం కూడా మీరు ఆయనతో మాట్లాడండి' అంది.
ఆమె బాధ్యత మీదే
''డబ్బు ఇస్తున్నావు కాబట్టి ఇంతటితో నీ బాధ్యత తీరిపోయినట్టు కాదు. మంగ చివరి వరకు మీ దగ్గరే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టం లేకుండా చేసుకోవాలి. తనకు ఓపిక ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తుంది. పని విషయంలో కూడా ఇబ్బంది పెట్టకూడదు. తన ఆరోగ్యం బాగోకపోతే బాధ్యతగా పట్టించుకోవాలి. ఇకపై ఆమెకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా దగ్గరకు వస్తుంది. ఆమెను పట్టించుకోకపోతే మేము ఊరుకోం'' అన్నారు.
దానికి యాదయ్య ''మేడమ్ ఆమెను మేము బాగానే చూసుకుంటాం. పని చేయాల్సిన అవసరం లేదు. ఇకపై మా ఇంట్లో మంగకు ఎలాంటి ఇబ్బంది ఉండదు'' అని చెప్పి రెండు రోజుల్లో మంగను ఇంటికి తీసుకెళతానని రిజిస్టర్‌తో సంతకం చేసి వెళ్ళిపోయాడు.
రోజురోజుకు భర్తలో వస్తున్న మార్పును మంగ భరించలేకపోయింది. ఇన్నేండ్లు తను చేసిన కష్టానికి ఇదేనా ప్రతిఫలం అని బాధపడింది. కడుపున పుట్టిన బిడ్డలు కూడా లేకపోవడంతో మంగ భవిష్యత్‌పై బెంగపెట్టుకుంది.