Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్వతి మీనన్... మలయాళం నటి. అచ్చం పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కలిగిన ఈతరం యువతి. హీరోయినంటే సున్నితంగా ఉండాలి, సుకుమారంగా కనిపించాలి వంటివన్నీ ట్రాష్ అని కొట్టిపడేస్తుంది. నటికి గ్లామర్ అవసరమే... కానీ అంతకుమించిన నటన కావాలని నమ్ముతుందామె. అందుకే ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతుంది. స్త్రీల వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపించడం ఆమెకు ఇష్టముండదు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు...
పార్వతీ మీనన్ అనగానే గుర్తుకువచ్చేవి 'బెంగుళూరు డేస్', మారియన్, చార్లీ సినిమాలు. మోడ్రన్ గాళ్ గానైనా, డీ గ్లామర్ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటి పార్వతి. కళ్ళతోనే భావాలు పలికించడంలో దిట్ట. నటనలో ఎంత మెచ్యూర్డ్ గా నటిస్తుందో తన భావాలను వ్యక్తం చేయడంతో కూడా అంతటి ముక్కుసూటి తనం. అది ఎంతటి పెద్ద నటుడైనా తప్పు చేస్తే నిలదీసి అడగడంతో ముందు వరుసలో ఉంటుందనే చెప్పవచ్చు. దీని ఫలితంగా తన కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని తెలిసినా వెనక్కు తగ్గని నైజం ఆమెది. అందుకే ఆమె అంటే మలయాళ, తమిళ్ ఇండిస్టీలో హడల్ అనే చెప్పొచ్చు. కానీ అభిమానులు మాత్రం ఆమెను ముద్దుగా యాక్టర్ కం యాక్టివిస్ట్ అని పిలుచుకుంటారు.
హిందీలో కబీర్ సింగ్ గా విడుదలైన సినిమాపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పి అందరితో శభాష్ అనిపించుకుంది. సినిమా అంటే అందులో నటించే నటులైనా బాధ్యతతో ఉండాలని, నటించే చిన్న పాత్ర అయినా సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని నొక్కిచెప్పింది.
స్త్రీల క్యారెక్టర్లను...
ఇటీవల బాలీవుడ్ ఫిలిం క్రిటిక్‌లో కొందరు నటీనటులతో ఒక ప్యానెల్ డిస్కషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని సినిమాలపై చర్చిస్తూ 'అర్జున్ రెడ్డి' ప్రస్తావన వచ్చినప్పుడు పార్వతి విమర్శలు చేసేందుకు వెనుకాడలేదు. విజరు పక్కనే కూర్చుని ఉన్నప్పటికీ 'హీరో పాత్ర దుడుకు స్వభావంతో హీరోయిన్ పాత్రపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉండడం.. ఆ అమ్మాయి బలహీనంగా అన్నిటికి ఒప్పుకోవడం'' సరి కాదని వాదించింది. అది స్త్రీలను.. స్త్రీల వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడమేనని సూటిగా, స్పష్టంగా చెప్పిందామె. సినిమాలో కమర్షియల్ అంశాలు ఉండాలంటే ఎవరినీ తక్కువ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. అమ్మాయి క్యారెక్టర్‌ని తక్కువచేసి అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్లను గొప్పగా చూపించాల్సిన అవసరం లేదు.
స్త్రీల సామర్ధ్యం గురించి తక్కువ చేసి మాట్లాడే డైలాగుల పై కూడా పార్వతీ మీనన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాజంలో ఉన్న ప్రతీ అంశాన్నిప్రతిబింబించేలా సినిమా ఉండాలి కానీ స్త్రీలను తక్కువగా చిత్రీకరించడాన్ని ఎంటర్ టైన్ మెంట్ గా భావించకూడదన్నారు.
క్యాస్టింగ్ కౌచ్ మీద...
లేడీ ఫైర్ బ్రాండ్ గా ఉండే పార్వతికి కూడా 'క్యాస్టింగ్ కౌచ్' కష్టాలు తప్పలేదు. సినిమా అవకాశం ఇవ్వాలంటే తమతో పడకగదికి రావాలని చెప్పే మనుషులు మలయాళ చిత్రసీమలో ఉన్నారంటూ పార్వతీ మీనన్ కొద్ది నెలల కిందట చేసిన వ్యాఖ్యలు గగ్గోలు పుట్టించాయి. ''తమతో గడపమని నన్నూ అడిగారు. అదేదో తమ హక్కు అన్నట్లుగానే అడిగారు. నేను కాదని చెప్పేశాను. ఇండిస్టీలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చాక మాత్రం వాళ్లు మనల్ని దాని కోసం అడగరు'' అని ఒక టాక్ షోలో చెప్పారు పార్వతి.
పార్వతి మీనన్ మాదిరిగా నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడేందుకు నటీమణులు ముందుకు రావాలి. అప్పుడే సినిమా రంగంలో మహిళలపై వివక్ష తగ్గడానికి అవకాశం ఉంటుంది.
స్వేచ్ఛ