Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుజాత, రవి భార్యా భర్తలు. పెండ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత అత్తా, కోడళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి. సుజాతకు వేరు కాపురం పెట్టాలని కోరిక. కానీ రవి దానికి ఒప్పుకోవడం లేదు. దాంతో భార్యా భర్తలకు అస్సలు పడడం లేదు. వేరు కాపురం పెడితే తప్ప రానని సుజాత తన మూడేండ్ల కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదవండి.
దూరపు బంధువల పెండ్లిలో రవిని మొదటి సారి చూసింది సుజాత. అతని మాట తీరు, స్టైల్ ఆమెకు బాగా నచ్చాయి. అప్పుడు సుజాత ఇంటర్ చదువుతుంది. అనుకోకుండా బంధువుల ద్వారా సుజాతకు రవి సంబంధమే వచ్చింది. అప్పటికే రవి జాబ్ చేస్తున్నాడు. నెలకు 20వేలు సంపాదిస్తున్నాడు. అబ్బాయి మంచివాడని ఇంట్లో కూడా పెండ్లికి ఒప్పుకున్నారు. సుజాత ఇంటర్ పూర్తికాగానే పెండ్లి చేద్దామనుకున్నారు. రవి ధ్యాసలో పడి సుజాత చదువు మర్చి పోయింది. దాంతో ఇంటర్ ఫేయిల్ అయింది. ఇక చదువుకోనని సుజాత చెప్పడంతో ఇద్దరికీ పెండ్లి చేశారు.
పెండ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది సుజాత. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. సుజాత ఇంటి పనులు సరిగా చేసేది కాదు. దాంతో అత్త సూటిపోటి మాటలు అనేది. ఇంటి చుట్టుపక్కల వారికి కూడా 'నా కోడలికి ఒక్క పని కూడా రాదు, వంట సరిగా చేయదు' అని చెబుతుండేది. వాళ్లందరూ సుజాతకు నీ అత్త మాతో ఇలా అంటుందని చెప్పేవారు. దాంతో ఆమె రోజురోజుకు అత్తపై కోపం పెంచుకుంది.
పగలంతా ఆఫీస్‌లో కష్టపడి వచ్చిన రవి ఇంట్లో విషయాలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. సుజాత ఎప్పుడైనా గోల చేస్తే ''అమ్మ పెద్దది కదా, చూసీ చూడనట్టు వదిలెరు' అనేవాడు. భర్త తల్లికి సపోర్ట్ చేయడం సుజాతకు నచ్చేది కాదు. దాంతో మరింత కోపం పెరిగింది. ఇంట్లో గొడవలు కూడా ఎక్కువయ్యాయి. ఈ గొడవల మధ్య రవి నలిగిపోయేవాడు. ఇటు తల్లికీ, అటు భార్యకు ఇద్దరికీ సర్ధి చెప్పలేక సతమతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే సుజాత నెల తప్పింది. డాక్టర్లు బెడ్ రెస్ట్ అని చెప్పారు. దాంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. పాప పుట్టే వరకు అక్కడే ఉండిపోయింది. పాపకు ఆరో నెలలో తిరిగి వచ్చింది. మళ్ళీ గొడవలు మొదలు. ఇక అప్పటి నుంచి భర్తతో ఎలాగైనా వేరు కాపురం పెట్టించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన తల్లికి తను తప్ప ఎవ్వరూ లేరు. ఒక్కడే కొడుకు. దాంతో రవి వేరు కాపురానికి అస్పలు ఒప్పుకోవడం లేదు.
సుజాత ఏదో ఒకటి అనడం, రవి ఆమెను కొట్టడం కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళడం, తిరిగి రావడం ఇలా రెండేండ్లు గడిచిపోయాయి. ఓరోజు సుజాత, భర్త ముందే అత్తను నానా మాటలూ అంది. అది భరించలేని రవి, సుజాతను బయటకు గెంటేశాడు. ఇక ఇంట్లోకి రావొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ కోపంతో వేరుకాపురం పెడితే తప్ప తిరిగి రానని చెప్పి సుజాత పాపను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. సుజాత పుట్టింట్లో పరిస్థితి అతంత మాత్రమే. తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు. ఇంట్లో సుజాతనే పెద్దది. ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకు పెండ్లి చేయాలి. పెద్ద కూతురు ఇలా పుట్టింట్లో ఉంటే ఎలా అని ఆ తల్లి దిగులు. ఇదంతా గమనించిన దూరపు బంధువు సుజాతను ఐద్వా లీగల్‌సెల్‌కు తీసుకొచ్చింది.
లీగల్ సెల్‌కు వచ్చిన సుజాత జరిగిందంతా సభ్యులకు చెప్పింది. ఆమె చెప్పింది విన్న సభ్యులు ''చూడు సుజాత నువ్వు అనవసరంగా సమస్య పెద్దది చేసుకుంటున్నావు. ఏ ఇంట్లో అయినా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు సాధారణంగా వుంటూనే వుంటాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుని పుట్టింటికి వస్తే ఎలా? నీకు వేరు కాపురం పెట్టాలని ఉంది. వేరుగా ఉంటే హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో. నీ ఆలోచన కరెక్టు కాదు. మీ పుట్టింట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అక్కడ మీ అత్త ఒక్కటే ఉంటుంది. మీరు వేరుగా ఉంటే మీకోసం, మీ అత్త కోసం వేరు వేరు ఇండ్లు తీసుకోవాలి. రెండు అద్దెలు కట్టాలి. ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ రవి వల్ల అవుతుంది. ఒక్క సారి ప్రశాంతంగా ఆలోచించు.
నీ కోరిక ప్రకారమే వేరు కాపురం పెడితే ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. మీ ఇద్దరి మధ్య గొడవలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. పరిస్థితులను బట్టి సర్ధుకుపోవడం నేర్చుకోవాలి. లేదంటే బతకడం కష్టం. ఇంటర్ కూడా సరిగా పూర్తి చేయలేదు. చిన్న వయసులోనే పెండ్లి చేసుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఓ బిడ్డకు తల్లివి. నీకంటూ ఓ కుటుంబం వుంది. ఇంకా చిన్నపిల్లలా ఆలోచిస్తే ఎలా. కాస్త బాధ్యగా వుంటే నీ జీవితం బాగుంటుంది. లేని పోని సమస్యలు తెచ్చుకోవద్దు'' అంటూ సుజాతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
సుజాత మాట్లాడుతూ... ''మీరు చెప్పింది కూడా నిజమే. కానీ ఆయన నాతో సరిగా మాట్లాడడు. మా అత్త గురించి మీకు సరిగ్గా తెలీదు. నేనూ నా భర్త ప్రేమగా వుంటే అస్సలు భరించదు. ఆమెతో వుంటే మేము సంతోషంగా వుండలేము. అది రవికి అర్థం కావడం లేదు. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ ఆమె చుట్టూనే తిరుగుతాడు'' అంది.
లీగల్ సెల్ సభ్యులు రవిని పిలిపించి మాట్లాడితే... ''మేడమ్ నాకు వచ్చే ఆదాయం తక్కువ. అందులోనే అన్ని ఖర్చులు చూసుకోవాలి. సుజాత ప్రతి విషయానికీ గొడవలుపెట్టుకుంటుంది. అలుగుతుంది. ఎప్పుడూ వేరు కాపురం పెడదాం అంటుంది. వేరు కాపురం అంటే మాటలు కాదు. అది నావల్ల కాదు. ఇవన్నీ చెబితే అర్థం చేసుకోదు. అందుకే నాకు కోపం వస్తుంది. పైగా చిన్నా పెద్దా లేకుండా మా అమ్మతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మా అమ్మకు నేను తప్ప ఎవ్వరూ లేరు. తన ప్రవర్తన భరించలేక కోపం వచ్చినప్పుడు కొడతాను, అలిగి పుట్టింటికి వెళుతుంది'' అని చెప్పుకొచ్చాడు.
''ఏది ఏమైనా భార్య కోరే చిన్న చిన్న కోర్కెలు తీర్చడం భర్తగా నీ బాధ్యత. అప్పుడప్పుడు నీతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలని ఆమెకు ఉంటుంది. నవ్వు కష్టపడుతున్నావు. కానీ సంతోషం, మనశ్శాంతి లేదు. వారంలో కనీసం ఒక్క పూట సుజాతను బయటికి తీసుకెళ్ళు. అమ్మను ఒక్కదాన్నే వదిలిపెట్టి వెళ్ళడానికి నువ్వ ఇబ్బంది పడుతున్నట్టున్నావు. మీ అమ్మ మీతో వుండడం వల్లనే నువ్వు తనతో ప్రేమగా ఉండడం లేదనుకుంటుంది సుజాత. అందుకే అత్తాకోడళ్ళ మధ్య ఇన్ని గొడవలు. కాబట్టి ముందు సుజాతలో ఆ ఆలోచన రాకుండా చేయాల్సిన బాధ్యత భర్తగా నీదే. పాప కూడా వుంది కాబట్టి అమ్మతో పాపను తీసుకుని అలా బయటకు వెళ్ళివస్తామని చెప్పి ముగ్గురూ సరదాగా బయటకు వెళ్ళిరండి. మేము సుజాతతో మాట్లాడాం. నువ్వు కాస్త ఆమెతో ప్రేమగా ఉంటే చాలు. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి'' అన్నారు సభ్యులు.
ఇద్దరూ లీగల్‌సెల్ సభ్యులు చెప్పిన ప్రకారమే చేస్తామన్నారు. వారిద్దరినీ ఒప్పించడానికి లీగల్ సెల్ సభ్యులకు సుమారు ఐదు వారాలు పట్టింది. సుజాత అప్పుడప్పుడు లీగల్‌సెల్‌కు ఫోన్ చేసి సభ్యులతో మాట్లాడుతుంది. ఈ మధ్యనే సుజాత ఫోన్ చేసి ''మేడమ్ నేను మళ్ళీ నెల తప్పాను. ఇప్పుడు రవి కూడా నాతో ప్రేమగానే వుంటున్నాడు. మా అత్త మాత్రం ఏదో గొణుగుతూనే వుంటుంది. ఆమె మాటలను ఇదివరకటిలా పట్టించుకోవడం లేదు. మీరు చెప్పిన తర్వాత రవిలో చాలా మార్పు వచ్చింది'' అంటూ సంతోషంగా చెప్పింది.