Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ జేెఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ
నవతెలంగాణ-మెదక్ అర్బన్
సీపీఎస్ విధానం రద్దు చేయాలని, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలు ధరించి మెదక్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు భద్రత కరువైందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 20 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు సీపీఎస్ విధానంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ అనేది ఉద్యోగుల హక్కు అని వారు చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ప్రణీత్, మల్లారెడ్డి, సత్యనారాయణ, రాజ్‌గోపాల్, యాదవరెడ్డి, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.
జగదేవపూర్: సీపీఎస్ రద్దు కోసం జాక్టో ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించేన ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నాకు మద్దతుగా, జగదేవపూర్ టీటీఎఫ్ మండల శాఖ తరుపున తరలివెళ్లారు. దుబ్బ శ్రీనివాస్‌రావు, నేతి శంకర్, టీటీఎఫ్ నాయకులు అధిక సంఖ్యలో ర్యాలీకి తరలివెళ్లారు. కేజీబీవీలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యుటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టే కలెక్టరేట్ ఎదుట ధర్నాకు జిల్లా నాయకులు వెంకట కిరణ్, వెంకటేశ్, టీఎస్ యుటీఎఫ్ మండలాధ్యక్షులు రాంచంద్రం, రమేశ్, కేజీవీబీ ఎస్‌ఓ శారధ, మహిళ నాయకురాలు నిర్మలలు జగదేవపూర్ నుంచి తరలివెళ్లారు.
తొగుట: సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న సామూహిక సెలవు పెడుతున్నట్టు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు సోమవారం సామూహిక సెలవు పత్రాన్ని ఎంపీడీఓ రాజిరెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. ఓపీఎస్ విధానమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందు కోసం సెప్టెంబర్1న సామూహిక సెలవు పెట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలుపు తామన్నారు. ఆ రోజును ఖలాఫత్ దివస్‌గా పరిగణించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు జగన్ మోహన్, ఎన్.నర్సింలు, పి.నర్సింలు, జీ.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
మిరుదొడ్డి: ఉపాధ్యాయులు ఎంఈఓ ప్రభుదాస్‌కు సెప్టెంబర్1న సెలవు పెట్టనున్నట్టు సెలవు పత్రాలను మూకుమ్మడిగా అందించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు అందె రాంచంద్రం, టీపీయుఎస్ మండలాధ్యక్షులు మధు సుదన్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలు చేసేంత వరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. 1న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్, టీపీయుఎస్ నాయకులు మల్లేశం, యాదగిరి, అమరేందర్ రెడ్డి, శివాజీ, గౌతమి తదితరులు పాల్గొన్నారు.