Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్నాహక సమావేశంలో పల్లా
నవతెలంగాణ-మిర్యాలగూడ
నీళ్లు, నిధులు, నియామకాలతో తెచ్చుకున్న తెలంగాణలో అన్నీ అమలు పర్చడంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక టీఎన్‌ఆర్ గార్డెన్‌లో పట్టణ పట్టభద్రులకు, మధ్యాహ్నం ఎస్వీ గార్డెన్స్‌లో మిర్యాలగూడ రూరల్, ఉమ్మడి దామరచర్ల, ఉమ్మడి వేములపల్లి మండలాల్లోని గ్రామాల పట్టభద్రులతో ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే భాస్కర్‌రావు అధ్యక్షత వహించగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఆరేండ్ల కాలంలో లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా వివిధ శాఖల్లో 35 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. పోలీస్ రిక్రూర్‌మెంట్ ద్వారా 31,972 పోస్టులు భర్తీ చేశామన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 9355, గురుకులాలలో 3623, విద్యుత్ శాఖలో నేరుగా తొమ్మిది వేల మందిని నియమించామన్నారు. ఆర్డీజెన్స్‌తో 24 వేల మందిని పర్మినెంట్ చేశామన్నారు. సింగరేణిలో 13,100 పోస్టులు భర్తీ చేశామని, ప్రైవేటు రంగంలో 14.47 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఒక ఐటీ రంగంలోనే దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. వ్యవసాయ శాఖలో 4వేల మందిని ఏఈఓలుగా నియమించామన్నారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పించామని చెప్పారు. వీటిలో ఏ ఒక్కటి నిజం కాకపోయినా తన ముక్కు నేలకు రాసుకుంటానని, ప్రజలకు క్షమాపణ చెబుతానని, దీనికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా సిద్ధమేనా..? అని సవాల్ విసిరారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, వాటిని పట్టభద్రులు చైతన్యవంతులై తిప్పికొట్టాలన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, ఎంపీపీలు నూకల సరళ, మాజీ మార్కెట్ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జొన్నలగడ్డ రంగా రడ్డి, అన్నబీమోజు నాగార్జునచారి, నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.