Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన రైతుల రాస్తారోకో
నవతెలంగాణ - తిరుమలగిరి సాగర్
పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ మండలంలోని సుంకిషాల తండాకు చెందిన గిరిజన రైతులు బుధవారం స్థానిక ఎక్స్‌రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ 60 ఏండ్ల క్రితం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముంపులో సుంకిశాలతండా పూర్తిగా మునిగి పోయిందన్నారు. దీంతో తమను కొంపల్లి సమీపంలోని గుట్టపై పునరావాసం కల్పించారని చెప్పారు. అప్పటి నుంచి అక్కడి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ఇందులో కొంతమందికి మాత్రమే పాసుపుస్తకాలు ఇచ్చారని, అవి కూడా భూ ప్రక్షళనలో భాగంగా ఆ భూములను పార్ట్ -బిలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేక, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై సుధాకర్ అక్కడికి వచ్చి ఫోన్‌లో ఆర్డీవోతో మాట్లాడారు. రైతుల సమస్యలన్నీ విచారించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో కెలావత్ రామకృష్ణ, నగేష్, కొర్ర శంకర్‌నాయక్, హాతిరాం, సురేష్, దేవ్‌సింగ్, తావు బాలు, జ్వోతి, ద్వాలి, సొనాలి, బాజు తదితరులు పాల్గొన్నారు.