Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో రోడ్డున పడ్డ పీటీఐ ఉద్యోగులు
- 10 నెలలుగా జీతాలూ చెల్లించని ప్రభుత్వం
- విధుల్లోకి తీసుకోక పోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం : పీటీఐ ఉద్యోగులు
నవతెలంగాణ - సూర్యాపేట
సర్వశిక్షా అభియన్ కింద పాఠశాలల్లో పీటీఐలుగా పని చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కరోనా పేరుతో మూత పడ్డ పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. సర్వశిక్షా అభియాన్ కింద మొత్తం 14 విభాగాలు ఉండగా ప్రభుత్వం కేవలం పీఐటీలను మాత్రమే విధుల్లోకి తీసుకోలేదు. ఇటు విధుల్లోకి తీసుకోక, మరో వైపు 10 నెలలుగా వేతనాలూ రాక వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ..ఇన్నీ కావు.
సర్వ శిక్షా అభియాన్ కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కళా, వృత్తి, వ్యాయామ, కంప్యూటర్ ఉపాధ్యాయులుగా నల్లగొండ జిల్లాలో 190, సూర్యాపేట జిల్లాలో 178, యాదాద్రి భువనగిరి జిల్లాలో 70 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరు 2012 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సాకుతో 2020 - 2021 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క విభాగాన్ని మాత్రమే విధుల నుండి పక్కకు పెట్టింది. సర్వ శిక్షా అభియాన్ కింద మొత్తం 14 విభాగాలు ఉండగా అందులో కేజీవీబీ, యూఆర్‌ఎస్, ఐఈఆర్‌ఎస్, ఎంఐఎస్, ఏల్దిఏలు పని చేస్తుండగా కేవలం పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ (పీటీఐ)లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.
10 నెలలుగా అందని వేతనాలు
కరోనా పుణ్యమా అని పీటీఐ ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమకు ఇచ్చే రూ.9000 కూడా పది నెలలుగా ఇవ్వక పోవడంతో వారి కుటుంబాలు అర్థాకలితో అలమటిస్తున్నాయి. 6 నుంచి 14 ఏండ్ల బాల బాలికలందరికీ ఉచిత, నిర్బంధ విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2001లో సర్వ శిక్షా అభియాన్‌ను ప్రవేశ పెట్టింది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా ఇవ్వడంలో జాప్యం చేయడం వల్లే తమకు వేతనాలు ఇవ్వడం లేదని, భారమవుతున్నామనే కారణంతో తమను పక్కన పెట్టినట్టు తెలుస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ప్రగతి భవన్ ముట్టడికి సన్నాహాలు
తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీఐటీలు పోరాట కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను కలిసినా స్పందించడం లేదని, త్వరలో ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, లాఠీలతో కొట్టినా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు.
ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం : గడ్డం శ్రీనివాస్
కళా, వత్తి, వ్యాయామ, కంప్యూటర్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కన్వీనర్
రాష్ట్ర వ్యాప్తంగా 2600 మంది ఉపాధ్యాయ కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు సుముఖంగా లేరు. తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ఎలాంటి స్పందనా లేదు. అందుకే ప్రగతి భవన్ ముందు నిరసన చేయడానికి సిద్ధమవుతున్నాం.
విధుల్లో ఉన్నది, జీతాలు వచ్చేది నాకు తెలియదు
షాహిన్, సూపరింటెండెంట్, జిల్లా విద్యా శాఖ కార్యాలయం, సూర్యాపేట
పీటీఐ ఉద్యోగుల సమస్యల పట్ల వివరణ కోరేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి మదన్‌మోహన్‌ను ఫోన్‌లో విరవణ కోరగా ఆయన స్పందించలేదు. కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ శైలజ ఫోన్ పని చేయలేదు. చివరికి కార్యాలయ సూపరింటెండెంట్ షాహిన్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఎస్‌ఎస్‌వైలో పని చేస్తున్న ఉద్యోగులు విధుల్లో ఉన్నారని, దీనిపై తమకు పూర్తిగా అవగాహన లేదన్నారు. వారు ఉన్నారో, లేదో..వారికి వేతనాలు కూడా వచ్చేది..రానిది కనుక్కొని చెప్తానని చెప్పారు.